జాబువా/రెవా: దేశంలో వేళ్లూనుకున్న అవినీతిని నిర్మూలించేందుకు, నల్లధనాన్ని బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకొచ్చేందుకు నోట్లరద్దును ఒక చేదు ఔషధంగా ప్రయోగించినట్లు ప్రధాని మోదీ అన్నారు. మధ్యప్రదేశ్‌లోని జాబువా, రెవాల్లో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మాట్లాడారు. ఈ నెల 28న జరిగే పోలింగ్‌లో ఆలోచించి ఓటేయాలని, కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా దక్కకుండా చూడాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వాన్ని ‘మేడమ్ సర్కార్’, ‘రిమోట్ కంట్రోల్ సర్కార్’ అని సంబోధించిన మోదీ..ప్రజలు పది గంటలు పనిచేస్తే, తాను మరో గంట ఎక్కువ కష్టపడతానని చెప్పారు. నాలుగు తరాల తరువాత ఏ వంశ పాలన అయినా ముగుస్తుందని ఢిల్లీ చరిత్ర నిరూపించిందని, కాంగ్రెస్‌కు కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు. ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ వల్లే మధ్యప్రదేశ్ అభివృద్ధి చెందిందని కితాబిచ్చారు.
మధ్యప్రదేశ్‌కు ‘డబుల్ ఇంజిన్’..
‘చీడపీడల నివారణకు విషపూరిత మందులు వాడుతాం. అలాగే, దేశంలో అవినీతిని అంతమొందించడానికి నేను నోట్లరద్దు అనే చేదు ఔషధాన్ని ఉపయోగించాను. గతంలో పడక గదులు, కార్యాలయాలు, ఫ్యాక్టరీల్లో నగదు దాచుకున్న వారంతా ఇప్పుడు సంపాదించుకున్న ప్రతి పైసాకు పన్ను కడుతున్నారు. ఆ డబ్బును సామాన్యుడికి అవసరమైన పథకాలకు ఖర్చుచేస్తున్నాం’ అని మోదీ అన్నారు.
ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం కింద ఇప్పటి వరకు ఎలాంటి గ్యారెంటీ లేకుండానే 14 కోట్ల మందికి రుణాలిచ్చినట్లు చెప్పారు. 2022 నాటికి అందరికీ పక్కా ఇళ్లు నిర్మించడమే తన లక్ష్యమని, ఇప్పటి వరకు సుమారు 1.25 కోట్ల మందికి సొంతిళ్లు నిర్మించి ఇచ్చామని తెలిపారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. మధ్యప్రదేశ్ అభివృద్ధికి డబుల్ ఇంజిన్‌లా పనిచేస్తోందని అన్నారు. రాష్ట్రాభివృద్ధి గురించి పట్టింపు లేని ప్రభుత్వం మధ్యప్రదేశ్‌కు వద్దని కాంగ్రెస్‌పై మండిపడ్డారు. కాంగ్రెస్‌తో పోలిస్తే రాష్ట్రంలో 15 ఏళ్ల బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందో ఆలోచించి ఓటేయాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రోజుల్లో మధ్యప్రదేశ్‌లో రోడ్ల లాంటి మౌలిక వసతులు కూడా కరువయ్యాయని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment