Central elections committee
-
కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీలో ఉత్తమ్
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం నూతనంగా 16 మంది సభ్యులతో కేంద్ర ఎన్నికల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కీలక కమిటీలో తెలంగాణ నుంచి పార్టీ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డికి చోటు కల్పించారు. మల్లికార్జున ఖర్గే ఈ కమిటీని ఏర్పాటు చేయగా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీలో మల్లికార్జున ఖర్గే, సోనియా గాందీ, రాహుల్ గాందీ, అంబికా సోని, అదీర్ రంజన్ చౌదరి, సల్మాన్ ఖుర్షీద్, మధుసూదన్ మిస్త్రీ, ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, టీఎస్ సింగ్ దేవ్, కేజే జార్జ్, ప్రీతమ్ సింగ్, మహమ్మద్ జావేద్, అమీ యాజ్ఞిక్, పీఎల్ పునియా, ఓంకార్ మార్కం, కేసీ వేణుగోపాల్‌లు ఉన్నారు. ఉత్తమ్ సేవలను అధిష్టానం గుర్తించింది వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)తో సమానంగా పరిగణించే కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ)లో ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డికి చోటు లభించడం పట్ల రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సీఈసీలో తెలుగు రాష్ట్రాల నుంచి గత మూడు, నాలుగు దశాబ్దాలుగా ఎవరికీ అవకాశం లభించలేదు. ఈ పదవిలో ఆయన ఐదేళ్ల పాటు కొనసాగనున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసే ఈ కమిటీలో ఉత్తమ్‌కు హైకమాండ్ స్థానం కల్పించడం విశేషం. రాష్ట్ర మంత్రిగా, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, అధ్యక్షునిగా, 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఆయన పార్టీకి చేసిన సేవలను అధిష్టానం గుర్తించిందని, ఆయన నిబద్ధతకు ఇదో నిదర్శనమని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్ అధిష్టానానికి, గాంధీ కుటుంబానికి ఉత్తమ్‌పై ఉన్న నమ్మకం మరోమారు రుజువైందని చెపుతున్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఫైటర్ పైలట్ గా సేవలందించిన ఉత్తమ్‌కుమార్, భారత రాష్ట్రపతి కార్యాలయంలో ఉన్నతోద్యోగిగా పనిచేస్తున్న సమయంలో రాజకీయాల్లోకి వచ్చారు. 1994లో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన మూడు దశాబ్దాలుగా పార్టీలో కొనసాగుతున్నారు. -
పార్టీల నగదు విరాళాలపై నియంత్రణ.. కేంద్రానికి ఈసీ లేఖ
న్యూఢిల్లీ: ఎన్నికల సంస్కరణలకు సంబంధించి కీలక ప్రతిపాదనలను కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి తెరపైకి తెచ్చింది. ‘‘పార్టీలకు అందే విరాళాల విషయంలో మరింత పారదర్శకత అవసరం. ప్రస్తుతం రూ.20 వేలున్న అనామక నగదు విరాళాల పరిమితిని రూ.2 వేలకు తగ్గించాలి. మొత్తం విరాళాల్లో అవి 20 శాతానికి/రూ.20 కోట్లకు (ఏది తక్కువైతే దానికి) మించరాదు’’ అని పేర్కొంది. ఇలాంటి పలు సంస్కరణలను ప్రతిపాదిస్తూ కేంద్ర న్యాయ మంత్రి కిరెణ్ రిజిజుకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్‌కుమార్ లేఖ రాసినట్టు సమాచారం. వీటికి కేంద్రం ఆమోదం లభిస్తే రూ.2,000కు మించి ప్రతి నగదు విరాళానికీ పార్టీలు లెక్కలు చూపించాల్సి ఉంటుంది. -
ఎన్నికలపై మోదీ, షా కీలక భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది. ఈ భేటీలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అలాగే పొత్తులపై కూడా వారి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కీలకమైన మహారాష్ట్రలో శివసేనతో పొత్తుపై సుదీర్ఘ చర్చ జరిగినట్లు సమాచారం. మరోవైపు ఎన్నికల్లో బరిలో నిలిచే అభ్యర్థుల గురించి మోదీ వద్ద నడ్డా ప్రస్తావించినట్లు తెలిసింది. నామినేషన్లకు సమయం అసన్నమవ్వడంతో ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలని నడ్డా ప్రతిపాదించారు. దీనికి సానుకూలంగా స్పందించిన మోదీ, షా త్వరలోనే అభ్యర్థుల జాబితాకు ఆమోదం తెలుతామన్నట్లు సమాచారం. ఇక తెలంగాణలోని హుజూర్నగర్ ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది. స్థానిక బీజేపీ నేత డా. కోట రామారావును తమ అభ్యర్థిగా బరిలో నిలపుతున్నట్లు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా అధికారికంగా ఆదివారం ప్రకటించారు. అలాగే దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరుగునున్న 32 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు కూడా అభ్యర్థులను ప్రకటించారు. -
వాటిని ప్రచారానికి వాడుకోరాదు
- ప్రజాధనాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని, బహిరంగ ప్రదేశాల్ని ఉపయోగించుకోరాదు - రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాజకీయ పార్టీలు ప్రజాధనాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని, బహిరంగ ప్రదేశాల్ని ప్రచారం కోసం వినియోగించుకోరాదని కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) ఆదేశించింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి కె.ఎఫ్.విల్ఫ్రెడ్ ఈ మేరకు అన్ని రాజకీయపార్టీల అధ్యక్షులు/ప్రధాన కార్యదర్శులు/చైర్పర్సన్లు/కన్వీనర్లకు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. పార్టీ, పార్టీ గుర్తు గురించి ప్రచారం చేసుకోవడానికి అన్ని పార్టీలకు సమాన అవకాశాలున్నప్పుడే స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికలు జరిపినట్లు అవుతుందనే ఉద్దేశంతో ఈ ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. బీఎస్పీ వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు బహిరంగ స్థలాలు, ప్రజాధనాన్ని పార్టీలు ప్రచారానికి వినియోగించుకోవడంపై మార్గదర్శకాలు జారీ చేయాలంటూ జూలై 7న ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాల్ని పరిగణనలోకి తీసుకున్న సీఈసీ జాతీయ, రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన అన్ని పార్టీల అభిప్రాయాలనూ స్వీకరించింది. వాటి నుంచి వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకున్న సీఈసీ తాజాగా ఈ అంశంపై అన్ని పార్టీలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఏ పార్టీ ప్రజాధనాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని, బహిరంగ ప్రదేశాల్ని ప్రచారానికి వినియోగించుకోరాదని అందులో స్పష్టం చేసింది. పార్టీ, గుర్తుల ప్రచారానికి ప్రభుత్వ స్థలాల్ని వినియోగించుకోరాదని సూచించింది. దీన్ని ఉల్లంఘిస్తే రాజకీయపార్టీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.