సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేత ఎ.రేవంత్‌రెడ్డితో ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ రామచంద్ర కుంతియా భేటీ అయ్యారు. శనివారం రేవంత్ నివాసానికి వెళ్లిన కుంతియా గంటకుపైగా సమావేశమయ్యారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు కూడా ఉన్నారు.అనంతరం కుంతియా మాట్లాడుతూ, రేవంత్ చేరిక కాంగ్రెస్ బలోపేతానికి ఉపయోగపడుతోందన్నారు.
కేసీఆర్ అధికారంలోకి రావడానికి ఇచ్చిన అబద్ధపు హామీలు, మోసాలపై రేవంత్ సహా ముఖ్య నేతలంతా ఎండగడతారని చెప్పారు. రేవంత్‌తో భేటీలో రాజకీయ ప్రాధాన్యత ఏమీ లేదని స్పష్టం చేశారు. పార్టీలో చేరిన సందర్భంగా మర్యాదపూర్వకంగానే భేటీ జరిగినట్లు తెలిపారు. రాష్ట్రంలో రాహుల్ పర్యటన ఇంకా ఖరారు కాలేదని చెప్పారు. గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో రాహుల్ బిజీగా ఉన్నారని, త్వరలోనే రాష్ట్ర పర్యటన ఖరారు అవుతుందని వెల్లడించారు.
టీఆర్‌ఎస్ ఉపాధి కూలీగా రమణ: రేవంత్‌రెడ్డి
డిసెంబర్ 9 తర్వాత సీఎం కేసీఆర్ నిద్రపోరని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. డిసెంబర్ 9 నుంచి కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయని, ఆ తర్వాత కేసీఆర్ ఆలోచనలన్నీ తన చుట్టూనే తిరుగుతాయని పేర్కొన్నారు. రాజకీయంగా ఎత్తుగడలు తనకూ ఉన్నాయని చెప్పారు. చెప్పాల్సిన అంశాలన్నీ టీడీపీ అధినేత చంద్రబాబుకు చెప్పానని, టీడీపీ ముసుగులో ఉంటూ కేసీఆర్ ఇస్తున్న ఉపాధి కూలీతో బతుకుతున్న ఎల్.రమణ వంటి నాయకులకు చెప్పాల్సిందేమీ లేదని ధ్వజమెత్తారు.
‘కేసీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న నాపై నోరుపారేసుకున్న రమణ.. అదే సమయంలో టీఆర్‌ఎస్‌లో చేరిన భూపాల్‌రెడ్డి గురించి ఎందుకు మాట్లాడటం లేదు. కొడంగల్‌లో సభ పెడతానంటున్న టీడీపీ నేతలు గజ్వేల్‌లో, సిద్దిపేటలో ఎందుకు సభలు పెట్టడంలేదో చెప్పాలి’అని సవాల్ చేశారు. టీడీపీ ముసుగును తీసేసి టీఆర్‌ఎస్‌లో చేరడం రమణకు మంచిదని సూచించారు. టీడీపీ ముసుగులో టీఆర్‌ఎస్ ఉపాధి కూలీగా రమణ పని చేస్తున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
ఇలాంటి ఉపాధి కూలీల సర్టిఫికెట్లు తనకు అవసరం లేదన్నారు. టీడీపీ నేతలందరినీ టీఆర్‌ఎస్‌లో చేర్పించిన తర్వాతనే రమణ టీఆర్‌ఎస్‌లో చేరుతారని ఆరోపించారు. కొడంగల్‌లో రమణను ఎవరు గుర్తిస్తారని, ముందుగా తన నియోజకర్గమైన జగిత్యాలలో సభ పెట్టుకుని గెలవాలని సూచించారు. రమణ వంటి ఉపాధి కూలీలపై కాదు, కేసీఆర్‌పైనే తన యుద్దమని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment