సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడుతున్న థర్డ్‌ఫ్రంట్ నాటకం బూటకమని, అది తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఆడుతున్న డ్రామా అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి రామచంద్ర కుంతియా ధ్వజమెత్తారు. 2014 ఎన్నికల హామీలలో ఏ ఒక్కటీ నెరవేర్చని సీఎం కేసీఆర్, డిసెంబర్‌లో జరిగే ఎన్నికలకు వెళ్తే ప్రజలు నిలదీస్తారని భావించి వారిని తప్పుదోవ పట్టించేందుకు ఫ్రంట్ పేరుతో కొత్త నాటకానికి తెర తీశారని అన్నారు.
ప్రధాని నరేంద్రమోదీ వ్యతిరేక ఓటు బ్యాంకును చీల్చేందుకే కేసీఆర్ ఈ ఎత్తుగడ వేశారని ఆరోపించారు. మోదీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని బయటికి మాత్రం వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని అన్నారు. టీపీసీసీ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మొదటి విడత ప్రజాచైతన్య బస్సుయాత్ర ముగింపుసభ గురువారంరాత్రి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో జరిగింది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం అధ్యక్షతన జరిగిన ఈ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన కుంతియా మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కలసికట్టుగా పనిచేయాలన్నారు. టీఆర్‌ఎస్ పాలనలో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం కలగలేదన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు కలసికట్టుగా పని చేయాలని అన్నారు.
విలాసవంతమైన జీవితంలో కేసీఆర్ కుటుంబం: ఉత్తమ్
రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి, థర్డ్ ఫ్రంట్ పేరుతో సీఎం కేసీఆర్ నాటకాలు ఆడుతున్నారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ బస్సుయాత్రకి ఎవరూ రావడం లేదని కేసీఆర్ అంటున్నారని, ఆయన మాటలకు హుజూరాబాద్‌లో సభే సమాధానం చెబుతుందన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం విలాసవంతమైన జీవితం గడుపుతోందన్నారు.
వ్యవసాయ పెట్టుబడి కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమే అని పేర్కొన్నారు. 2019లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ఖమ్మంలో రైతులు మిర్చి పంటకు మద్దతు ధర ఇవ్వమంటే బేడీలు వేసి జైలుకు పంపిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. ప్రభుత్వాలు ప్రజల అవసరాలు తీర్చేలా ఉండాలని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రం అప్రజాస్వామిక పరిపాలన సాగిస్తోందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
ఈటల జైలుకు వెళ్లకతప్పదు: రేవంత్
ఆదర్శాలను వల్లించే హుజూరాబాద్ ఎమ్మెల్యే, మంత్రి ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్థిక, పౌరసరఫరాల శాఖలో భారీ అవినీతి, అక్రమాలు జరిగాయని, కోట్ల రూపాయలను ఈటల అక్రమంగా సంపాదించుకున్నారని ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కస్టమ్ మిల్లింగ్ కింద రైసుమిల్లర్లకు రా రైసుకు క్వింటాల్‌కు రూ.15, బాయిల్డ్‌కు క్వింటాల్‌కు రూ.25 చెల్లించాల్సి ఉండగా, రూ.30, రూ.50 పెంచి రూ.70 కోట్ల అదనపు భారం పడేలా చేశారని, ఇందులో పెద్దమొత్తంలో చేతులు మారాయని అన్నారు.
రవాణా, ఇతర ఖర్చుల కింద మిల్లర్లకు రూ.270 కోట్లు చెల్లించారని, ఇందులోనూ పెద్ద మొత్తంలో లంచంగా తీసుకోగా, ఆడిట్ అభ్యంతరాలతో బయటపడిందన్నారు. ప్రాజెక్టుల రీడిజైన్ పేరిట రూ.కోట్ల కుంభకోణం జరిగితే గుడ్డిగా సంతకం చేసిన ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్.. కేసీఆర్‌తోపాటు జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు. ఈ సభలో కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, వి.హన్మంతరావు, జీవన్‌రెడ్డి, శ్రీ«ధర్‌బాబు, పొన్నం, బలరాంనాయక్, టి.సంతోష్‌కుమార్, వెంకటరమణారెడ్డి,శారద పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment