సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే ప్రమాణస్వీకారం చేశారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ సహా ఇతర నాయకులు హాజరయ్యారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఖర్గేకు.. సోనియా, రాహుల్ పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సోనియా కాంగ్రెస్ సారథ్య బాధ్యతలను ఖర్గేకు అప్పగించారు.
అనంతరం మాట్లాడుతూ ఖర్గే ఎంతో అనుభవం ఉన్న నాయకుడని కొనియాడారు సోనియా. ఆయన సారథ్యంలో కాంగ్రెస్ మరింత ముందుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఖర్గే తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీ ముందు ఎన్నో సవాళ‍్లు ఉన్నాయని, వాటిని అధిగమిస్తారని పేర్కొన్నారు.
ఖర్గే మాట్లాడుతూ.. కాంగ్రెస్ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష‍్యమన్నారు. పార్టీలోని అందరి సహకారం తనకు చాలా అవసరమని పేర్కొన్నారు. తనపై నమ్మకం ఉంచి అధ్యక్షుడిగా ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. సోనియా గాంధీ ఏనాడు పదవులు ఆశించలేదని కొనియాడారు. ఆమె నేతృత్వంలో కాంగ్రెస్ రెండుసార్లు అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు విశేష స్పందన లభిస్తోందని ఖర్గే చెప్పారు. అలాగే అధికార బీజేపీపై విమర్శలు గిప్పించారు ఖర్గే. కమలం పార్టీ దేశంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని మండిపడ్డారు.
ఇటీవల జరిగిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో శశిథరూర్‌పై ఖర్గే ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దాదాపు 25 ఏళ్ల తర్వాత హస్తం పార్టీ పగ్గాలు చేపట్టిన గాంధీ కుటుంబేతర నేతగా ఆయన అరుదైన ఘనత సాధించారు. జగ్‌జీవన్ రామ్ తర్వాత ఆ పదవి చేపట్టిన రెండో దళిత నేతగా నిలిచారు.
చదవండి: నికార్సైన కాంగ్రెసోడా.. మునుగోడుకు రా!
Comments
Please login to add a commentAdd a comment