'రష్యా మాకు చిరకాల మిత్రురాలు'
న్యూఢిల్లీ: రష్యా పర్యటనపట్ల తానెంతో ఆశావాహంతో ఉన్నానని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఈ పర్యటన ఎంతో ముఖ్యమైనదని చెప్పారు. సావత్సరిక చర్చల్లో భాగంగా రెండు రోజులపాటు ప్రధాని మోదీ రష్యాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ తో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ బుధవారం ఒక ప్రకటన చేశారు. ఈ ప్రకటనలో 'నేను ఈ రోజు రష్యా పర్యటనను ప్రారంభిస్తున్నాను. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన తర్వాత ద్వైపాక్షిక సంబంధాల చర్చ నిమిత్తం చేస్తున్న తొలి రష్యా పర్యటన.
ఈ పర్యటనపట్ల నేనేంతో ఆశావాహంతో ఉన్నాను. భారత్-రష్యా మధ్య సంబంధాలు ఎంత గొప్పవో చరిత్ర చెబుతుంది. ప్రపంచంలోనే రష్యా భారత్ కు కీలక మిత్రురాలు. ఈ సందర్భంగా నా ఆలోచన ఓసారి 2001లోకి వెళ్లింది. నాడు నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోగానే నాడు అటల్ బిహారీ వాజపేయితోపాటు రష్యాకు వెళ్లాను. మళ్లీ ఇప్పుడు. నా పర్యటనతో భారత్-రష్యా మధ్య ఆర్థిక, శక్తి, రక్షణ సంబంధమైన అంశాలు ప్రధానంగా ఒప్పందాలు చేసుకోవడంతోపాటు సాంకేతిక పరిజ్ఞానం, మైనింగ్ ఇతర రంగాల్లో పరస్పర సహకారం కొనసాగుతుంది. వ్యాపార ఒప్పందాలు కూడా చేసుకుంటాం. వీటి ద్వారా మాకే కాకుండా మొత్తం ప్రపంచానికి కూడా మేలు జరుగుతుంది. రష్యా వ్యాపార వేత్తలతో కూడా సమావేశం ఉంటుంది. వారిని భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానిస్తాం' అని మోదీ తన ప్రకటనలో తెలిపారు.