దిగిపోయేముందు బైడెన్ సంచలన నిర్ణయం
అధికార దుర్వినియోగమంటూ ట్రంప్ ధ్వజం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన కుమారుడు హంటర్ బైడెన్‌కు క్షమాభిక్ష ప్రసాదించుకున్నారు! పదవీ విరమణకు కొద్ది రోజుల ముందు ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అక్రమంగా ఆయుధాన్ని కలిగి ఉండటంతో పాటు రెండు క్రిమినల్ కేసుల్లో హంటర్‌కు పూర్తిగా బేషరతు క్షమాభిక్ష ప్రసాదిస్తున్నట్టు ఆదివారం ప్రకటించారు. ‘‘నా కుమారుడు హంటర్‌కు క్షమాభిక్షపై ఈ రోజు సంతకం చేశాను’’ అని ఒక ప్రకటనలో తెలిపారు. హంటర్‌పై జరుగుతున్న విచారణ ప్రక్రియలో జోక్యం చేసుకోబోనని ఇటీవలి దాకా బైడెన్ పదేపదే చెబుతూ వచ్చారు.
క్షమాభిక్ష, శిక్ష తగ్గింపు వంటి నిర్ణయాలు తీసుకోబోనని అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంగా కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన అనూహ్య నిర్ణయం కలకలానికీ, రాజకీయ వివాదానికీ దారితీసింది. అయితే తన నిర్ణయాన్ని బైడెన్ పూర్తిగా సమర్థించుకున్నారు. హంటర్‌ను కావాలనే అన్యాయంగా ప్రాసిక్యూట్ చేశారని తాజా ప్రకటనలో ఆయన ఆరోపించారు. ‘‘కేవలం హంటర్ నా కుమారుడు కాబట్టే ప్రాసిక్యూట్ చేశారు.
రాజకీయ ప్రత్యర్థులు నాపై దాడికి, నా ఎన్నికను వ్యతిరేకించడానికి మాత్రమే హంటర్‌పై ఆరోపణలు చేశారు. నేను న్యాయ వ్యవస్థను నమ్మి ఎంతగా పోరాడినా, ఆ ప్రక్రియను రాజకీయాలు ప్రభావితం చేశాయి’’ అని పేర్కొన్నారు. ‘‘అందుకే క్షమాభిక్ష నిర్ణయం తీసుకున్నా. ఒక తండ్రిగా, అధ్యక్షుడిగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నానో అమెరికన్లు అర్థం చేసుకుంటారు’’ అని చెప్పుకొచ్చారు. ఇది పూర్తి బేషరతు క్షమాభిక్ష కావడంతో కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా దీన్ని రద్దు చేయలేరు. దీనిపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. బైడెన్‌ది పూర్తి అధికార దుర్వినియోగమంటూ దుయ్యబట్టారు.
ఆరేళ్ల కథకు ముగింపు
మాదకద్రవ్యాల వాడకంతో పాటు అక్రమంగా తుపాకీ ఉన్న అభియోగాల్లో హంటర్‌ను జ్యూరీ గత జూన్‌లో దోషిగా తేల్చింది. ఆయన 14 లక్షల డాలర్ల పన్నులు చెల్లించకపోవడమే గాక తొమ్మిది పన్నుల ఎగవేతకు పాల్పడ్డారని పేర్కొంది. యూఎస్ అటార్నీగా ట్రంప్ నియమించిన ప్రత్యేక న్యాయవాది డేవిడ్ వీస్ 2018లో హంటర్‌పై దర్యాప్తు ప్రారంభించారు. ఆయనపై 2023లో మరో రెండు అభియోగాలు దాఖలు చేశారు. అక్రమాయుధం కేసులో డిసెంబర్ 12న, పన్ను కేసులో డిసెంబర్ 16న విచారణ జరగాల్సి ఉంది. క్షమాభిక్ష నేపథ్యంలో ఆ కేసులను న్యాయమార్తులు రద్దు చేస్తారు. హంటర్ 2014 జనవరి 1 నుంచి 2024 డిసెంబర్ 1 వరకు హంటర్ ఎలాంటి నేరాలకు పాల్పడి ఉన్నా వాటన్నింటికీ క్షమాభిక్ష వర్తిస్తుంది!
ట్రంప్ ప్రతీకారానికి భయపడే!
