సాక్షి, హైదరాబాద్/ సిరిసిల్ల: దుబాయ్‌లోని అవీర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న తెలంగాణ ఎన్నారైలకు క్షమాభిక్ష కోసం రాష్ట్ర మంత్రి కేటీఆర్ మరోసారి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. దుబాయ్ పర్యటనలో ఉన్న మంత్రి సిరిసిల్ల జిల్లాకు చెందిన ఐదుగురు ఖైదీల విడుదల అంశాన్ని అక్కడి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దుబాయ్ అధికారులతో పాటు ఖైదీల కుటుంబ సభ్యులు, బంధువులు, ఈ కేసుని వాదిస్తున్న అరబ్ లాయర్, దుబాయ్‌లో భారత కాన్సుల్ జనరల్ కార్యాలయ అధికారులతో మాట్లాడారు. దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ క్షమాభిక్ష ప్రసాదించేలా ప్రయత్నం చేయాలని వారికి సూచించారు.
17 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న సిరిసిల్ల వాసులు
2006లో దుబాయ్‌లోని జబల్ అలీ పారిశ్రామిక ప్రాంతంలోని ఓ సంస్థ ఆవరణలో నేపాల్‌కు చెందిన దిల్‌ప్రసాద్ రాయ్ అనే సెక్యూరిటీ గార్డు హత్యకు గురయ్యాడు. దొంగతనాన్ని అడ్డుకునేందుకు సెక్యూరిటీ గార్డు ప్రయత్నించగా పది మంది కలిసి హత్య చేశారనేది ఆరోపణ. కాగా ఈ కేసు నిందితుల్లో నలుగురు పాకిస్తానీయులు కాగా మిగిలిన ఆరుగురు తెలంగాణకు చెందినవారు.
ఈ పది మందిని అక్కడి కోర్టు దోషులుగా నిర్ధారించి పాకిస్తానీయులకు తొమ్మిదేళ్ల చొప్పున, తెలంగాణ వారికి పదేళ్ల చొప్పున శిక్ష విధించింది. అయితే శిక్ష పూర్తి చేసుకున్న నలుగురు పాకిస్తానీయులు, కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నమిలికొండకు చెందిన సయ్యద్ కరీంలు విడుదలయ్యారు. కానీ తెలంగాణకు చెందిన మిగతా ఐదుగురు..రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన శివరాత్రి రవి, శివరాత్రి మల్లే‹Ù, గొల్లెం నాంపల్లి, దుండగుల లక్ష్మణ్, శివరాత్రి హనుమంతులు మాత్రం 17 ఏళ్లుగా జైలులోనే మగ్గుతున్నారు.
అప్పీలుకు వెళ్తే.. పెరిగిన శిక్ష
ఈ ఐదుగురు హైకోర్టులో అప్పీల్‌కు వెళ్లడం శాపంగా మారింది. ఈ కేసులు విచారించిన ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం (అరబ్బీ భాషలో ‘నజ్ల ఖజా యా) ఈ హత్యను క్రూరమైనది (జినయా)గా పరిగణించింది. కింది కోర్టు విధించిన పదేళ్ల శిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. ఈ కారణంగానే వీరు మరో ఎనిమిదేళ్ల వరకు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దీర్ఘకాలంగా కేటీఆర్ ప్రయత్నాలు
ఐదుగురు ఖైదీల విడుదల కోసం మంత్రి కేటీఆర్ చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. నేపాల్‌లోని బాధిత కుటుంబం దగ్గరికి స్వయంగా వెళ్లి దియ్య సొమ్ము పరిహారం (బ్లడ్ మనీ) అందించారు. ఆ కుటుంబం ఇచ్చిన క్షమాభిక్ష అంగీకార పత్రాన్ని దుబాయ్ ప్రభుత్వానికి సమర్పించి క్షమాభిక్ష కోరారు. అయితే నేరం తీవ్రతను దృష్టిలో ఉంచుకొని దుబాయ్ ప్రభుత్వం ఇప్పటివరకు క్షమాభిక్షను ప్రసాదించలేదు.
ఆరు నెలల కిందట మరోసారి మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా దుబాయ్ లాయర్‌కు అవసరమైన ఫీజులు చెల్లించి, తన కార్యాలయ అధికారులను దుబాయ్ పంపించి మరీ ఈ వ్యవహారం తాలూకు పురోగతిని సమీక్షించారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న మంత్రి మరోసారి తనప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇప్పటికే సుదీర్ఘ కాలం పాటు శిక్ష అనుభవించి జైలు అధికారుల ద్వారా మంచి ప్రవర్తన కలిగిన ఖైదీలుగా నివేదిక కూడా కలిగి ఉన్న తెలంగాణ ఎన్నారైలకు వెంటనే క్షమాభిక్ష లభించేలా చూడాలని అక్కడి అధికారులను కోరారు.
అంతకుముందు జరిగిన బిజినెస్ భేటీల సందర్భంగా దుబాయ్ రాజ కుటుంబానికి సన్నిహితంగా వ్యవహరించే పలువురు వ్యాపారవేత్తల వద్ద కూడా మంత్రి ఈ విషయాన్ని ప్రస్తావించి మానవతా దృక్పథంతో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు బాధిత కుటుంబాలను కలిసి ప్రభుత్వం తరఫున, వ్యక్తిగతంగా అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. మంత్రి కేటీఆర్ చేస్తున్న తాజా ప్రయత్నాలు, స్థానిక వ్యాపారవేత్తల నుంచి లభించిన సానుకూల హామీ నేపథ్యంలో తెలంగాణ ఖైదీల విడుదలపై కుటుంబసభ్యుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment