రష్యాలో మోదీ పర్యటన | PM Narendra Modi To Meet Russian President Putin In Moscow On 1 July 2024 | Sakshi
Sakshi News home page

రష్యాలో మోదీ పర్యటన

Published Mon, Jul 8 2024 5:15 AM | Last Updated on Mon, Jul 8 2024 5:15 AM

PM Narendra Modi To Meet Russian President Putin In Moscow On 1 July 2024

ఇండో–రష్యా శిఖరాగ్రంలో పాల్గొననున్న ప్రధాని.. పుతిన్‌తో విస్తృతస్థాయి చర్చలు

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం నుంచి రెండు రోజుల పాటు రష్యాలో పర్యటించనున్నారు. 22వ ఇండో–రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. పలు రంగాల్లో విస్తృతస్థాయి సహకారంపై వారు చర్చిస్తారు. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు దిగాక మోదీ రష్యాలో పర్యటించడం ఇదే తొలిసారి. 

మూడేళ్ల విరామం తర్వాత భారత్‌–రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు జరుగుతున్న నేపథ్యంలో ఈ సమిట్‌లో చర్చించబోయే అంశాలు, తీసుకోబోయే ఉమ్మడి నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

 చివరిసారిగా 2021 డిసెంబర్‌లో ఢిల్లీలో ఈ సదస్సు జరిగింది. సోమవారం మధ్యాహ్నం రష్యాకు మోదీ చేరుకున్నాక పుతిన్‌ ఇచ్చే ప్రత్యేక విందు కార్యక్రమానికి మోదీ హాజరుకానున్నారు. తర్వాత శిఖరాగ్ర సదస్సు జరగనుంది. మరుసటి రోజు రష్యాలోని భారతీయసంతతి వ్యక్తులతో మోదీ మాట్లాడతారు. తర్వాత క్లెమ్లిన్‌లో అనామక సైనికుల స్మారకం వద్ద అంజలి ఘటిస్తారు. తర్వాత మాస్కోలో ఎగ్జిబిషన్‌ను సందర్శిస్తారు.

ఆస్ట్రియాలోనూ పర్యటన
రష్యా పర్యటన తర్వాత 9వ తేదీన మోదీ ఆస్ట్రియాకు వెళ్తారు. ఆస్ట్రియా అధ్యక్షుడు అలెగ్జాండర్‌ వాన్‌ డీర్‌ బెల్లాన్, చాన్స్‌లర్‌ కార్ల్‌ నెహామెర్‌లతో విడివిడిగా ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ‘ఆస్ట్రియా, భారత్‌ మైత్రీబంధానికి 75 ఏళ్లు పూర్తవుతున్న వేళ మోదీతో చర్చల కోసం సిద్ధంగా ఉన్నా’ అని నెహామెర్‌ శనివారం ‘ఎక్స్‌’లో చేసిన పోస్ట్‌కు మోదీ ఆదివారం స్పందించారు. 

 ‘‘ ఇరు దేశాల మధ్య బంధాన్ని మరింత పటిష్టం చేసేందుకు, సహకారంలో కొత్త పథాలను అన్వేషించేందుకు మీతో చర్చల కోసం ఎదురుచూస్తున్నా’’ అని మోదీ ఆదివారం ‘ఎక్స్‌’లో ఒక పోస్ట్‌పెట్టారు. భారత ప్రధాని ఒకరు ఆస్ట్రియాలో పర్యటిస్తుండటం గత 40 ఏళ్లలో ఇదే తొలిసారికావడం విశేషం. భారత్, ఆస్ట్రియాకు చెందిన పారిశ్రామిక దిగ్గజాలతో మోదీ భేటీ కొనసాగుతుంది. మాస్కోతోపాటు వియన్నాలోని భారతీయ సంతతి ప్రజలతో ప్రధాని ముచ్చటించనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement