యూఏఈలో క్షమాభిక్ష   | Amnesty In UAE | Sakshi
Sakshi News home page

యూఏఈలో క్షమాభిక్ష  

Published Fri, Jul 27 2018 9:11 AM | Last Updated on Tue, Aug 21 2018 3:10 PM

Amnesty In UAE  - Sakshi

అబుదాబిలోని భారత రాయబార కార్యాలయం

మెరుగైన ఉపాధి కోసం వెళ్లి.. అక్కడ అనివార్యమైన పరిస్థితుల్లో ఇబ్బందుల్లో చిక్కుకుని ఇంటికి రాలేక మగ్గుతున్న అక్రమ వలసదారులకు యూఏఈ (యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌) ప్రభుత్వం ఆమ్నెస్టీ (క్షమాభిక్ష) ప్రకటించింది. ఆగస్టు 1 నుంచి అక్టోబరు 31లోగా జైలు శిక్షలు లేకుండా వారి స్వదేశాలకు వెళ్లిపోవచ్చని వెల్లడించింది. ఏళ్ల తరబడి కుటుంబాలకు దూరమైన వలస జీవులు ఆమ్నెస్టీపై ఆశలు పెట్టుకున్నారు. వారు స్వదేశానికి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

ఎన్‌.చంద్రశేఖర్, వూరడి మల్లికార్జున్‌ స్వగ్రామాల్లో ఉపాధి లేక.. వేలాది మంది యువకులు గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్తున్నారు. ఇలాంటి వారిలో 90శాతం మంది కూలీలే. నైపుణ్యం కలిగిన వారు కాకపోవడంతో ఆ దేశాల్లో కూలి పనిచేయాల్సిందే. వీసాలు, పాస్‌పోర్టుల కోసం అప్పులు చేసి మరీ గల్ఫ్‌కు వెళ్తున్నారు. విజిట్‌ వీసాలతో కొందరు మోసపోగా మరికొందరు ఒప్పందం ప్రకారం కంపెనీలు వేతనాలు ఇవ్వకపోవడంతో ఆ కంపెనీలను వదలి ఖల్లివెల్లి (అక్రమ నివాసులు)గా మారుతున్నారు.

యూఏఈ పరిధిలోని దుబాయి, అబుదాబి, షార్జా, అజ్మాన్, పుజీరా, రాసల్‌ ఖైమా, ఉమ్మల్‌ క్వైన్‌ రాజ్యాలలో (ఎమిరేట్‌లలో) దాదాపు 3 లక్షల మంది తెలంగాణ జిల్లాలకు చెందిన కార్మికులు పనిచేస్తున్నారు. కొంత మంది కంపెనీలో చేరిన తర్వాత పనిలో ఇబ్బందులతో బయటకు వస్తున్నారు. మరికొంత మంది అనారోగ్యానికి గురై అక్కడే ఉంటున్నారు. కంపెనీ యజమానుల మోసం.. జీతాలు సరిగా ఇవ్వకపోవడంతో గత్యంతరం లేక ఖల్లివెల్లి అవుతున్నవారు అక్కడి అధికారుల, పోలీసుల కళ్లుగప్పి దొంగచాటుగా పనులు చేసుకుంటూ బతుకుతున్న వారూ ఉన్నారు.

అనారోగ్యానికి గురైన వారు ఎటూ వెళ్లలేక అక్కడే ఉండిపోయారు. వైద్యానికి డబ్బులు లేక, పనిచేసే సత్తువ లేక జీవచ్ఛవాల్లా బతికేవారికి ఆమ్నెస్టీ మంచి అవకాశం. యూఏఈలో చట్ట విరుద్ధంగా ఉంటున్న తెలంగాణ కార్మికుల సంఖ్య 20వేల వరకు ఉంటుందని ప్రవాసీ కార్మిక సంఘాలు అంచనా వేస్తున్నాయి. ఆ దేశంలో 2007లో ఒకసారి, 2013లో మరోసారి ఆమ్నెస్టీ అమలు చేశారు. ఐదేళ్ల విరామం తర్వాత ఇప్పుడు యూఏఈ ప్రభుత్వం మళ్లీ ఆమ్నెస్టీ అమలు చేస్తోంది

.పునరావాసం.. పునరేకీకరణ అవసరం 

ఆమ్నెస్టీ వల్ల ఇంటికి చేరుకునే కార్మికులకు పునరావాసం కల్పించడంతో పాటు, సమాజంలో కలిసిపోయే విధంగా పునరేకీకరణకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. 2007లో యూఏఈ ప్రభు త్వం ఆమ్నెస్టీని అమలు చేయగా వేలాది మంది తెలుగు కార్మికులు స్వదేశానికి తిరిగివచ్చారు. ఎంతో మంది కార్మికులు గల్ఫ్‌ వెళ్లడానికి చేసిన అప్పులు తీరక ముందే ఇంటికి చేరుకోవడంతో మానసికంగా కంగిపోయారు. సుమారు 150 మంది కార్మికులు యూఏఈ నుంచి ఇంటికి చేరుకున్న తరువాత మానసి కక్షోభతో అనారోగ్యానికి గురై మరణించారు.

మరికొంత మంది కార్మికులు ఆత్మహత్మకు పాల్పడ్డారు. దీనికి ప్రధాన కారణం భవిష్యత్తుపై భరోసా లేకపోవడమేనని కార్మిక సం ఘాల ప్రతినిధులు చెబుతున్నారు. గత సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. యూఏఈ నుంచి తిరిగివచ్చే కార్మికులకు స్థానికంగా స్వయం ఉపాధి కోసం సబ్సిడీ రుణాలు అందించాలి లేదా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.రెండు విధానాల్లో ఆమ్నెస్టీ...యూఏఈలో ఆమ్నెస్టీ అమలు రెండు విధానాల్లో సాగనుంది.

ఖల్లివెల్లి కార్మికులు స్వదేశానికి రాకుండా వీసాను క్రమబద్ధీకరణ చేసుకోవడానికి ఒక అవకాశం కల్పించారు. ఇందుకు 500 దిర్హమ్స్‌ (ఇండియన్‌ కరెన్సీలో రూ.9వేలు) చెల్లించాల్సి ఉంది. అలాగే ఇంటికి వెళ్లిపోవడానికి దరఖాస్తు రుసుం కింద 250 దిర్హమ్స్‌ ఫీజుగా చెల్లించాల్సి ఉంది. గల్ఫ్‌లోని ఇతర దేశాల నుంచి యూఏఈకి సరిహద్దులు దాటి వచ్చిన కార్మికులైతే 500 దిర్హమ్స్‌ను ఫీజుగా చెల్లించాలి. అలాంటి కార్మికులు రెండేళ్ల పాటు యూఏఈ వీసాలు పొందడానికి అనర్హులు. రెండేళ్ల నిషేధం ముగిసిన తరువాత యూఏఈ వీసాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

అయితే యూఏఈ నుంచి స్వదేశానికి చేరుకోవాల్సిన వారు సొంతంగానే టిక్కెటు కొనుగోలు చేసుకోవాలి. లేదా స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ సహాయాన్ని అభ్యర్థించాల్సి ఉంటుంది. ఆమ్నెస్టీ వల్ల జైలు శిక్ష, జరిమానాల బారిన పడకుండా నామమాత్రం ఫీజుతో స్వదేశానికి రావడం లేదా వీసాల క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆమ్నెస్టీపై ఖల్లివెల్లి కార్మికులు, వారి కుటుంబాల వారికి అవగాహన కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాల్సిన అవసరం ఉంది.

అండగా నిలిచిన వైఎస్సార్‌ ప్రభుత్వంయూఏఈ, ఇతర గల్ఫ్‌ దేశాల నుంచి స్వదేశానికి చేరుకున్న కార్మికులకు 2008లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి అండగా నిలిచారు. 2007లో ఆమ్నెస్టీ వల్ల స్వదేశానికి వచ్చి మానసిక క్షోభతో ఆత్మహత్యకు పాల్పడిన వారి కుటుంబాలకు వైఎస్‌ ప్రభుత్వం రూ.లక్ష చొప్పున పరిహారం అందించింది. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్‌ జిల్లాల్లో ఆత్మహత్యకు పాల్పడిన 29 మంది కార్మికుల కుటుంబాలకు వైఎస్‌ ప్రభుత్వం ఆర్థికంగా భరోసా ఇచ్చింది.

అప్పట్లో నిర్మల్‌ ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుత దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు వైఎస్సార్‌ సానుకూలంగా స్పందించారు. గల్ఫ్‌ ఏజెంట్ల చేతిలో మోసపోయిన కార్మికులు, గల్ఫ్‌లో సరైన ఉపాధి లేక ఇంటికి చేరిన కార్మికులకు వైఎస్‌ ప్రభుత్వం సబ్సిడీ రుణాలు అందించింది. వైఎస్‌ కంటే ముందుగానీ ఆ తరువాతగానీ ఏ ముఖ్యమంత్రీ గల్ఫ్‌ కార్మికుల సంక్షేమానికి కృషిచేయలేదు. ఆమ్నెస్టీ మార్గదర్శకాలు ఇవీ..  

 కోర్టు కేసులుంటే ఆమ్నెస్టీకి (క్షమాభిక్షకు) అనర్హులే  
 యజమానుల నుంచి పారిపోయి, బ్లాక్‌ లిస్టులో ఉన్నవారు 500 దిర్హమ్‌ల జరిమానా చెల్లించాలి. 
 ఒమన్‌ సరిహద్దు నుంచి అక్రమంగా యూఏఈలోకి ప్రవేశించిన వారు కేవలం స్వదేశానికి తిరిగి వెళ్లడానికి మాత్రమే అర్హులు.  
 9 సహాయ కేంద్రాలు గురువారం నుంచి ఆదివారం వరకు ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తాయి. 
దుబాయి వీసా ఉన్న వారు అల్‌ అవీర్‌లో, అబుదాబి వీసా ఉన్న వారు అల్‌ షహామాలో సంప్రదించాల్సి ఉంటుంది. మిగిలిన ఎమిరేట్లలోని వారు అక్కడి ప్రధాన ఎమ్మిగ్రేషన్‌ కార్యాలయాల్లో సంప్రదించాలి.  
గడువు ముగిసిన వారి పాస్‌పోర్టులను రెన్యూవల్‌ చేయడానికి, పాస్‌పోర్టు లేనివారికి ‘అవుట్‌ పాస్‌’ అని పిలుచుకునే ఎమర్జెన్సీ సర్టిఫికెట్‌ (భారత్‌కు వెళ్లడానికి మాత్రమే ఉపయోగించే తెల్లరంగు పాస్‌పోర్టు) జారీచేయడానికి భారత దౌత్య కార్యాలయాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. 
క్షమాభిక్షను సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్న భారతీయుల సౌకర్యార్థం దుబాయిలోని భారత కాన్సులేటు, అబుదాబిలోని భారత రాయబార కార్యాలయాల్లో ప్రత్యేక సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

కార్మికులకు అవగాహన కల్పిస్తున్నాం 

యూఏఈ ప్రభుత్వం అమలు చేస్తున్న క్షమాభిక్షపై కార్మికులకు అవగాహన కల్పిస్తున్నాం. లేబర్‌ క్యాంపుల్లో పర్యటించి చట్ట విరుద్ధంగా ఉంటున్న కార్మికులు ఆమ్నెస్టీని సద్వినియోగం చేసుకోవాలని చెబుతున్నాం. ఆమ్నెస్టీ కోసం దరఖాస్తు చేసుకునే కార్మికులకు అండగా ఉండి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.

– ఏముల రమేష్, ప్రవాస హక్కుల సంక్షేమ వేదిక, దుబాయి శాఖ అధ్యక్షుడు
 
ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి 

ఆమ్నెస్టీ అమలుపై ప్రభుత్వం స్పందించి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి. కార్మికులకు మేము ఉన్నామనే భరోసా కల్పించాలి. కార్మికుల కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్‌ నిర్వహించి యూఏఈలో చట్ట విరుద్ధంగా ఉంటున్న కార్మికులు స్వదేశానికి చేరుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కార్మికులకు ఆమ్నెస్టీపై సరైన అవగాహన లేదు. 

– సుందర ఉపాసన, తెలంగాణ గల్ఫ్‌ వెల్ఫేర్, కల్చరల్‌ అసోషియేషన్‌ 

ఎనిమిదేళ్లకు ఇంటికి వస్తున్నా

నేను దుబాయికి వచ్చి ఎనిమిది ఏళ్లు అవుతుంది. ఆమ్నెస్టీలో ఇంటికి వెళ్లే అవకాశం వచ్చింది. ఇన్ని రోజులు బయట పనిచేశాను. ఏదైనా పనిచేసుకుని ఇంటి వద్దనే ఉండాలే. గల్ఫ్‌ దేశాలకు రావడం చాలా ఇబ్బంది. క్షమాభిక్షతో ఇంటికి వస్తున్నా.    – గంగాధర్, చందుర్తి, సిరిసిల్ల జిల్లా

2013లో హైకోర్టు ఆదేశంతో దుబాయికి ప్రతినిధి బృందం 

2007, 2013లలో యూఏఈలో ప్రకటించిన ఆమ్నెస్టీ సందర్భంగా కేరళ వాసులకు అవసరమైన సహా యం అందించడం కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బృందాలను యూఏఈకి పంపింది. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రవాసీ కార్మికులను ఆదుకో వాలని మైగ్రంట్స్‌ రైట్స్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు పి.నారాయణస్వామి, పాలమూరు మైగ్రంట్‌ లేబర్‌ యూనియన్‌ కార్యదర్శి ఎస్‌.అబ్రహంలు 2013లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

అయితే, ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోనందున వారు హైకోర్టును ఆశ్రయించారు. ప్రవాసీ కార్మికులకు సహాయం చేయాల్సిందింగా హైకోర్టు ఆదేశించినా నిర్లక్ష్యం చేయడంతో నారాయణస్వామి, అబ్రహంలు కోర్టు ధిక్కారణ పిటిషన్‌ దాఖలు చేశారు.

ఎట్టకేలకు ప్రభుత్వం దిగివచ్చి అప్పటి మంత్రి శ్రీధర్‌బాబుతో కూడిన ఒక అధికార బృందాన్ని దుబాయికి పంపించింది. ప్రస్తుత ఆమ్నెస్టీ సందర్భంగా యూఏఈలోని తెలంగాణ కార్మికులకు సహాయం చేయడానికి  ఎన్నారై మంత్రి కె.తారకరామారావు నేతృత్వంలో ఒక అధికారిక ప్రతినిధి బృందాన్ని పంపాలని గల్ఫ్‌ వలసదారుల సంఘాలు కోరుతున్నాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement