సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో ఏడేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఓటర్లను మతం చుట్టూ తిప్పడం మినహా ఎలాంటి అభివృద్ధి చేయలేదని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా మారుస్తామన్న ప్రకటనలు ఉత్తి రాజకీయ స్టంట్ అని విమర్శించారు. గురువారం కేటీఆర్ ట్విట్టర్‌లో ‘ఆస్క్ కేటీఆర్’ పేరిట నెటిజన్లతో సంభాషించారు. ట్విట్టర్‌లో జాతీయస్థాయి పాలిటిక్స్ కేటగిరీ ట్రెండింగ్‌లో ఈ సెషన్ తొలిస్థానంలో నిలవడం గమనార్హం. ఇందులో కేటీఆర్ ఇచ్చిన సమాధా నాలు, చెప్పిన పలు అంశాలివీ..
జాతీయ రాజకీయాలపై చెప్పలేం..
‘దేశ శ్రేయస్సు కోసం ప్రాంతీయ పార్టీలను ఒకే వేదిక మీదకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న కేసీఆర్.. జాతీయ రాజకీయాల్లోకి వెళతారా?’ అని గట్ల సతీశ్ అనే నెటిజన్ ప్రశ్నించగా.. ‘‘సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే విషయాన్ని ఇప్పుడే ఎలా చెప్పగలం? భవిష్యత్తులో ఏం రాసిపెట్టి ఉందో ఎవరికి తెలుసు?..’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామంటూ గతంలో ప్రధాని మోదీ ఇచ్చిన హామీ.. ఈ శతాబ్దంలోనే అతిపెద్ద అబద్ధం (జుమ్లా ఆఫ్ ది సెంచురీ)గా అభివర్ణించారు. ఐటీ రంగంలో తెలంగాణ కంటే మహారాష్ట్రలోని పుణే బాగా రాణిస్తోందంటూ రాష్ట్ర బీజేపీ ఎంపీలు చేస్తున్నవి మూర్ఖపు వ్యాఖ్యలని.. వాటిని వదిలేయడమే ఉత్తమమని పేర్కొన్నారు.
యూపీలో బీజేపీకి వ్యతిరేకంగా..
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు సమాజ్‌వాదీ పార్టీకి మద్దతుగా టీఆర్‌ఎస్ ప్రచారం చేస్తుందా అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. ఈ విషయంలో వారితో సంప్రదింపులు జరిగాక వెల్లడిస్తామని కేటీఆర్ చెప్పారు. యూపీ బీజేపీ ప్రభుత్వం నుంచి ముగ్గురు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేలు బయటికి రావడమంటే.. త్వరలో అక్కడ జరిగే ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ పట్ల ఓటర్ల మొగ్గును సూచిస్తోందన్నారు.
►‘జాతీయ రాజకీయాల్లో, కేంద్ర ఐటీ మంత్రిగా మిమ్మల్ని చూడాలనుకుంటున్నాం’ అని కొందరు నెటిజన్లు ప్రస్తావించగా..
రాష్ట్రంలో అందిస్తున్న సేవల పట్ల సంతోషంగా ఉన్నానని, ఇక్కడి ప్రజలకు ప్రాతినిధ్యం వహించడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని కేటీఆర్ చెప్పారు.
∙టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అంశాన్ని ఓ నెటిజన్ ప్రస్తావించగా.. ‘‘రేవంత్ నాతో కాకుండా ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో చర్చిస్తే మంచిది. రేవంత్ లాంటి నేరస్తులు, 420లతో చర్చల్లోకి దిగ బోను.’’ అని వ్యాఖ్యానించారు.
కరోనా పరిస్థితిని బట్టి లాక్‌డౌన్
ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా కేసుల సంఖ్య పెరగడం, లేదా వైద్యారోగ్యశాఖ అధికారులు చేసే సూచనల మేరకు లాక్‌డౌన్ లేదా నైట్ కర్ఫ్యూపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కేటీఆర్ చెప్పారు. ఇంటింటికి ఇంటర్‌నెట్ అందించే టీఫైబర్ తొలిదశ పనులు ఏప్రిల్ నాటికి పూర్తవుతా యని తెలిపారు. ఇక వరంగల్‌లో బస్టాండ్ నిర్మాణం, ములుగు జిల్లా కమలాపురంలో బిల్ట్ పరిశ్రమ పునరుద్ధరణ, గ్రేటర్ హైదరా బాద్‌లో పారిశుధ్యం, రోడ్లు, ఫ్లైఓవర్ల అంశాలపైనా కేటీఆర్ స్పందించారు.
Comments
Please login to add a commentAdd a comment