మాస్కో: వాగ్నర్ సైన్యం తిరుగుబాటును నిలిపేయడంతో ఆ సైన్యం చీఫ్ ప్రిగోజిన్, అతని బలగాలకు రష్యా ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించింది. వారిపై ఎలాంటి క్రిమినల్ విచారణ ఉండదని ప్రకటించింది. 24 గంటల్లోపే వారు తమ కార్యకలాపాలను ఆపేయడంతో ఈ కేసును నిలిపివేస్తున్నట్టు ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ తెలిపింది. ఉక్రెయిన్‌తో 16 నెలలుగా యుద్ధం సాగుతున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ అధికారానికి ముప్పుగా పరిణమించిన సంఘటనల వరుసలో ఇది తాజా మలుపు.
ప్రస్తుత సంక్షోభాన్ని నివారించే లక్ష్యంతో ప్రిగోజిన్‌కు పుతిన్ కొన్ని వాగ్దానాలు చేశారని, మరికొన్ని హామీలు ఇచ్చారని క్రెమ్లిన్ ప్రతినిధి చెప్పారు. వాగ్నర్ గ్రూప్‌కు ఏడాదిలో రూ.8 వేల కోట్లకు పైగా చెల్లించినట్లు అధ్యక్షుడు పుతిన్ వెల్లడించారు. ఆ గ్రూపు బలగాలకు జీతాలు, అలవెన్సులను సమకూర్చామన్నారు. ఆ డబ్బును ఎలా ఖుర్చు చేశారన్న విషయమై అధికారులు దర్యాప్తు చేస్తారని పుతిన్ చెప్పారు.
ఇలా ఉండగా, ప్రిగోజిన్ తమ దేశంలోనే ఉన్నారని బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషేంకో ప్రకటించారు. అతని బలగాలు కూడా కొంతకాలం పాటు బెలారస్‌లోనే ఉంటాయని వెల్లడించారు. రష్యా మిలిటరీ ఆధీనంలో పనిచేయడానికి ఒప్పందాలపై సంతకం చేయడానికి జూలై 1 గడువు కంటే ముందే తన దళాలు తమ ఆయుధాలను మార్చుకోవడానికి సిద్ధమవుతున్నాయని ప్రిగోజిన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment