సిరిసిల్ల పాత బస్టాండ్‌లో ప్రయాణికులతో కరచాలనం చేస్తున్న మాజీ మంత్రి కేటీఆర్.
సీఎం రేవంత్‌పై కేటీఆర్ ధ్వజం
మోసపోతే గోస పడతామని కేసీఆర్ ముందే చెప్పారు
రాష్ట్రంలో కరెంట్ లేదు.. నీళ్లు లేవు.. రైతుబంధు లేదు
రేవంత్‌రెడ్డి ఛోటే భాయ్.. మోదీ బడే భాయ్
చెయ్యి విరగాలి.. పువ్వు వాడాలి.. కారు జోరు కొనసాగాలి
సిరిసిల్ల, మల్కాజిగిరి, కంటోన్మెంట్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రచారం
సిరిసిల్ల/సుభాష్‌నగర్, రసూల్‌పుర (హైదరాబాద్): సీఎం రేవంత్‌రెడ్డి పాలన చిల్లర మాటలు.. ఉద్దెర పనులు అన్నట్లుగా ఉందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు విమర్శించారు. ‘మోసపోతే గోస పడతామని కేసీఆర్ ముందే చెప్పారు.. ఇప్పుడు కరెంట్ లేదు.. నీళ్లు లేవు.. బతుకమ్మ చీరలు లేవు.. రైతుబంధు లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రాకతో దరిద్రం అడుగుపెట్టినట్లు అయ్యింది..’ అని ధ్వజమెత్తారు.
ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు 10 నుండి 12 సీట్లు ఇస్తే ఆరు నెలల నుండి సంవత్సరం లోపే కేసీఆర్ రాష్ట్ర రాజకీయాన్ని శాసించే రోజు వస్తుందని చెప్పారు. కేటీఆర్ శనివారం సిరిసిల్లలో, హైదరాబాద్ శివారు కుత్బుల్లాపూర్‌లోని షాపూర్, నగరంలోని కంటోన్మెంట్ ఏరియాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
హామీలేమో కానీ లూటీలు షురూ
కేసీఆర్ ప్రభుత్వంలో కరెంటు కష్టాలు లేవని, ప్రస్తుతం హైదరాబాదులో కరెంటు కోతలు ప్రారంభమై ఎక్కడ చూసినా వాటర్ ట్యాంకర్లు, జనరేటర్లు కనపడుతున్నాయని కేటీఆర్ మండిపడ్డారు. ప్రతి మహిళకు రూ.2,500, పెన్షన్ రూ.4 వేలు ఇస్తామని, రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తానని మోసపు హామీలు ఇచ్చి రేవంత్‌రెడ్డి ఓట్లు వేయించుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీకి తేదీలు మార్చుతున్నాడని, ఆరు గ్యారంటీల్లో ఐదు అమలు చేశామని తప్పుడు ప్రకటనలు ఇస్తున్నాడని విమర్శించారు.
కల్యాణలక్ష్మి కింద రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చారని, నాలుగు నెలల్లో లక్ష పెళ్లిళ్లు అయ్యి లక్ష తులాల బంగారం రేవంత్ బాకీ పడ్డాడని అన్నారు. గ్యారంటీల అమలు పక్కన పెడితే కాంగ్రెసోళ్లు లూటీలు చేయడం చాలూ అయ్యిందని, లూటీ చేయడం కాంగ్రెస్ వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. కొత్త పరిశ్రమలు తేవడం ఏమో కానీ ఉన్న పరిశ్రమలు గుజరాత్, చెన్నై తరలిపోతున్నాయన్నా రు. ప్రభుత్వ ఆర్డర్లు లేక నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కొత్త జిల్లాలపై స్పష్టత ఇవ్వాలి
పరిపాలన సౌలభ్యం కోసం 10 జిల్లాలను 33 జిల్లాలుగా మార్చుకు న్నామని, కొన్ని జిల్లాలకు జయశంకర్ (భూపాలపల్లి), కొమురంభీం (ఆసిఫాబాద్) లాంటి మహానుభావుల పేర్లు పెట్టుకున్నామని కేటీఆర్ గుర్తు చేశారు. కానీ కొత్త జిల్లాలు రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని, 33 జిల్లాల్లో ఏ జిల్లాలను ఉంచుతారో, ఏ జిల్లాలను తొలగిస్తారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
బీజేపీని నమ్మి మోసపోవద్దు
కొందరు దేవుడి పేరిట రాజకీయాలు చేస్తున్నారని, తెలంగాణలో కేసీఆర్ ఆధునిక దేవాలయాలైన జలాశయాలను నిర్మించి వాటికి దేవుళ్ల పేర్లు పెట్టారని కేటీఆర్ చెప్పారు. యాదాద్రిని కట్టించిన కేసీఆర్ ఏనాడూ దేవుడి పేరును ఓట్లకు వాడుకోలేదని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఛోటే భాయ్.. ప్రధాని మోదీ బడే భాయ్ అని ఎద్దేవా చేశారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోదీ ఇంతవరకు ఏమీ చేయలేదన్నారు.
పదేళ్లలో హైదరాబాద్‌కు రూపాయి ఇవ్వలేని బీజేపీకి ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. ప్రజల్లో మతం చిచ్చుపెట్టే బీజేపీని నమ్మి మోసపోవద్దని కోరారు. ‘రాష్ట్రంలో చెయ్యి విరగాలి.. పువ్వు వాడాలి.. కారు జోరు కొనసాగాలి..’ అని కేటీఆర్ కోరారు. పార్టీ అభ్యర్థులను గెలిపించాలని, కంటోన్మెంట్‌లో ఐదుసార్లు దివంగత ఎమ్మెల్యే సాయన్నను ఆదరించినట్లుగానే ఈసారి జరిగే ఎన్నికల్లో సాయన్న బిడ్డ నివేదితను ఆదరించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఒకే ఏడాదిలో తండ్రిని, చెల్లిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న నివేదితను గుండెల్లో పెట్టుకోవాలని కోరారు. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, మర్రి రాజశేఖర్ రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ తుల ఉమ, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, కంటోన్మెంట్ అసెంబ్లీ అభ్యర్థి నివేదిత తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment