సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా ఏఐసీసీ గురువారం కీలక సమావేశం ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ లీడర్లు, రాష్ట్రాల ఇంఛార్జ్‌లు పాల్గొన్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో దాదాపు మూడు గంటలకు పైగా సమావేశం కొనసాగింది. ఈ సందర్భంగా రానున్న లోక్‌సభ ఎన్నికలు, రాహుల్ చేపట్టనున్న ‘భారత్ న్యాయ్ యాత్ర’పై కాంగ్రెస్ హైకమాండ్ చర్చించింది.
ఏఐసీసీ సమావేశం సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. 2024 లోక్‌సభ ఎన్నికలలో విజయం సాధించడమే తమ ఎజెండా అని తెలిపారు. భారత్ న్యాయ్ యాత్ర కోసం సిద్ధం కావాలని సూచించారు. ఇండియా కూటమితో సీట్ల పంపకంపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. దేశ వ్యాప్తంగా 8 నుంచి 10 భారీ బహిరంగ సభలు సంయుక్తంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. మేనిఫెస్టో కమిటీ కూడా ఆ దిశగా పనిచేస్తోందన్నారు.
‘పగలు రాత్రి కష్టపడితేనే 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని అందించగలుగుతాం. మనం బలహీనంగా ఉన్న సీట్లను గుర్తించాలి. చరిత్రలో తొలిసారిగా 146 మంది ఎంపీలను అప్రజాస్వామిక పద్ధతిలో సస్పెండ్ చేశారు. క్రిమినల్ లా బిల్లులు, టెలికమ్యూనికేషన్ బిల్లు, CEC బిల్లు వంటి బిల్లులు చర్చ లేకుండా ఆమోదించారు’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment