ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి ముగింపు పలకడమే లక్ష్యంగా ఇరు దేశాల మధ్య శాంతి చర్చల కోసం తన వంతు సహకారం అందిస్తానన్న ప్రకటనతో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ రష్యా పర్యటన ప్రారంభించారు. శాంతి ప్రణాళికతో వచ్చానని చెప్పారు. తన బృందంతో కలిసి మూడు రోజులపాటు రష్యా రాజధాని మాస్కోలో మకాం వేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో, ఆయన బృందంతో సుదీర్ఘంగా ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
సైన్స్ అండ్ టెక్నాలజీ, వ్యాపారం, వాణిజ్యం వంటి రంగాల్లో పరస్పర సహకారం కోసం చైనా–రష్యా పదికిపైగా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అండగా ఉంటానని పుతిన్‌కు జిన్‌పింగ్ అభయ హస్తం ఇచ్చారు. ఉక్రెయిన్‌పై ఏకపక్షంగా దండయాత్రకు దిగిన రష్యా పశ్చిమ దేశాల ఆంక్షల కారణంగా ప్రపంచంలో దాదాపు ఏకాకిగా మారింది. మరోవైపు ఉక్రెయిన్‌లో యుద్ధ నేరాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో పుతిన్‌పై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) అరెస్ట్ వారెంటు జారీ చేసింది.
రష్యా నుంచి బయటకు రాగానే పుతిన్‌ను అరెస్టు చేయడం తథ్యమని చెబుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ రష్యాలో పర్యటించారు. పుతిన్‌కు స్నేహహస్తం అందించారు. జిన్‌పింగ్ రష్యాలో ఉన్న సమయంలోనే అమెరికా మిత్రుడైన జపాన్ ప్రధానమంత్రి ఫ్యుమియో కిషిదా ఉక్రెయిన్‌లో అడుగుపెట్టడం గమనార్హం. చైనా, రష్యా మధ్య బంధాన్ని పటిష్టం చేసుకోవడంతోపాటు ప్రపంచ దేశాలపై అమెరికా, దాని మిత్రదేశాల పెత్తనం ఇకపై చెల్లదన్న సంకేతాలు ఇవ్వడమే జిన్‌పింగ్, పుతిన్ భేటీ వెనుక ఉన్న అసలు ఉద్దేశమని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఐదు కీలక అంశాలు ఉన్నాయని అంటున్నారు. అవేమిటో చూద్దాం..
ఉక్రెయిన్‌పై చొరవ సున్నా
ఉక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరించే విషయంలో జిన్‌పింగ్ ఏమీ సాధించలేకపోయారు. యుద్ధాన్ని ముగించేలా రష్యాపై ఒత్తిడి పెంచలేదు. కనీసం ఆ విషయాన్ని కూడా ప్రస్తావించలేదు. ఉక్రెయిన్‌లో హింస, అమాయక ప్రజల మరణాలపై మాటమాత్రంగానైనా స్పందించలేదు. ఉక్రెయిన్‌లో ఉద్రిక్తతలను పెంచే చర్యలకు దూరంగా ఉండాలంటూ జిన్‌పింగ్, పుతిన్ సంయక్తంగా పశ్చిమ దేశాలకు హితబోధ చేశారు.
ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని, భద్రతను, ప్రయోజనాలను గౌరవించాలని సూచించారు. శాంతికి చొరవ చూపుతానన్న జిన్‌పింగ్ ఆ దిశగా ఎలాంటి ప్రయత్నం చేయలేదు. పుతిన్‌తో భేటీలో ఆ ఊసే ఎత్తలేదు. ఉక్రెయిన్ నుంచి ఇప్పటికిప్పుడు తమ సైన్యాన్ని వెనక్కి రప్పించే ప్రతిపాదన ఏదీ లేదని పుతిన్ తేల్చిచెప్పారు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యకు పశ్చిమ దేశాల రెచ్చగొట్టే చర్యలే కారణమని చైనా, రష్యా చాలా రోజులుగా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.
సైనిక సహకారం, రక్షణ సంబంధాలు
నాటో దేశాలతోపాటు ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్‌డమ్, అమెరికా(ఏయూకేయూఎస్) భద్రతా చట్టం వంటి వాటితో తమకు ముప్పు పొంచి ఉందని చైనా, రష్యా చెబుతున్నాయి. అందుకే పరస్పరం సైనిక సహకారం మరింత పెంపొందించుకోవాలని, రక్షణ సంబంధాలు బలోపేతం చేసుకోవాలని జిన్‌పింగ్, పుతిన్ నిర్ణయించుకున్నారు. ఆసియా ఖండంలో స్థానికంగా ఎదురవుతున్న చిక్కులను పరిష్కరించుకోవడంతోపాటు పశ్చిమ దేశాలకు చెక్ పెట్టడానికి ఇది తప్పనిసరి అని భావిస్తున్నారు.
పలు ఆసియా–పసిఫిక్ దేశాలతో అమెరికా సైనిక–రక్షణ సంబంధాలు మెరుగుపడుతుండడం పట్ల ఇద్దరు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికంగా శాంతికి, స్థిరత్వానికి విఘాతం కలిగించే బాహ్య సైనిక శక్తులను తీవ్రంగా వ్యతిరేకిస్తామని ప్రకటించారు. ఇకపై ఉమ్మడి సైనిక విన్యాసాలు తరచుగా చేపట్టాలని నిర్ణయానికొచ్చారు. తద్వారా తాము ఇరువురం ఒక్కటేనని, తమ జోలికి రావొద్దంటూ ప్రత్యర్థులకు హెచ్చరికలు జారీ చేశారు.
అమెరికా వ్యతిరేక కూటమి
అమెరికాకు వ్యతిరేకంగా తామే ఒక కొత్త కూటమిగా ఏర్పాటు కావడంతోపాటు నూతన వరల్డ్ ఆర్డర్ నెలకొల్పాలన్నదే చైనా, రష్యా ఆలోచనగా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ వరల్డ్ ఆర్డర్ తమ సొంత అజెండాలకు అనుగుణంగా, ప్రయోజనాలను కాపాడేలా ఉండాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి. దీనిపై జిన్‌పింగ్, పుతిన్ మధ్య చర్చలు సాగినట్లు తెలుస్తోంది. బహుళ ధ్రువ ప్రపంచం కోసం కృషి చేద్దామని ఉమ్మడి ప్రకటనలో ఇరువురు నేతలు పిలుపునిచ్చారు.
అమెరికా పెత్తనం కింద ఏకధ్రువ ప్రపంచానికి కాలం చెల్లిందన్నదే వారే వాదన. జిన్‌పింగ్ చైనాకు బయలుదేరే ముందు పుతిన్‌తో కరచాలనం చేశారు. కలిసి పనిచేద్దామని, అనుకున్న మార్పులు తీసుకొద్దామని చెప్పారు. మన ఆలోచనలను ముందుకు తీసుకెళ్దామని అన్నారు. పశ్చిమ దేశాల శకం ముగిసిందని, ఇకపై చైనా ప్రాబల్యం మొదలుకాబోతోందని జిన్‌పింగ్ పరోక్షంగా వెల్లడించారు.
వ్యాపార, వాణిజ్యాలకు అండ
యుద్ధం మొదలైన తర్వాత తమ దేశం నుంచి వెళ్లిపోయిన పశ్చిమ దేశాల వ్యాపార సంస్థల స్థానంలో చైనా వ్యాపారాల సంస్థలను ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నామని పుతిన్ చెప్పారు. నాటో దేశాల ఆంక్షల తర్వాత ఎగుమతులు, దిగుమతుల విషయంలో చైనాపై రష్యా ఆధారపడడం పెరుగుతోంది. ఇరు దేశాల నడుమ ఇంధన వాణిజ్యం అభివృద్ధి చెందుతోంది. చమురు, గ్యాస్, బొగ్గు, విద్యుత్, అణు శక్తి వంటి రంగాల్లో ఇరుదేశాల సంస్థలు కలిసికట్టుగా పనిచేసేలా మద్దతు ఇస్తామని జిన్‌పింగ్, పుతిన్ తెలిపారు. కొత్తగా చైనా–మంగోలియా–రష్యా నేచురల్ గ్యాస్ పైప్‌లైన్ ప్రాజెక్టు చేపడతామని పుతిన్ వెల్లడించారు.
రష్యాకే మొదటి ప్రాధాన్యం
► ఇతర దేశాలతో సంబంధాలను పణంగా పెట్టయినా సరే రష్యాతో బంధాన్ని కాపాడుకోవాలని చైనా పట్టుదలతో ఉన్నట్లు అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు.
► అమెరికా వ్యతిరేకతే ఏకైక అజెండాగా రెండు దేశాలు ఒక్కటయ్యాయని అభిప్రాయపడుతున్నారు. ఉక్రెయిన్‌కు నాటో దేశాలు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి.
► ఆర్థిక, ఆయుధ సాయం అందిస్తున్నాయి. ఉక్రెయిన్–రష్యా యుద్దం మొదలయ్యాక జిన్‌పింగ్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు.
► యుద్ధాన్ని ఏనాడూ ఖండించలేదు.
► రష్యాకే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తన వైఖరి ద్వారా తేల్చేశారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment