
ఉక్రెయిన్‌తో శాంతి చర్చలపై పుతిన్ స్పష్టీకరణ
మాస్కో: ఉక్రెయిన్‌లో ప్రభుత్వం మారితేనే శాంతి నెలకొంటుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. అక్కడ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత శాంతి చర్చలు జరపాలన్నారు. చర్చల్లో అమెరికాతో పాటు బ్రిక్స్ దేశాలు, ఉత్తర కొరియా కూడా పాలుపంచుకోవాలని ఆకాంక్షించారు. ఉత్తర రష్యాలోని ఓడరేవు పట్టణం ముర్మాన్‌స్కోలో సైనికుల బృందంతో పుతిన్ శుక్రవారం మాట్లాడారు.
మూడేళ్ల యుద్ధానికి ముగింపు పలకడానికి సిద్ధమేనన్నారు. అయితే శాంతి ప్రక్రియ కోసం పలు షరతులు విధించినట్టు రష్యా అధికార వార్తా సంస్థ టాస్ తెలిపింది. ఉక్రెయిన్‌లో ఎన్నికలు జరగాలి. ఆ దేశం అంతర్జాతీయ పాలనలోకి రావాలి. ఆలోపు అక్కడ తాత్కాలిక ప్రభుత్వం కొలువుదీరాలి. కీలక ఒప్పందాలపై సంతకాల వంటివన్నీ ఆ తర్వాతే’’ అని పుతిన్ పేర్కొన్నట్టు వెల్లడించింది. ‘‘శాంతియుత పరిష్కారమే మా అభిమతం కూడా. కానీ ముందుగా ఉక్రెయిన్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరపాలి. ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వం రావాలి.
యూరప్‌తో కలిసి పనిచేయడానికీ నేను సిద్ధం. కానీ యూరప్ అస్థిరంగా వ్యవహరిస్తూ మమ్మల్ని మభ్యపెట్టజూస్తోంది’’ అని పుతిన్ ఆరోపించారు. యుద్ధం ముగియాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నారంటూ కొనియాడారు. తాత్కాలిక కాల్పుల విరమణ కోసం సౌదీ అరేబియాలో ఈ వారం రష్యా, ఉక్రెయిన్, అమెరికా చర్చలు జరపడం తెలిసిందే. వాటి తీరుపై అమెరికా పెదవి విరిచింది. ‘‘నల్ల సముద్రంలో నౌకలపై సైనిక దాడులను నిలిపేయడానికి రష్యా, ఉక్రెయిన్ అంగీకరించాయి. కానీ ఆ తర్వాత శాంతి చర్చలను అవి సీరియస్‌గా తీసుకోవడం లేదు’’ అని పేర్కొంది. ఏప్రిల్లో రెండో విడత శాంతి చర్చలు జరగనున్నాయి.