నోట్ల రద్దుపై గ్రామస్థాయిలో ఉద్యమం
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి కుంతియా
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంపై గ్రామస్థాయి నుంచి పెద్ద ఎత్తున ఉద్య మించాలని ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ చార్జి రామచంద్ర కుంతియా సూచించారు. పార్టీ నేతలతో గాంధీ భవన్ లో మంగళవారం సమావేశమైన ఆయన మాట్లాడుతూ, పెద్ద నోట్ల రద్దు వల్ల నల్లధనం రాకపోగా పేదల కష్టాలు, చిల్లర కరెన్సీ కోసం ఇబ్బందులు పెరిగాయని అన్నారు. నోట్ల రద్దు నల్ల కుబేరులకు లాభం చేస్తూ పేదలకు నష్టం కలిగించేలా ఉందని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ సాహిత్యం, పార్టీ సిద్ధాంతం, పార్టీ నాయకుల కార్యక్రమాలను కార్యకర్తలకు ఎప్పటికప్పుడు చేరవేయడానికి కాంగ్రెస్ సందేశ్ పుస్తకాలను మరింత విస్తృతం చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, ప్రధాన కార్యదర్శి మహేశ్ కుమార్ గౌడ్, అధికార ప్రతినిధులు, ముఖ్యనేతలు పాల్గొన్నారు.