
సాక్షి, చెన్నై : జాతీయ రాజకీయాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా, ప్రాంతీయ పార్టీలతో కూటమిని ఏర్పాటుచేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు తీవ్రంగా శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా ఇప్పటికే వివిధ రాష్ట్రాల నాయకులను ఆయన కలుస్తూ వచ్చారు. బెంగాల్ సీఎం మమతాబెనర్జీ, దేవేగౌడ, కుమారస్వామి, అఖిలేశ్ యాదవ్ తదితరులు కలిసిన ఆయన చెన్నైకి వెళ్లి డీఎంకే అధినేత కరుణానిధి, ఆయన తనయుడు స్టాలిన్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. డీఎంకే నేతలతో సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా చర్చలు జరిపారు. డీఎంకే ఎంపీ, కరుణానిధి తనయురాలు కనిమొళితో కూడా సమావేశమై.. కేసీఆర్ చర్చలు జరిపారు.
ఈ నేపథ్యంలో తాజాగా కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్‌పై స్పందించిన డీఎంకే ఎంపీ కనిమొళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని వదులుకునే ఆలోచనే లేదని, ఆ పార్టీతో పొత్తు కొనసాగుతుందని కనిమొళి స్పష్టం చేశారు. ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు ప్రాథమిక స్థాయిలోనే ఉన్నాయని చెప్పారు. ఈ విషయంలో భావసారూప్యత కలిగిన పార్టీలతో కలిసి ముందుకు సాగుతామన్నారు. కాంగ్రెస్, బీజేపీ రహిత ఫ్రంట్ ఏర్పాటు కోసం కేసీఆర్ ప్రయత్నిస్తుండగా.. కాంగ్రెస్‌కు దూరం జరగబోమని కనిమొళి చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment