ట్యాక్స్ ఆడిట్ పూర్తయిందా? రిటర్ను వేశారా?
ఆదాయపు పన్ను చట్ట ప్రకారం ట్యాక్స్ ఆడిట్ అసెసీలు వారి రిటర్నులను దాఖలు చేయడానికి గడువు తేది ఈ నెలాఖరుతో (30/09/16) ముగుస్తుంది. అసెసీ అకౌంట్లను తనిఖీ చేయడాన్నే ఆడిట్ అంటుంటాం. ఆదాయపు పన్ను చట్ట ప్రకారం చేయించే ఆడిట్‌ను ట్యాక్స్ ఆడిట్‌గా పిలుస్తారు. జీతం మీద ఆదాయం, ఇంటి మీద ఆదాయం, మూలధన లాభాలు, ఇతర ఆదాయం ఉన్న వారికి ఈ ఆడిట్ వర్తించదు. అదేవిధంగా తక్కువ టర్నోవర్, వసూళ్లు ఉన్న వ్యాపారస్తులకు, వృత్తి నిపుణులకు ట్యాక్స్ ఆడిట్ వర్తించదు.
ఒక ఆర్థిక సంవత్సరంలో వ్యాపారం ద్వారా ఒక వ్యక్తి టర్నోవర్, వసూళ్లు, అమ్మకాలు కోటి రూపాయలు దాటితే వారికి ట్యాక్స్ ఆడిట్ వర్తిస్తుంది. ఒక అసెసీ వృత్తిపరమైన టర్నోవర్, వసూళ్లు రూ.25 లక్షలు దాటితే వారు కూడా ట్యాక్స్ ఆడిట్ పరిధిలోకి వస్తారు. కొన్ని వ్యాపారాల్లో ఉన్న అసెసీలకు నిర్దేశించిన లాభ శాతాన్ని లేదా ఎక్కువ లాభ శాతాన్ని ఆదాయంగా పరిగణిస్తారు. అటువంటి వారు అకౌంట్లు రాయాల్సిన అవసరం లేదు. వారికి ట్యాక్స్ ఆడిట్ కూడా వర్తించదు. కానీ వారు నిర్దేశించిన దాని కన్నా తక్కువ లాభాన్ని చూపితే అకౌంట్లు రాసి, ట్యాక్స్ ఆడిట్ చేయించాలి. ట్యాక్స్ ఆడిట్‌ని ప్రాక్టీసులో ఉన్న సీఏలతో చేయించాలి.
ఈ ఆడిట్ ద్వారా అసెసీలు మినహాయింపులను, తగ్గింపులను సరిగ్గా చేసుకోవచ్చు. ఈ ఆడిట్ 44ఏబీ సెక్షన్ ప్రకారం జరగాలి. కంపెనీల విషయంలో అయితే కంపెనీ చట్ట ప్రకారం ఆడిట్‌తోపాటు ట్యాక్స్ ఆడిట్ చేయించాలి. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ట్యాక్స్ ఆడిట్‌ను పూర్తిచేశాక రిపోర్ట్‌ని జతపరుస్తూ 30/09/16 లోపల అసెసీలు ఆన్‌లైన్ ద్వారా రిటర్నులు వేయాలి. దాఖలుకు అసెసీలకు డిజిటల్ సంతకం కావాలి. ఈ డిజిటల్ సంతకం లేకుండా రిటర్నులు దాఖలు చేయలేరు. ట్యాక్స్ ఆడిట్ చేశాక రిపోర్ట్‌ని ఫారం 3సీఏ/సీబీ, 3సీడీలోనే ఇవ్వాలి.
ఫారం 3 సీడీలో ఎన్నో అంశాలను పొందుపరుస్తారు. ఈ అంశాలు సంఖ్యాపరంగా లెక్కిస్తే పది, విడిగా చూస్తే వందలు దాటుతాయి. అన్నింటికీ వివరాలు చూపాలి. అకౌంట్ పుస్తకాలు ఎక్కడున్నాయో తెలుసుకోవాలి. స్థిరాస్తుల విక్రయంలో ప్రతిఫలం ఎంత? ఎంత మొత్తం మీద స్టాంప్ డ్యూటీ చెల్లించామో చెప్పాలి. టీడీఎస్, స్టాక్స్ తదితర వాటి వివరాలు తెలపాలి. సెక్షన్ 271బీ ప్రకారం గడువు తేది లోపల రిటర్నులు దాఖలు చేయకపోతే పెనాల్టీ విధిస్తారు. టర్నోవర్‌పై 0.5 శాతం లేదా రూ.1,50,000లో ఏది తక్కువైతే దానిని పెనాల్టీగా చెల్లించాలి.
- ట్యాక్సేషన్ నిపుణులు
కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి,కె.వి.ఎన్ లావణ్య