పుతిన్‌ అరెస్ట్‌ అవుతారా?.. బోనెక్కించడం ఐసీసీకి సాధ్యమేనా? | ICC issues arrest warrant against Vladimir Putin amid Ukraine-Russia war | Sakshi
Sakshi News home page

పుతిన్‌ అరెస్ట్‌ అవుతారా?.. బోనెక్కించడం ఐసీసీకి సాధ్యమేనా?

Published Sun, Mar 19 2023 3:03 AM | Last Updated on Sun, Mar 19 2023 7:50 AM

ICC issues arrest warrant against Vladimir Putin amid Ukraine-Russia war - Sakshi

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఏడాదికి పైగా ఉక్రెయిన్‌పై దండయాత్ర సాగిస్తున్నారు. బాంబులు, ఫిరంగులు, క్షిపణులతో దారుణ కాండ సాగిస్తున్నారు. ఎవరెన్ని చెప్పినా, పాశ్చాత్య దేశాలు ఎన్ని ఆంక్షలు విధించినా డోంట్‌ కేర్‌ అన్న ధోరణిలో పోతున్నారు. అలాంటి సమయంలో ఐసీసీ ఆయనపై అరెస్ట్‌ వారెంట్లు జారీ చేయడం సంచలనంగా మారింది. ఇంతకీ ఈ వారెంట్లతో పుతిన్‌ను అరెస్ట్‌ చేయొచ్చా ? మాస్కో చెబుతున్నట్టుగా అ వారెంట్లు చిత్తు కాగితాలతో సమానమా?

► పుతిన్‌పైనున్న ఆరోపణలేంటి?
ఉక్రెయిన్‌లో ఆక్రమిత ప్రాంతాల నుంచి రష్యాకు పిల్లల్ని చట్టవిరుద్ధంగా తరలిస్తున్నారు. ఇప్పటివరకు ఉక్రెయిన్‌ నుంచి రష్యాకి దాదాపుగా 16,221 మంది తరలివెళ్లారని ఐక్యరాజ్య సమితి విచారణలో తేలింది. ఈ పిల్లల్ని తాత్కాలికంగా తరలిస్తున్నట్టు బయటకి చెబుతున్నారు. కానీ ఆ చిన్నారుల్ని రష్యాలో పెంపుడు కుటుంబాలకు ఇచ్చేసి వారిని శాశ్వతంగా రష్యా పౌరుల్ని చేస్తున్నారు.

దీంతో ఉక్రెయిన్‌లో మిగిలిపోయిన తల్లిదండ్రులకు కడుపు కోత మిగులుతోంది. ఇలా పిల్లల్ని తరలించడం అంతర్జాతీయ నిబంధనల ప్రకారం యుద్ధ నేరం కిందకే వస్తుంది. పిల్లల్ని తరలిస్తున్న సైనికుల్ని, ఇతర అధికారుల్ని నియంత్రించలేకపోయిన పుతిన్‌ యుద్ధ నేరస్తుడేనని ఐసీసీ చెబుతోంది. పుతిన్‌తో పాటుగా రష్యా బాలల హక్కుల కమిషనర్‌ మారియా లోవా బెలోవా కూడా సహనిందితురాలుగా ఉంది.  

► పుతిన్‌ అరెస్ట్‌ అవుతారా?
పుతిన్‌ సొంత దేశంలో అపరిమితమైన అధికారాలను అనుభవిస్తున్నారు. రష్యాలో ఉన్నంత కాలం ఆయన సేఫ్‌. ఐసీసీకి సొంత పోలీసు బలగం లేదు. ఏ పని చెయ్యాలన్నా సభ్యదేశాలపైనే ఆధారపడుతుంది. రష్యాను వీడి పుతిన్‌ వేరే దేశానికి వెళితే ఐసీసీ అరెస్ట్‌ చేయొచ్చు. ఈ అరెస్ట్‌ వారెంట్ల జారీతో ఆయన విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు ఏర్పడ్డాయి.  అయితే 2022లో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించడం తెలిసిందే. ఐసీసీ నోటీసులతో అంతర్జాతీయ సమాజం కూడా ఇక పుతిన్‌ కదలికలను నిశితంగా గమనిస్తుంది కాబట్టి ఆయన వేరే దేశం వెళితే మాత్రం అరెస్ట్‌ కాక తప్పకపోవచ్చు.

► విచారణ ఎదుర్కొంటారా?  
పుతిన్‌ విచారణకు కొన్ని అడ్డంకులున్నాయి. ఐసీసీని రష్యా గుర్తించడంలేదు. అమెరికా, రష్యా వంటి దేశాలు ఇందులో సభ్యులు కావు. ఐసీసీ విచారణ పరిధిని అగ్రరాజ్యం అమెరికా కూడా ఆమోదించడం లేదు. మరో అడ్డంకి ఏమిటంటే ఐసీసీ వాద, ప్రతివాదులిద్దరూ హాజరైతే తప్ప విచారణ కొనసాగించదు. ఎవరైనా విచారణకు గైర్హాజరైతే విచారణ ముందుకు సాగదు. పుతిన్‌ను విచారించాలంటే ఐక్యరాజ్యసమితి గుర్తింపు పొందిన దేశాల్లో విచారణ చేయొచ్చు.  పుతిన్‌ను అలా వేరే దేశానికి తీసుకురావడం అసాధ్యం.  

► ఉక్రెయిన్‌ యుద్ధంపై ప్రభావం ఎంత?
ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న అరాచకాలు అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకమని మరోసారి పుతిన్‌కు స్పష్టంగా తెలిసేలా, అంతర్జాతీయ సమాజం దీనిపై ఆగ్రహంగా ఉందని సంకేతాలు ఇచ్చేలా ఈ అరెస్ట్‌ వారెంట్లు ఉన్నాయి. అయితే రష్యా ఈ వారెంట్లను లెక్క చేయలేదు. తాము ఐసీసీని గుర్తించడం లేదు కాబట్టి ఆ వారెంట్లు చిత్తు కాగితంతో సమానమని మాస్కో పెద్దలు వ్యాఖ్యానించారు. పుతిన్‌ అధికార ప్రతినిధి ఒకరు ఈ వారెంట్లు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఐసీసీని ఏ మాత్రం పట్టించుకోని పుతిన్‌ ఈ వారెంట్లకి భయపడి ఉక్రెయిన్‌ అంశంలో వెనకడుగు వేస్తారని అనుకుంటే పొరపాటేనని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటిదాకా ఏ దేశాల నేతలను శిక్షించారు?
► అరాచకాలు సృష్టించిన జర్మనీ నాజీ నాయకుల్ని రెండో ప్రపంచ యుద్ధం తర్వాత న్యూరెంబర్గ్, టోక్యో ట్రైబ్యునళ్లలో విచారించి శిక్షించారు. నియంత అడాల్ఫ్‌ హిట్లర్‌కు కుడిభుజంగా చెప్పుకునే రుడాల్ఫ్‌ హెస్‌కి జీవిత ఖైదు పడింది.
► బోస్నియా, రువాండా, కాంబోడియా దేశాల నాయకుల్ని కూడా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ట్రైబ్యునళ్లలో విచారించారు
► 1990లో యుగోస్లోవియా ముక్కలైనప్పుడు అక్కడ హింసాకాండను ప్రేరేపించిన ఆ దేశాధ్యక్షుడు స్లొబోదాన్‌ మిలోసెవిచ్‌ను ఐక్యరాజ్యసమితి హేగ్‌లో విచారించింది. తీర్పు వచ్చేలోపే ఆయన జైల్లో గుండెపోటుతో మరణించారు. ఆ సమయంలో ఏకంగా 90 మందికి శిక్ష పడింది.  
► అత్యాచారాలను ప్రేరేపించిన లైబీరియా మాజీ అధ్యక్షుడు చార్లెస్‌ టేలర్‌కు 50 ఏళ్ల కారాగార శిక్ష విధించారు
► చాడ్‌ దేశం మాజీ నియంత హిస్సేని హాబ్రేకి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు.  
► ఐసీసీ ఏర్పాటయ్యాక 40 మందిపై నేరారోపణలు రుజువయ్యాయి. వీరంతా ఆఫ్రికా దేశాలకు చెందినవారు.


ఏమిటీ ఐసీసీ?
ఇంటర్నేషనల్‌ క్రిమినల్‌ కోర్టు (ఐసీసీ) 1998లో ‘‘రోమ్‌ స్టాచ్యూట్‌’’ ఒప్పందం కింద ఏర్పాటైంది. దీని ప్రధాన కార్యాలయం నెదర్లాండ్స్‌లోని హేగ్‌లో ఉంది. అంతర్జాతీయ సమాజంపైనా, మానవత్వంపైన జరిగే తీవ్రమైన నేరాలు, మారణహోమాలు, యుద్ధనేరాలను విచారించి శిక్షలు విధిస్తుంది.రెండో ప్రపంచ యుద్ధం సమయంలో న్యూరెంబర్గ్‌ విచారణ తరహాలోనే ఐసీసీ ఏర్పాటైంది. ప్రస్తుతం బ్రిటన్, జపాన్, అఫ్గానిస్తాన్, జర్మనీ సహా 123 దేశాలు ఇందులో సభ్యులుగా ఉన్నా యి. రష్యా, అమెరికా దీనిని గుర్తించలేదు. అదే విధంగా భారత్, చైనా కూడా సభ్యత్వాన్ని తీసుకోలేదు. తీవ్రమైన నేరాల విషయాల్లో ఆయా దేశాల దర్యాప్తు సంస్థలు విచారణలో విఫలమైతే ఐసీసీ జోక్యం చేసుకుంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement