Russia visit
-
నాటో భేటీ వేళ రష్యా యాత్రా?
వాషింగ్టన్: నాటో శిఖరాగ్ర సమావేశం జరుగుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ రష్యాలో పర్యటించడంపై అమెరికా అసంతృప్తితో ఉన్నట్టు బ్లూంబర్గ్ నివేదిక పేర్కొంది. ఇది భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపగలదని ఆ దేశ ఉన్నతాధికారులు భావిస్తున్నట్టు చెప్పుకొచి్చంది. ‘‘పుతిన్‌ను మోదీ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న తీరు అమెరికా ప్రభుత్వం లోపల, వెలుపల విమర్శలకు దారి తీసింది. వాషింగ్టన్లో నాటో సదస్సు జరుగుతుండగా మోదీ రష్యాలో పర్యటించడం బైడెన్ యంత్రాంగానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టించింది. పుతిన్‌ను అంతర్జాతీయ సమాజంలో ఒంటరిని చేయాలన్న నాటో ప్రయత్నాలకు ఇది గండి కొట్టింది. అందుకే అమెరికా విదేశాంగ శాఖ ఉప మంత్రి కర్ట్ కాంప్‌బెల్ జూలై మొదట్లోనే భారత విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాట్రాతో మాట్లాడారు. మోదీ రష్యా పర్యటన షెడ్యూల్ మార్చుకోవాల్సిందిగా కోరారు’’ అని నివేదిక వివరించింది. ఈ ఉదంతంపై విదేశాంగ శాఖ స్పందించాల్సి ఉంది. అమెరికాతో స్నేహాన్ని తేలిగ్గా తీసుకోవద్దని భారత్‌లో ఆ దేశ రాయబారి ఎరిక్ గార్సెట్టీ గురువారం మీడియాతో సమావేశంలో నర్మగర్భ వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. అవి రష్యా పర్యటనను ఉద్దేశించేనని చెబుతున్నారు. రష్యాను విశ్వసనీయమైన దీర్ఘకాలిక మిత్ర దేశంగా భారత్ పరిగణించడం పొరపాటని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివాన్ అభిప్రాయపడ్డారు. -
రష్యాలో మోదీ పర్యటన
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం నుంచి రెండు రోజుల పాటు రష్యాలో పర్యటించనున్నారు. 22వ ఇండో–రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. పలు రంగాల్లో విస్తృతస్థాయి సహకారంపై వారు చర్చిస్తారు. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు దిగాక మోదీ రష్యాలో పర్యటించడం ఇదే తొలిసారి. మూడేళ్ల విరామం తర్వాత భారత్–రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు జరుగుతున్న నేపథ్యంలో ఈ సమిట్‌లో చర్చించబోయే అంశాలు, తీసుకోబోయే ఉమ్మడి నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చివరిసారిగా 2021 డిసెంబర్లో ఢిల్లీలో ఈ సదస్సు జరిగింది. సోమవారం మధ్యాహ్నం రష్యాకు మోదీ చేరుకున్నాక పుతిన్ ఇచ్చే ప్రత్యేక విందు కార్యక్రమానికి మోదీ హాజరుకానున్నారు. తర్వాత శిఖరాగ్ర సదస్సు జరగనుంది. మరుసటి రోజు రష్యాలోని భారతీయసంతతి వ్యక్తులతో మోదీ మాట్లాడతారు. తర్వాత క్లెమ్లిన్‌లో అనామక సైనికుల స్మారకం వద్ద అంజలి ఘటిస్తారు. తర్వాత మాస్కోలో ఎగ్జిబిషన్‌ను సందర్శిస్తారు.ఆస్ట్రియాలోనూ పర్యటనరష్యా పర్యటన తర్వాత 9వ తేదీన మోదీ ఆస్ట్రియాకు వెళ్తారు. ఆస్ట్రియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వాన్ డీర్ బెల్లాన్, చాన్స్‌లర్ కార్ల్ నెహామెర్‌లతో విడివిడిగా ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ‘ఆస్ట్రియా, భారత్ మైత్రీబంధానికి 75 ఏళ్లు పూర్తవుతున్న వేళ మోదీతో చర్చల కోసం సిద్ధంగా ఉన్నా’ అని నెహామెర్ శనివారం ‘ఎక్స్’లో చేసిన పోస్ట్‌కు మోదీ ఆదివారం స్పందించారు. ‘‘ ఇరు దేశాల మధ్య బంధాన్ని మరింత పటిష్టం చేసేందుకు, సహకారంలో కొత్త పథాలను అన్వేషించేందుకు మీతో చర్చల కోసం ఎదురుచూస్తున్నా’’ అని మోదీ ఆదివారం ‘ఎక్స్’లో ఒక పోస్ట్‌పెట్టారు. భారత ప్రధాని ఒకరు ఆస్ట్రియాలో పర్యటిస్తుండటం గత 40 ఏళ్లలో ఇదే తొలిసారికావడం విశేషం. భారత్, ఆస్ట్రియాకు చెందిన పారిశ్రామిక దిగ్గజాలతో మోదీ భేటీ కొనసాగుతుంది. మాస్కోతోపాటు వియన్నాలోని భారతీయ సంతతి ప్రజలతో ప్రధాని ముచ్చటించనున్నారు. -
రష్యాలో కిమ్ జోంగ్ ఉన్ బిజీబిజీ
సియోల్: ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ రష్యా పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఆయన శనివారం రష్యా ఆయుధాగారాన్ని సందర్శించారు. రష్యా అభివృద్ధి చేసిన అణ్వస్త్ర సహిత బాంబర్లు, హైపర్‌సానిక్ క్షిపణులు, అత్యాధునిక యుద్ధ నౌకను పరిశీలించారు. కిమ్ తొలుత ఉత్తర కొరియా నుంచి రైలులో అరి్టయోమ్ సిటీకి చేరుకున్నారు. ఇక్కడికి సమీపంలోని ఎయిర్‌పోర్టులో రష్యాకు చెందిన వ్యూహాత్మక బాంబర్లు, యుద్ధ విమానాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కిమ్ వెంట రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు ఉన్నారు. టు–160, టు–95–, టు–22 బాంబర్ల గురించి కిమ్ ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. మిగ్–31 ఫైటర్ జెట్ నుంచి ప్రయోగించే హైపర్‌సానిక్ కింజాల్ క్షిపణుల గురించి కిమ్‌కు సెర్గీ వివరించారు. ఇలాంటి క్షిపణులను ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా సైన్యం ప్రయోగిస్తోంది. కిమ్, సెర్గీ షోయిగు కలిసి రేవు నగరం వ్లాదివోస్తోక్ చేరుకున్నారు. ఇక్కడ అత్యాధునిక యుద్ధ నౌకలను, ఆయుధాలను కిమ్ పరిశీలించారు. ఆయుధాలు, ఉపగ్రహాల తయారీ విషయంలో రష్యా నుంచి ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికే కిమ్ రష్యాలో పర్యటిస్తున్నట్లు పశి్చమ దేశాలు అంచనా వేస్తున్నాయి. -
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ రష్యా పర్యటన.. ఇద్దరు మిత్రులు సాధించిందేమిటి?
ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి ముగింపు పలకడమే లక్ష్యంగా ఇరు దేశాల మధ్య శాంతి చర్చల కోసం తన వంతు సహకారం అందిస్తానన్న ప్రకటనతో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ రష్యా పర్యటన ప్రారంభించారు. శాంతి ప్రణాళికతో వచ్చానని చెప్పారు. తన బృందంతో కలిసి మూడు రోజులపాటు రష్యా రాజధాని మాస్కోలో మకాం వేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో, ఆయన బృందంతో సుదీర్ఘంగా ద్వైపాక్షిక చర్చలు జరిపారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, వ్యాపారం, వాణిజ్యం వంటి రంగాల్లో పరస్పర సహకారం కోసం చైనా–రష్యా పదికిపైగా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అండగా ఉంటానని పుతిన్‌కు జిన్‌పింగ్ అభయ హస్తం ఇచ్చారు. ఉక్రెయిన్‌పై ఏకపక్షంగా దండయాత్రకు దిగిన రష్యా పశ్చిమ దేశాల ఆంక్షల కారణంగా ప్రపంచంలో దాదాపు ఏకాకిగా మారింది. మరోవైపు ఉక్రెయిన్‌లో యుద్ధ నేరాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో పుతిన్‌పై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) అరెస్ట్ వారెంటు జారీ చేసింది. రష్యా నుంచి బయటకు రాగానే పుతిన్‌ను అరెస్టు చేయడం తథ్యమని చెబుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ రష్యాలో పర్యటించారు. పుతిన్‌కు స్నేహహస్తం అందించారు. జిన్‌పింగ్ రష్యాలో ఉన్న సమయంలోనే అమెరికా మిత్రుడైన జపాన్ ప్రధానమంత్రి ఫ్యుమియో కిషిదా ఉక్రెయిన్‌లో అడుగుపెట్టడం గమనార్హం. చైనా, రష్యా మధ్య బంధాన్ని పటిష్టం చేసుకోవడంతోపాటు ప్రపంచ దేశాలపై అమెరికా, దాని మిత్రదేశాల పెత్తనం ఇకపై చెల్లదన్న సంకేతాలు ఇవ్వడమే జిన్‌పింగ్, పుతిన్ భేటీ వెనుక ఉన్న అసలు ఉద్దేశమని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఐదు కీలక అంశాలు ఉన్నాయని అంటున్నారు. అవేమిటో చూద్దాం.. ఉక్రెయిన్‌పై చొరవ సున్నా ఉక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరించే విషయంలో జిన్‌పింగ్ ఏమీ సాధించలేకపోయారు. యుద్ధాన్ని ముగించేలా రష్యాపై ఒత్తిడి పెంచలేదు. కనీసం ఆ విషయాన్ని కూడా ప్రస్తావించలేదు. ఉక్రెయిన్‌లో హింస, అమాయక ప్రజల మరణాలపై మాటమాత్రంగానైనా స్పందించలేదు. ఉక్రెయిన్‌లో ఉద్రిక్తతలను పెంచే చర్యలకు దూరంగా ఉండాలంటూ జిన్‌పింగ్, పుతిన్ సంయక్తంగా పశ్చిమ దేశాలకు హితబోధ చేశారు. ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని, భద్రతను, ప్రయోజనాలను గౌరవించాలని సూచించారు. శాంతికి చొరవ చూపుతానన్న జిన్‌పింగ్ ఆ దిశగా ఎలాంటి ప్రయత్నం చేయలేదు. పుతిన్‌తో భేటీలో ఆ ఊసే ఎత్తలేదు. ఉక్రెయిన్ నుంచి ఇప్పటికిప్పుడు తమ సైన్యాన్ని వెనక్కి రప్పించే ప్రతిపాదన ఏదీ లేదని పుతిన్ తేల్చిచెప్పారు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యకు పశ్చిమ దేశాల రెచ్చగొట్టే చర్యలే కారణమని చైనా, రష్యా చాలా రోజులుగా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. సైనిక సహకారం, రక్షణ సంబంధాలు నాటో దేశాలతోపాటు ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్, అమెరికా(ఏయూకేయూఎస్) భద్రతా చట్టం వంటి వాటితో తమకు ముప్పు పొంచి ఉందని చైనా, రష్యా చెబుతున్నాయి. అందుకే పరస్పరం సైనిక సహకారం మరింత పెంపొందించుకోవాలని, రక్షణ సంబంధాలు బలోపేతం చేసుకోవాలని జిన్‌పింగ్, పుతిన్ నిర్ణయించుకున్నారు. ఆసియా ఖండంలో స్థానికంగా ఎదురవుతున్న చిక్కులను పరిష్కరించుకోవడంతోపాటు పశ్చిమ దేశాలకు చెక్ పెట్టడానికి ఇది తప్పనిసరి అని భావిస్తున్నారు. పలు ఆసియా–పసిఫిక్ దేశాలతో అమెరికా సైనిక–రక్షణ సంబంధాలు మెరుగుపడుతుండడం పట్ల ఇద్దరు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికంగా శాంతికి, స్థిరత్వానికి విఘాతం కలిగించే బాహ్య సైనిక శక్తులను తీవ్రంగా వ్యతిరేకిస్తామని ప్రకటించారు. ఇకపై ఉమ్మడి సైనిక విన్యాసాలు తరచుగా చేపట్టాలని నిర్ణయానికొచ్చారు. తద్వారా తాము ఇరువురం ఒక్కటేనని, తమ జోలికి రావొద్దంటూ ప్రత్యర్థులకు హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా వ్యతిరేక కూటమి అమెరికాకు వ్యతిరేకంగా తామే ఒక కొత్త కూటమిగా ఏర్పాటు కావడంతోపాటు నూతన వరల్డ్ ఆర్డర్ నెలకొల్పాలన్నదే చైనా, రష్యా ఆలోచనగా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ వరల్డ్ ఆర్డర్ తమ సొంత అజెండాలకు అనుగుణంగా, ప్రయోజనాలను కాపాడేలా ఉండాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి. దీనిపై జిన్‌పింగ్, పుతిన్ మధ్య చర్చలు సాగినట్లు తెలుస్తోంది. బహుళ ధ్రువ ప్రపంచం కోసం కృషి చేద్దామని ఉమ్మడి ప్రకటనలో ఇరువురు నేతలు పిలుపునిచ్చారు. అమెరికా పెత్తనం కింద ఏకధ్రువ ప్రపంచానికి కాలం చెల్లిందన్నదే వారే వాదన. జిన్‌పింగ్ చైనాకు బయలుదేరే ముందు పుతిన్‌తో కరచాలనం చేశారు. కలిసి పనిచేద్దామని, అనుకున్న మార్పులు తీసుకొద్దామని చెప్పారు. మన ఆలోచనలను ముందుకు తీసుకెళ్దామని అన్నారు. పశ్చిమ దేశాల శకం ముగిసిందని, ఇకపై చైనా ప్రాబల్యం మొదలుకాబోతోందని జిన్‌పింగ్ పరోక్షంగా వెల్లడించారు. వ్యాపార, వాణిజ్యాలకు అండ యుద్ధం మొదలైన తర్వాత తమ దేశం నుంచి వెళ్లిపోయిన పశ్చిమ దేశాల వ్యాపార సంస్థల స్థానంలో చైనా వ్యాపారాల సంస్థలను ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నామని పుతిన్ చెప్పారు. నాటో దేశాల ఆంక్షల తర్వాత ఎగుమతులు, దిగుమతుల విషయంలో చైనాపై రష్యా ఆధారపడడం పెరుగుతోంది. ఇరు దేశాల నడుమ ఇంధన వాణిజ్యం అభివృద్ధి చెందుతోంది. చమురు, గ్యాస్, బొగ్గు, విద్యుత్, అణు శక్తి వంటి రంగాల్లో ఇరుదేశాల సంస్థలు కలిసికట్టుగా పనిచేసేలా మద్దతు ఇస్తామని జిన్‌పింగ్, పుతిన్ తెలిపారు. కొత్తగా చైనా–మంగోలియా–రష్యా నేచురల్ గ్యాస్ పైప్‌లైన్ ప్రాజెక్టు చేపడతామని పుతిన్ వెల్లడించారు. రష్యాకే మొదటి ప్రాధాన్యం ► ఇతర దేశాలతో సంబంధాలను పణంగా పెట్టయినా సరే రష్యాతో బంధాన్ని కాపాడుకోవాలని చైనా పట్టుదలతో ఉన్నట్లు అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. ► అమెరికా వ్యతిరేకతే ఏకైక అజెండాగా రెండు దేశాలు ఒక్కటయ్యాయని అభిప్రాయపడుతున్నారు. ఉక్రెయిన్‌కు నాటో దేశాలు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. ► ఆర్థిక, ఆయుధ సాయం అందిస్తున్నాయి. ఉక్రెయిన్–రష్యా యుద్దం మొదలయ్యాక జిన్‌పింగ్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ► యుద్ధాన్ని ఏనాడూ ఖండించలేదు. ► రష్యాకే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తన వైఖరి ద్వారా తేల్చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పుతిన్‌తో దోవల్ భేటీ
న్యూఢిల్లీ: రష్యా పర్యటనలో ఉన్న భారత జాతీయ భద్రతా సలహాదారు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ అయ్యారు. గురువారం మాస్కోలో ఈ భేటీ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఇకమీదటా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు మాస్కోలోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. అఫ్గానిస్తాన్ అంశంపై పలు దేశాల అత్యున్నత స్థాయి ప్రతినిధులతో పుతిన్ భేటీ అవుతున్నారు. అందులోభాగంగా గురువారం ఐదవ జాతీయ భద్రతా మండలి/సలహాదారుల సమావేశంలో దోవల్, పుతిన్ మాట్లాడుకున్నారని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ తెలిపింది. ‘అఫ్గానిస్తాన్‌లో అనిశ్చితిని అవకాశంగా తీసుకుని కొన్ని ప్రాంతీయేతర శక్తులు అక్కడ మరింతగా విస్తరించేందుకు కుట్ర పన్నుతున్నాయి. అక్కడ పరిస్థితి ఏమంత బాగోలేదు. మానవతాసాయం మరింతగా తగ్గిపోతోంది’ అని పుతిన్ అన్నారు. ‘ అఫ్గాన్ గడ్డ నుంచి ఉగ్రవాదాన్ని మరింతగా ఎగదోసే చర్యలను భారత్ ఏమాత్రం ఉపేక్షించదు. అఫ్గాన్ ప్రజలను కష్టాల్లో వదిలేయబోము’ అని దోవల్ అన్నారు. -
సౌదీ కింగ్‌కు వింత అనుభవం
మాస్కో : సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజిజ్ బంగారపు ఎస్కలేటర్ ఒక్కసారిగా ఆగిపోయింది. చారిత్రక రాష్ట్ర మాస్కోను సందర్శించడానికి వెళ్లిన ఆయన తన జెట్ విమానంలో నుంచి ఎస్కలేటర్‌పై దిగుతుండగా అది పనిచేయకుండా పోయింది. ఏమైందోనని ఒక్కసారిగా షాకైన సౌదీ రాజు చేసేది ఏమీ లేక, మెల్లమెల్లగా నడుచుకుంటూ ఎస్కలేటర్ దిగిపోయారు. సౌదీ రాజు నడుచుకుంటూ ఎస్కలేటర్ దిగుతున్న వీడియో ఆన్లైన్లో హల్ చల్ చేస్తోంది. దీనిపై ట్విట్టరియన్లు ఫుల్‌గా జోక్స్ పేలుతున్నారు. నిరుపేద వ్యక్తి నడవాల్సి వచ్చింది అంటూ ఓ ట్విట్టరియన్ జోక్ చేశాడు. ''సౌదీ రాజు రష్యాలోకి చేరుకున్నారు. ఆయన మొదటిసారిగా చూసింది ఎస్కలేటర్ ఆగిపోవడమే, నిజంగా ఇది రాయల్ రిసెప్షన్'' అని మరో ట్విట్టరియన్ అన్నారు. నాలుగు రోజుల పర్యటన నేపథ్యంలో సౌదీ కింగ్ రష్యా వెళ్లారు. ఆయన పర్యటన సందర్భంలో రెండు లగ్జరీ హోటల్స్‌ను ప్రభుత్వం బుక్ చేసింది. ఈ పర్యటనలో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, సౌదీ రాజు పలు ఒప్పందాలు చేసుకోనున్నారు. -
'రష్యా మాకు చిరకాల మిత్రురాలు'
న్యూఢిల్లీ: రష్యా పర్యటనపట్ల తానెంతో ఆశావాహంతో ఉన్నానని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఈ పర్యటన ఎంతో ముఖ్యమైనదని చెప్పారు. సావత్సరిక చర్చల్లో భాగంగా రెండు రోజులపాటు ప్రధాని మోదీ రష్యాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ తో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ బుధవారం ఒక ప్రకటన చేశారు. ఈ ప్రకటనలో 'నేను ఈ రోజు రష్యా పర్యటనను ప్రారంభిస్తున్నాను. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన తర్వాత ద్వైపాక్షిక సంబంధాల చర్చ నిమిత్తం చేస్తున్న తొలి రష్యా పర్యటన. ఈ పర్యటనపట్ల నేనేంతో ఆశావాహంతో ఉన్నాను. భారత్-రష్యా మధ్య సంబంధాలు ఎంత గొప్పవో చరిత్ర చెబుతుంది. ప్రపంచంలోనే రష్యా భారత్ కు కీలక మిత్రురాలు. ఈ సందర్భంగా నా ఆలోచన ఓసారి 2001లోకి వెళ్లింది. నాడు నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోగానే నాడు అటల్ బిహారీ వాజపేయితోపాటు రష్యాకు వెళ్లాను. మళ్లీ ఇప్పుడు. నా పర్యటనతో భారత్-రష్యా మధ్య ఆర్థిక, శక్తి, రక్షణ సంబంధమైన అంశాలు ప్రధానంగా ఒప్పందాలు చేసుకోవడంతోపాటు సాంకేతిక పరిజ్ఞానం, మైనింగ్ ఇతర రంగాల్లో పరస్పర సహకారం కొనసాగుతుంది. వ్యాపార ఒప్పందాలు కూడా చేసుకుంటాం. వీటి ద్వారా మాకే కాకుండా మొత్తం ప్రపంచానికి కూడా మేలు జరుగుతుంది. రష్యా వ్యాపార వేత్తలతో కూడా సమావేశం ఉంటుంది. వారిని భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానిస్తాం' అని మోదీ తన ప్రకటనలో తెలిపారు. -
8 రోజుల విదేశీ పర్యటనకు మోదీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ఆసియా దేశాల పర్యటనకు బయల్దేరి వెళ్లారు. 8 రోజుల పర్యటనలో భాగంగా మోదీ ఐదు మధ్య ఆసియా దేశాలతో పాటు రష్యాకు వెళతారు. సోమవారం ఉదయం ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మోదీ తొలుత ఉజ్బెకిస్థాన్‌కు బయల్దేరివెళ్లారు. ఆ తర్వాత కజకిస్థాన్‌కు వెళతారు. జూలై 6-8 మధ్యన మోదీ ఈ రెండు దేశాల్లో పర్యటిస్తారు. ఆ తర్వాత 8-10 తేదీల మధ్యన రష్యాలో జరిగే బ్రిక్స్, ఎస్సీఓ సదస్సుల్లో పాల్గొంటారు. జూలై 10-13 మధ్యన తుర్కెమినిస్థాన్, కిర్గిస్థాన్, తజికిస్థాన్ దేశాల్లో పర్యటిస్తారు. వాణిజ్యం, ఇంధనం, ఉగ్రవాద నిర్మూలన, పరస్పర సహాకరం వంటి విషయాలపై మోదీ కీలక ఒప్పందాలు చేసుకోనున్నారు. -
రష్యా చేరుకున్న మన్మోహన్ సింగ్
భారత ప్రధాని మన్మోహన్ సింగ్ రెండు దేశాల పర్యటనలో భాగంగా రష్యా చేరుకున్నారు. ఆదివారం ప్రత్యేక విమానంలో మాస్కో విచ్చేశారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల గురించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మన్మోహన్ చర్చించనున్నారు. సైనిక, అణు ఇంధనం, శాస్త్ర సాంకేతిక, రసాయనిక, వాణిజ్య, పెట్టుబడి రంగాల్లో ఇరు దేశాల మధ్య బలమైన సంబంధాలున్నాయని మాస్కో బయల్దేరేముందు ఢిల్లీలో ప్రధాని వ్యాఖ్యానించారు. రష్యాలో పలు కార్యక్రమాల్లో పాల్గొనున్న మన్మోహన్ అక్కడి నుంచి చైనా పర్యటనకు వెళతారు. ఆ దేశంతో సరిహద్దు సమస్యల గురించి చర్చిస్తారు.