ఎస్. రాజమహేంద్రారెడ్డి
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇప్పుడు దెబ్బతిన్న పులా? అలసిపోయిన పులా? దాదాపు రెండు దశాబ్దాలకుపైగా ఎదురులేని, తిరుగులేని నేతగా రష్యాను పరిపాలిస్తున్న పుతిన్‌ను ఉవ్వెత్తున ఎగసి అంతేవేగంగా నేలకరిచిన ఓ సాయుధ తిరుగుబాటు ఉక్కిరిబిక్కిరి చేసింది. నమ్మక ద్రోహాన్ని కూకటివేళ్లతో పెకిలించివేసే రికార్డు ఉన్న పుతిన్ ఈసారి ఎందుకో క్షమాభిక్షతో పేజీ తిప్పేశారు.
రష్యాపై పుతిన్ పట్టు సడలుతోంది అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? ఎన్నో రహస్య యుద్ధాల్లో తన కనుసన్నల్లో కాలుదువి్వన వాగ్నర్ గ్రూప్‌సేనలు మడమతిప్పి తన మీదే తుపాకీ ఎక్కుపెట్టడం పుతిన్‌కు మింగుడు పడడం లేదు. వండివార్చే చెఫ్ నుంచి కిరాయి సేన చీఫ్‌గా అంచెలంచెలుగా ఎదిగిన యెవ్‌గెనీ ప్రిగోజిన్ తిరుగుబాటుకు తెగిస్తాడని పుతిన్ కలలో కూడా ఊహించలేదు. ఆయన తేరుకునేలోపే ప్రిగోజిన్ సేనలు రష్యాలో ఓ పట్టణాన్ని తమ అ«దీనంలోకి తీసుకోవడమే కాకుండా రాజధాని మాస్కో ముట్టడికి కదం తొక్కాయ
అపారమైన సైనిక శక్తి, సాయుధ సంపత్తి కలిగి ఉన్న రష్యా ఈ కిరాయి సేనలను ఎందుకు నిలువరించలేకపోయిందో ఎవరికీ అర్థం కాని మిలియన్ డాలర్ల ప్రశ్న! తిరుగుబాటును ముందస్తుగా పసిగట్టలేనంత దుస్థితిలో రష్యా ఇంటెలిజెన్స్ వర్గాలు ఉన్నాయా? అన్న అనుమానం రాక మానదు. పుతిన్‌లో మునుపటి దూకుడు లేదనడానికి ఇది నిదర్శనం కాదా? అనవసరమైన రాజ్యకాంక్షకు దాసోహమని అందుబాటులో ఉన్న బలగాలన్నింటినీ ఉక్రెయిన్‌పై మోహరించడం తిరుగుబాటుకు కారణం కాదా? ఇంతకీ పుతిన్‌కు ఏమైంది? రాజకీయ విశ్లేషకులకు కూడా అర్థం కాని ప్రశ్న ఇదే.
ఆయుధాలు ఇవ్వనందుకేనా?
వంటవాడు గరిటె విసిరేసి తుపాకీ పడితే.. అతడే యెవ్‌గెనీ ప్రిగోజిన్ అవుతాడు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఇష్టమైన వంటకాలను రుచికరంగా వండి వడ్డించి ఆయనకు కుడిభుజంగా రూపాంతరం చెందిన ప్రిగోజిన్ హఠాత్తుగా పక్కల్లో బల్లెంలా తయారై 24 గంటలపాటు తన బాస్‌ను భయపెట్టేశాడు. పుతిన్‌కు ఇంతకాలం విధేయుడిగా మసలిన ప్రిగోజిన్‌కు ఎందుకు అంత కోపమొచి్చంది? ఉక్రెయిన్‌లో తన సారథ్యంలోని వాగ్నర్ గ్రూప్ సేనలు సాధించిన విజయాలను రష్యా సైన్యం వారి ఖాతాలో వేసుకోవడం ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
యుద్ధం గడుస్తున్న కొద్దీ కరిగిపోతున్న ఆయుధ నిల్వలు, మందుగుండు సామగ్రిని భర్తీ చేయకపోవడం ప్రిగోజిన్‌ను అసహనానికి గురిచేసింది. నిజానికి అతడి కోపమంతా రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగూ, చీఫ్ జనరల్ వాలెరీ గెరాసిమో పైనే. బఖ్‌ముత్ ప్రాంతంలో ఉక్రెయిన్ సేనలతో జరిగిన యుద్ధంతో తమకు కావాల్సిన ఆయుధాలను సరఫరా చేసేందుకు రష్యా ససేమిరా అనడమే తిరుగుబాటు అసలు కారణమని విశ్లేషకుల అంచనా. రష్యాకు ఆయువు పట్టయిన కీలక మిలటరీ స్థావరం రోస్తోవ్‌ను చేజిక్కించుకొని, అదే ఊపులో ప్రిగోజిన్ సేనలు మాస్కో వైపు కదలడంతో తిరుగుబాటు బహిర్గతమైంది.
అయితే రష్యా వైమానిక దళం కమాండర్ జనరల్ సెర్గెయ్ సురోవికిన్‌కు ఈ తిరుగుబాటు వ్యూహం గురించి ముందే తెలుసని, అంతర్లీనంగా ఆయన మద్దతు ప్రిగోజిన్‌కు ఉందని భోగట్టా. అందుకే ఆయన మౌనంగా ఉండిపోయారని రష్యా నిఘా వర్గాల సమాచారం. రష్యా సైన్యంలో కీలక స్థానాల్లో ఉన్న మరికొందరు జనరల్స్ సైతం పుతిన్ వ్యవహార శైలి రుచించక ప్రిగోజిన్‌కు పరోక్షంగా మద్దతు ఇచ్చారన్న వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి.
వాగ్నర్ గ్రూప్ కిరాయి సేనల పరిస్థితేమిటి?
సిరియా అంతర్యుద్ధంలో, 2014లో ఉక్రెయిన్ నుంచి క్రిమియాను హస్తగతం చేసుకొనే క్రమంలో జరిగిన పోరాటంలో క్రెమ్లిన్ తరపున ప్రిగోజిన్ పనిచేశాడు. అంతటి వీరవిధేయుడు తిరుగుబాటు నేపథ్యంలో పుతిన్‌కు బద్ధశత్రువుగా మారిపోయాడు. అయినప్పటికీ బెలారస్ అధ్యక్షుడి మధ్యవర్తిత్వంతో ప్రిగోజిన్ క్షేమంగా రష్యా పొలిమేరలు దాటి వెళ్లిపోయాడు. ఏ షరతులకు లోబడి క్రెమ్లిన్‌కు, ప్రిగోజిన్‌కు మధ్య సంధి కుదిరిందో ఇంకా బయటపడలేదు.
సంధి కుదిర్చిన బెలారస్ అధ్యక్షుడు లుకòÙంకో కూడా దీనిపై ఏ ప్రకటనా చేయలేదు. పుతిన్ కూడా ఈ అంశంపై పెదవి విప్పలేదు. క్షమాభిక్ష పెడుతున్నానని మాత్రమే ప్రకటించాడు. పుతిన్ మునుపటి బలవంతుడు కాదు, బలహీనుడు అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించడం ఇక్కడ గమనార్హం. ప్రిగోజిన్ క్షమాభిక్షతో బయటపడినప్పటికీ అతడి సారథ్యంలోని వాగ్నర్ గ్రూప్ కిరాయి సైనికుల భవిష్యత్తు ఏమిటన్నది ఇంకా తేలలేదు. చెల్లాచెదురైపోతారా? లేక రష్యా సైన్యంలో విలీనమై ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగిస్తారా? అనేది వేచి చూడాల్సిందే.
ఈ క్షమాభిక్ష తాత్కాలికమే!
తిరుగుబాటును వెన్నుపోటుగా, దేశ ద్రోహంగా అభివరి్ణంచిన పుతిన్ అందుకు కారణమైన వాళ్ల అంతు చూస్తానంటూ బాహాటంగా ప్రకటించకపోవడం సామాన్య పౌరులకు సైతం విడ్డూరంగా అనిపించింది. బెలారస్ అధ్యక్షుడు లుకòÙంకో మధ్యవర్తిత్వంతో తిరుగుబాటు తిరుగుబాట పట్టినప్పటికీ, ప్రిగోజిన్‌కు, అతడి కిరాయి సేనలకు పుతిన్ క్షమాభిక్ష ప్రసాదించడం ఈ మొత్తం ఉదంతానికి యాంటీ క్లయిమాక్స్‌గానే చెప్పుకోవాలి. ఈ క్షమాభిక్ష తాత్కాలికమేనని, తిరుగుబాటుదారుల్లో ఏ ఒక్కరినీ పుతిన్ వదిలిపెట్టరనేది మరికొందరి వాదన.
ఏది ఏమైనప్పటికీ పుతిన్ అధికార ప్రస్థానంలో ఇది మాయని మచ్చగానే మిగిలిపోతుంది. తిరుగుబాటు చల్లారిన తర్వాత పుతిన్ రెండుసార్లు జాతినుద్దేశించి ప్రసంగించారు. ఆ రెండూ రికార్డు చేసి, ప్రసారం చేసినవే కావడం గమనార్హం. రష్యా ప్రజలను అవి పెద్దగా ఆకట్టుకోలేదు. ఇంత జరిగినా రష్యా ప్రజల్లో అధిక శాతం ఆయనకు మద్దతుగానే నిలవడం విశేషం. ఈ నేపథ్యంలో పుతిన్ ఉన్నట్టుండి బుధవారం జనం మధ్యలో ప్రత్యక్షమయ్యారు. వారితో కరచాలనాలు చేసి తానేమీ బెదిరిపోలేదనే సంకేతాలు పంపించారు.
కొసమెరుపు..
తిరుగుబాటు జరిగి(జూన్ 23) వారం రోజులవుతోంది. 24 గంటల్లోనే ఈ తిరుగుబాటు చల్లారడం, బాధ్యుడైన ప్రిగోజిన్ స్వేచ్ఛగా రష్యా విడిచి వెళ్లడం జరిగిపోయింది. అయితే ప్రిగోజిన్ ఎక్కడ తలదాచుకున్నాడో ఎవరికీ అంతుబట్టడం లేదు. మరోవైపు తిరుగుబాటు సమాచారం ముందే తెలిసినా మౌనంగా ఉండిపోయిన రష్యా వైమానిక దళం కమాండర్ సెర్గెయ్ సురోవికిన్ కూడా మాయమైపోయాడు. ఆయన ఎక్కడున్నాడో ఇటు రష్యా నిఘా సంస్థకు గానీ, అటు ఆయన కుటుంబ సభ్యులకు గానీ సమాచారం లేదు. అవిధేయతను అణచివేయడంలో సిద్ధహస్తుడైన పుతిన్ వేట మొదలుపెట్టారా? ఏమో! ఏమైనా కావొచ్చు!!
Comments
Please login to add a commentAdd a comment