అధికార పత్రాల లీకేజీ కేసులో ట్రంప్‌పై దర్యాప్తు సందర్భంగా న్యాయ శాఖ దూకుడుగా వ్యవహరించడం తెలిసిందే. ఆయన నివాసాల్లో పదేపదే తనిఖీలు జరిగాయి. ట్రంప్ భార్య మెలానియా వార్డ్ రోబ్‌లను కూడా వదలకుండా గాలించారు. బైడెన్ ఆదేశాల మేరకే అధికారులు ఇలా చేశారని ట్రంప్ పలుమార్లు ఆరోపించారు. ‘‘ఇవన్నీ మనసులో పెట్టుకుని ట్రంప్ పగ్గాలు చేపట్టాక తన కుటుంబంపై కక్షసాధింపుకు పాల్పడతారని బైడెన్ ఆందోళన చెందారు.
ముఖ్యంగా హంటర్‌పై కేసుల దర్యాప్తును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారని భయపడ్డారు. ప్రస్తుత కేసుల నుంచి బయట పడేసినా ఇంకేమైనా అభియోగాలు మోపవచ్చని భావించారు. అందుకే కుమారునికి క్షమాభిక్ష ఏకంగా పదేళ్ల కాలానికి వర్తించేలా జాగ్రత్త పడ్డారు’’ అని పరిశీలకులు అంటున్నారు. ‘‘అధ్యక్ష ఎన్నికల్లో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ గెలిస్తే బైడెన్ బహుశా ఇలా క్షమాభిక్ష నిర్ణయం తీసుకునేవారు కాదు. ట్రంప్ గెలవడంతో తన కుటుంబంపై కచ్చితంగా ప్రతీకార చర్యలకు దిగుతారని భావించారు’’ అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
న్యాయవ్యవస్థ దుర్వినియోగం: డొనాల్డ్ ట్రంప్
క్షమాభిక్ష నిర్ణయాన్ని ట్రంప్ తీవ్రంగా తప్పుబట్టారు. సొంత కుమారుని కోసం అధ్యక్ష అధికారాలను బైడెన్ పూర్తిగా దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ఇది న్యాయ వ్యవస్థను అపహాస్యం చేయడమే నని సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. 2021లో యూఎస్ క్యాపిటల్ హిల్ భవనంపై దాడి కేసులో తన మద్దతుదారులకు క్షమాభిక్ష ఎందుకు ప్రసాదించలేదని బైడెన్‌ను ట్రంప్ ప్రశ్నించారు.
తప్పులు దిద్దుకుంటా: హంటర్
తనకు లభించిన క్షమాభిక్ష తప్పులను దిద్దుకోవడానికి, జీవితాన్ని పునర్నిర్మించుకోవడానికి అవకాశంగా హంటర్ అభివర్ణించారు. ‘‘క్షమాభిక్షను తేలికగా తీసుకోను. బాధల్లో ఉన్నవారికి సాయపడేందుకు నా జీవితాన్ని అంకితం చేస్తా’’ అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కేసుల విషయంలో కాంగ్రెస్, రిపబ్లికన్ల ఒత్తిడికి తలొగ్గి ట్రంప్ తనను లక్ష్యంగా చేసుకున్నారని హంటర్ మొదటి నుంచీ వాదిస్తున్నారు. ‘‘వ్యసనాల బారిన పడిన చీకటి రోజుల్లో చేసిన తప్పులను నేను అంగీకరించా. వాటికి బాధ్యత తీసుకున్నా. అయినా నన్ను రాజకీయంగా బలి చేయడానికి, నా కుటుంబాన్ని అవమానించడానికి నాపై కేసులను వాడుకున్నారు’’ అని ఆరోపించారు.
వియ్యంకునికి ట్రంప్ క్షమాభిక్ష
అమెరికాలో అధ్యక్షులు ఇలా కుటుంబీకుల కోసం పదవీ విరమణకు ముందు క్షమాభిక్ష అధికారాన్ని వాడటం ఇది తొలిసారేమీ కాదు. బిల్ క్లింటన్ కూడా అధ్యక్ష పదవి నుంచి వైదొలగడానికి ముందు తన సోదరునికి క్షమాభిక్ష పెట్టారు. ట్రంప్ కూడా తన అల్లుడు జరేద్ కుష్నర్ తండ్రికి క్షమాభిక్ష పెట్టారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఇలా కుటుంబీకులకు క్షమాభిక్ష పెట్టడం కచ్చితంగా అధికార దుర్వినియోగమేనని అమెరికన్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ జెఫ్రీ క్రౌచ్ అన్నారు. దేశాధ్యక్షులు వ్యక్తిగత ప్రయోజనాల కోసం స్నేహితులు, కుటుంబీకులు, మిత్రపక్షాలకు సాయం చేయడానికి ఇలా తమ అధికారాన్ని ఉపయోగించకూడదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment