యువరాజుకు మరణశిక్ష
అమలు చేసిన సౌదీ సర్కారు
మిత్రుడిని కాల్చిచంపిన కేసులో..
సౌదీ మరణశిక్షలపై ‘ఆమ్నెస్టీ’ ఆందోళన
రియాద్: వడ్డించేవాడు మనవాడైతే.. పంక్తిలో ఎక్కడ కూర్చుంటే ఏంటనే సామెత మనకు తెలుసు. రాజకీయ, అధికార అండదండలు అడ్డంపెట్టుకుని.. నేరాలనుంచి తప్పించుకున్న వాళ్లు చాలామందిని చూశాం. కానీ సౌదీ అరేబియాలో మాత్రం ఓ హత్యకేసులో దోషి అని తేలటంతో ఏకంగా యువరాజుకే (రాజ కుటుంబానికి చెందిన వ్యక్తికి) మరణశిక్ష విధించి అమలుచేశారు.
అసలేం జరిగింది?.. రాజ కుటుంబీకులు, కాస్త డబ్బు పలుకుబడి ఉన్నవారు సౌదీలో ఎడారిలో ఏర్పాటుచేసే క్యాంపుల్లో కలుసుకుంటారు. ఇలాగే.. 2012లో యువరాజు తుర్కి బిన్ సౌద్ అల్ కబీర్ కూడా ఇక్కడికి వచ్చారు. మిత్రులంతా కలసి మాట్లాడుతుండగా.. మాటా మాటా పెరిగి గొడవకు దారితీయటంతో.. కబీర్ తన తుపాకీతో మిత్రుడు ఆదిల్ అల్ మహెమీద్‌ను కాల్చి చంపాడు. ఈ కేసులో విచారణలన్నీ ముగిసిన తర్వాత కోర్టు కబీర్‌ను దోషిగా తేల్చటంతో మరణశిక్ష విధించి మంగళవారం రాత్రి అమలుచేశారు. ఈ విషయాన్ని సౌదీ విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. ఈ ఏడాది మరణదండన పడిన వారిలో కబీర్ 134వ వ్యక్తి. రెండేళ్లలో ఈ శిక్షపడ్డ రెండో యువరాజు ఇతడు. కబీర్ వయసు, ఇతర వివరాలను వివరించేందుకు సౌదీ అధికారులు నిరాకరించారు. ఇతను సౌదీరాజు అబ్దుల్ అజీజ్ వంశానికి చెందిన వాడని తెలిసింది. అయితే రాజకుటుంబంలో తరతరాలను వెతికితే వందలమంది యువరాజులుంటారు.
ఇది రాచరిక న్యాయం.. కబీర్‌కు మరణశిక్ష విధించటంపై సౌదీలో హర్షం వ్యక్తమైంది. రాజ కుటుంబం పాలనలో దేశంలో సమన్యాయం అమలవుతుందని బాధితుడి కుటుంబీకులు తెలిపారు. సౌదీలో మరణశిక్ష అమలుచేయాలంటే శిరచ్ఛేదం చేస్తారు. ఇస్లామిక్ న్యాయసూత్రాల ప్రకారం హత్య, మత్తుపదార్థాల స్మగ్లింగ్, ఆయుధాల చోరీ, అత్యాచారం, మతం మారిన వారికి మరణశిక్ష విధిస్తారు.
158 మందిని చంపేశారు!: సౌదీలో రాజ కుటుంబం మరణశిక్షలను అమలుచేస్తూ మానవహక్కులను కాలరాస్తోందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆవేదన వ్యక్తం చేసింది. 2015 నుంచి తాజాగా కబీర్ వరకు 158 మందికి మరణశిక్ష పడిందని తెలిపింది. ఇరాన్, పాకిస్తాన్ తర్వాత ఎక్కువగా మరణశిక్షను అమలుచేస్తున్న మూడో దేశం సౌదీనే అని పేర్కొంది. కాగా, గతంలో సౌదీలో డ్రగ్స్ రవాణా, హత్యకేసుల్లో దోషిగా తేలిన వారికే ఎక్కువగా మరణశిక్ష పడింది. జనవరిలో ఉగ్రవాదులకు సాయం చేశారన్న కారణంతో 47 మందికి ఒకేరోజు మరణదండన అమలుచేశారు. చైనాలో రహస్యంగా చాలా మందికి మరణశిక్ష విధిస్తున్నా ఆ లెక్కలు బాహ్యప్రపంచానికి చేరటం లేదు.