నిజామాబాద్‌ ఫస్ట్‌.. హైదరాబాద్‌ సెకండ్‌.. | Telangana to Gulf: Most Migrants From Nizamabad And Hyderabad | Sakshi
Sakshi News home page

నిజామాబాద్‌ ఫస్ట్‌.. హైదరాబాద్‌ సెకండ్‌..

Published Fri, Dec 16 2022 6:34 PM | Last Updated on Sat, Dec 17 2022 7:50 AM

Telangana to Gulf: Most Migrants From Nizamabad And Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం నుంచి ఇప్పటికీ గల్ఫ్‌ దేశాలకు భారీగా వలసలు కొనసాగుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది వీరి సంఖ్య గణనీయంగా పెరిగింది. వలస వెళ్లిన వారిలో అత్యధికులు నిజామాబాద్‌ జిల్లా వారు కాగా... హైదరాబాద్‌ రెండో స్థానంలో ఉంది. కేంద్రం అధీనంలోని విదేశాంగశాఖ ఇటీవల వెల్లడించిన గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 2021లో రాష్ట్రం నుంచి మొత్తం 4,375 మంది గల్ఫ్‌ దేశాల బాట పట్టారు. ఈ ఏడాది అక్టోబర్‌ నాటికే ఈ సంఖ్య 8,547కు చేరింది.  

ప్రభావం చూపని ఆ వృత్తులు..  
హైదరాబాద్‌లోని పాతబస్తీతో పాటు తూర్పు మండలంలోని కొన్ని ప్రాంతాల నుంచి యువకులు ఖతర్, యూఏఈ, సౌదీ, ఒమన్, కువైట్, బర్హేన్‌లకు వలస వెళ్లడం ఏళ్లుగా సాగుతోంది. ఇలా అత్యధికులు అసంఘటిత రంగ కార్మికులుగానే వెళ్తున్నారు. ఆయా దేశాలకు వెళ్లిన వారికి నెలకు రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు ఆదాయం వస్తుంటుంది. ఇటీవల కాలంలో వివిధ రకాలైన డెలివరీ యాప్‌లకు డెలివరీ బాయ్స్‌గా, బైక్‌ ట్యాక్సీలు నిర్వహిస్తున్న వాళ్లు కూడా నగరంలో ఉంటూనే ఈ మొత్తాన్ని ఆర్జిస్తున్నారు. దీని ప్రభావంతో వలసల సంఖ్య నానాటికీ తగ్గాల్సి ఉంది. అయినప్పటికీ వలస వెళ్లే వారి సంఖ్య గతేడాది కంటే ఈ ఏడాది పెరగడం గమనార్హం.   
 
గతేడాది ఖతర్‌కే అత్యధికులు..  
ఈసారి ఫిఫా వరల్డ్‌ కప్‌నకు ఖతర్‌ ఆతిథ్యమిచ్చింది. దీనికోసం దాదాపు రెండు మూడేళ్లుగా అక్కడ భారీ ఫుట్‌బాల్‌ స్టేడియాలు, క్రీడాకారులకు అవసరమైన బస కోసం ప్రాంగణాలు తదితరాలను నిర్మించారు. వీటిలో పని చేయడానికి అక్కడి వారితో పాటు పెద్ద ఎత్తున వలస కూలీలు అవసరమయ్యారు. ఈ కారణంగానే ఆయా కాంట్రాక్టర్లు దళారుల సాయంతో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అనేక మందిని ఆకర్షించారు. గతేడాది రాష్ట్రం నుంచి ఖతర్‌కు వెళ్లిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ ఏడాది ప్రారంభం నాటికే ఆయా నిర్మాణాలు పూర్తయ్యాయి. దీంతో ఆ దేశానికి వెళ్లే వారి సంఖ్య ఈ ఏడాది తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.  
 
గణనీయంగా పెరిగిన పుష్పింగ్‌..  
ఆయా దేశాలకు అసంఘటిత, సెమీ స్కిల్డ్‌ లేబర్‌గా వెళ్లే వారు విమానాశ్రయంతో కచ్చితంగా తమ పాస్‌పోర్టు, వీసాలపై ఇమ్మిగ్రేషన్‌ స్టాంప్‌ వేయించుకోవాల్సి ఉంటుంది. ఇమ్మిగ్రేషన్‌ స్టాంప్‌ రిక్వైర్డ్‌గా (ఈసీఆర్‌) దీనికి అనేక నిబంధనలు ఉంటాయి. దీంతో అనేక మంది వలసదారులు ఇమ్మిగ్రేషన్‌ స్టాంప్‌ నాట్‌ రిక్వైర్డ్‌ (ఈసీఎన్‌ఆర్‌) విధానంలో దేశం దాటాలని భావిస్తుంటారు. ఇలాంటి వారికి సహకరించడానికి విమానాశ్రయం కేంద్రంగా కొందరు పని చేస్తుంటారు. విజిట్, టూరిస్ట్‌ వీసాలపై వెళ్తున్న వీరిని తనిఖీలు దాటించి విమానం ఎక్కించడాన్నే ‘పుష్పింగ్‌’ అని పిలుస్తుంటారు. ప్రతి నిత్యం శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి అనేక మంది ఈ విధానంలో బయటకు వెళ్లిపోతున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు.  


అక్రమంగా వెళ్లి అష్టకష్టాలు..  

సాధారణంగా విదేశాల్లో పని చేయడానికి వెళ్లే వాళ్లు వర్క్‌ పర్మిట్‌ తీసుకుని వెళ్లాలి. ఇలా చేస్తే వారికి ఉద్యోగ, వ్యక్తిగత భద్రతతో పాటు ఇతరు సదుపాయాలు లభిస్తాయి. అయితే పుష్ఫింగ్‌ ద్వారా దేశం దానికి అక్రమ వలసదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వీళ్లు గల్ఫ్‌ దేశాల్లో చిక్కుక్కుపోయి ఇబ్బందులు ఎదుర్కోవడం, కొన్నిసార్లు డిపోర్టేషన్‌ (బలవంతంగా తిప్పి పంపడం) ప్రక్రియను ఎదుర్కోవాల్సి వస్తోంది. కొందరు అక్రమ వలసదారులు ఆ దేశాల్లోని జైళ్లలోనూ మగ్గుతున్నారు. అక్కడ ఉండగా ఏదైనా జరగరానిది జరిగితే వారి కుటుంబీకులు, బంధువులకు కడసారి చూపులు దక్కడమూ గగనంగా మారుతోందని అధికారులు చెబుతున్నారు. (క్లిక్‌ చేయండి: ముంబై, బెంగళూరులను మించిపోయిన రంగారెడ్డి జిల్లా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement