న్యూఢిల్లీ: ఆదాయ పన్ను రిటర్నుల్లో (ఐటీఆర్) తెలిసీ, తెలియకుండా వదిలేసిన వివరాలను అప్‌డేట్ చేసి, రెండేళ్లలోగా తిరిగి దాఖలు చేసేందుకు ఇచ్చిన వెసులుబాటును ఆమ్నెస్టీ (క్షమాభిక్ష) స్కీముగా పరిగణించరాదని కేంద్ర రెవెన్యూ విభాగం కార్యదర్శి తరుణ్ బజాజ్ స్పష్టం చేశారు. గతంలో వెల్లడించని ఆదాయంపై అదనంగా 25% కట్టాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. సహేతుకమైన కారణాల వల్ల ఆదాయాన్ని చూపించలేకపోయిన వారు తమ రిటర్నులను సరిదిద్దుకునేందుకు దీన్ని ఉద్దేశించినట్లు బజాజ్ చెప్పారు.
12 నెలల్లోగా అప్‌డేటెడ్ ఐటీఆర్‌ను 12 నెలల్లోగా సమర్పిస్తే బాకీ ఉన్న పన్నుపై అదనంగా 25%, వడ్డీ కట్టాల్సి ఉంటుందని.. అదే 12 నెలల తర్వాత 24 నెలల్లోగా సమర్పిస్తే రేటు 50% దాకా పెరిగిపోతుందని ఆయన వివరించారు. ‘ఇదెలా పనిచేస్తుందంటే.. ఎవరైనా ట్యాక్స్‌పేయరు రూ.50,000 ఆదాయాన్ని చూపించడం మర్చిపోతే దానిపై రూ. 15,000 పన్ను వర్తిస్తుందనుకుందాం. అప్పుడు వారు ఆ రూ. 15,000పై అదనంగా మరో 25–50% వరకూ (అప్‌డేట్ చేసిన రిటర్నును దాఖలు చేసిన సమయాన్ని బట్టి) కట్టాల్సి ఉంటుంది‘ అని బజాజ్ వివరించారు. ‘ఇది..మీరు ఏడాది, రెండేళ్ల తర్వాతయినా ఐటీఆర్ వేయొచ్చని చెప్పడం కాదు. ఎందుకంటే, అలాగయితే నిఖార్సయిన ట్యాక్స్‌పేయరు కూడా తర్వాత వేయొచ్చులే అనుకోవచ్చు. అలా జరగకుండా ఉండేందుకే అదనపు పన్ను విధిస్తున్నాం‘ అని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం డిసెంబర్ దాటితే, సవరించిన రిటర్నులను దాఖలు చేసే అవకాశం లేదు.
చదవండి: ఓన్లీ ఫైలింగ్ అప్‌డేట్‌కి అవకాశం.. శ్లాబుల్లో నో ఛేంజ్..
Comments
Please login to add a commentAdd a comment