దేశాధినేతల స్నేహ రహస్యం ఏమిటి? | Merchandise trade between Russia and India | Sakshi
Sakshi News home page

దేశాధినేతల స్నేహ రహస్యం ఏమిటి?

Published Sat, Jul 13 2024 4:17 AM | Last Updated on Sat, Jul 13 2024 9:58 AM

Merchandise trade between Russia and India

ఇటీవలి కాలంలో రష్యా–భారత దేశాల మధ్య సరుకుల వర్తకం 65 బిలియన్ల డాలర్ల మేర జరిగిందని తేలింది. ‘వర్తకం’ అంటే తెలుసు కదా? ఈ దేశం, ఆ దేశానికీ; ఆ దేశం, ఈ దేశానికీ సరుకులు అమ్మడమూ, కొనడమూ! రెండు దేశాల మధ్యా వర్తకం అన్నప్పుడు, యంత్రాలూ, ముడి ఆయిలూ, మరీ ముఖ్యంగా మారణాయుధాలూ, ఎన్నో! ముఖ్యంగా రష్యా నించి యుద్ధ సామగ్రిని భారత ప్రభుత్వం, పెద్ద ఎత్తున కొన్నది. ఇంతకీ, ఈ దేశాధినేతలు చేసేది ఏమిటి? రెండు దేశాల పెట్టుబడిదారీ వర్గాల తరఫున ప్రతినిధులుగా వ్యవహరించడమే! అంటే, సరుకుల్ని అమ్ముకోడానికీ, కొనుక్కోడానికీ, దేశాధినేతలు స్నేహాలు ప్రకటిస్తూ, ఒకరిని ఒకరు ఆకాశానికి ఎత్తేసుకుంటారు!

నిన్నగాక మొన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా వెళ్ళినప్పుడు, రష్యా ప్రెసిడెంటు పుతిన్‌ అన్న మాటలు ఇవి: ‘‘నా ప్రియాతి ప్రియమైన స్నేహితుణ్ణి కలిసినందుకు ఎంతో సంతోషంగా వుంది.’’‘‘ఇచ్చానమ్మా వాయినం, పుచ్చుకున్నానమ్మా వాయినం’’ అన్నట్టు, పుతిన్‌ గురించి మోదీ కూడా ఏదో అనాలి కదా? ఆ మాటలు ఇవి: ‘‘నా ప్రియమిత్రుడు పుతిన్, రష్యా–భారత్‌ల మధ్య స్నేహాన్ని శిఖరాగ్రాలకు తీసికెళ్ళాడు’’అని!  ఇద్దరూ కలవగానే భారత ప్రధాని, తన ప్రత్యేకమైన అలవాటు ప్రకారం, ఆ ప్రియ మిత్రుణ్ణి ‘ఆత్మీయ ఆలింగనం’ చేసుకున్న దృశ్యాలు అందరూ చూసే వుంటారు. 

అంతేనా? పుతిన్, మోదీని, తన గుర్రపు శాలకి తీసికెళ్ళడం, అక్కడ వాళ్ళిద్దరూ చెరో గుర్రానికీ ఏదో తినిపిస్తూ, ముద్దు చెయ్యడం! ఇంతేనా! బుజ్జి కారులో మోదీని ఎక్కించుకుని, పుతినే ఆ బుజ్జిని స్వయంగా నడుపుతూ, తన పెద్ద ఎస్టేట్‌లో విలాసంగా తిప్పడం! ఆ ప్రియ స్నేహితులిద్దరికీ అంతా సరదాగా జరిగిపోయింది. ఈ రెండు దేశాల అగ్రనేతలూ ఎందుకు కలిశారంటారు? ఇటీవలి కాలంలో రష్యా–భారత దేశాల మధ్య సరుకుల వర్తకం 65 బిలియన్ల డాలర్లది (సుమారు 542 లక్షల కోట్ల రూపాయలది) జరిగిందని తేలింది. 

‘వర్తకం’ అంటే తెలుసు కదా? ఈ దేశం, ఆ దేశానికీ; ఆ దేశం, ఈ దేశానికీ సరుకులు అమ్మడమూ, కొనడమూ! ఈ భారీ వర్తకం వల్ల వచ్చిన మొత్తంలో, భారత దేశానికి వచ్చింది, దాదాపు 20 శాతమేనట! రష్యాకి 80 శాతం! రెండు దేశాల మధ్యా వర్తకం అన్నప్పుడు, యంత్రాలూ, ముడి ఆయిలూ, మరీ ముఖ్యంగా మారణాయుధాలూ, ఎన్నో! ముఖ్యంగా రష్యా నించి యుద్ధ సామగ్రిని భారత ప్రభుత్వం, పెద్ద ఎత్తున కొన్నది. 

రెండు దేశాల అధినేతలు కలిసినప్పుడు, ఏమేమి మాట్లాడుకునేదీ, ఏ రకం ఒప్పందాలు చేసుకునేదీ, అన్నీ క్షుణ్ణంగా అంతకు ముందే, రెండు దేశాల మంత్రులూ, అధికారులూ, సిద్ధం చేసి వుంచుతారు. మోదీకి ఎర్ర తివాచీలూ, సైనిక వందనాలూ, విందు భోజనాలూ, వగైరాలు అయ్యాక, దేశాధినేతలు సరుకుల గురించి అధికారికంగా, లాంఛనంగా, కాసేపు ముచ్చటించుకుంటారు.వర్తకంలో, ఎగుమతులుగా, దిగుమతులుగా, ఇటూ అటూ తిరిగిన ఆ సరుకుల తయారీదారులు, ఆ రెండు దేశాల కార్మికులే! కార్మికుల యజమానులు, ఆ దేశాల పెట్టుబడిదారులు! కొన్ని సరుకులు ప్రభుత్వ రంగ సంస్థలలో తయారైనవైతే, ప్రభుత్వాలు కూడా పెట్టుబడిదారులే!

ఇంతకీ, ఈ దేశాధినేతలు చేసేది ఏమిటి? రెండు దేశాల పెట్టుబడిదారీ వర్గాల తరఫున ప్రతినిధులుగా వ్యవహరించడమే! ‘కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక’ అనే 1848 నాటి రచనలో, మార్క్స్, ఎంగెల్సులు చెప్పినట్టు: ‘‘ఆధునిక రాజ్యంలో, ప్రభుత్వం (ఎగ్జిక్యూటివ్‌) అనేది, మొత్తం బూర్జువా వర్గపు సమష్టి వ్యవహారాలను చక్కబెట్టే కమిటీ మాత్రమే!’’ మైకెల్‌ పెరెంటీ అనే ఒక అమెరికన్‌ రాజకీయ శాస్త్రవేత్త అయితే, మార్క్స్, ఎంగెల్సులకన్నా ఒక అడుగు ముందుకు వేసి, అనేక ఆధారాలు చూపుతూ, ‘‘కొద్దిమందికే ప్రజాస్వామ్యం’’ అనే తన పుస్తకంలో, ‘ప్రెసిడెంట్‌’ అనే దేశాధినేత గురించి, మామూలు మాటల్లో చెప్పాలంటే, ‘సరుకులు అమ్మేవాడు’ (‘‘సేల్సుమాన్‌ ఆఫ్‌ ది సిస్టం’’) అంటాడు!

అంటే, సరుకుల్ని అమ్ముకోడానికీ, కొనుక్కోడానికీ, దేశాధినేతలు స్నేహాలు ప్రకటిస్తూ, ఒకరిని ఒకరు ఆకాశానికి ఎత్తేసుకుంటారు! తమ దేశాల్లో వున్న అత్యున్నత బిరుదుల్ని ఒకరికి ఒకరు ఇచ్చుకోవడం కూడా! అదే జరిగింది నిన్న! పాతకాలపు రష్యాలో, ‘సనాతన చర్చి’ని (‘ఆర్తొడాక్స్‌ చర్చ్‌’) స్థాపించిన మత బోధకుడైన ‘సెయింటు ఆండ్రూ’ పేరుతో వున్న ‘అత్యున్నత బిరుదు’గా ఆ దేశం కీర్తించే బిరుదుని మోదీకి, పుతిన్‌ ఇచ్చి సత్కరించాడు. ఈ బిరుదుని జారు చక్రవర్తి 1698లో ప్రవేశ పెట్టాడు. దీనిని 1917లో, కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన విప్లవం జరిగాక, 1918లో రద్దు చేశారు. 1998లో, ‘ఎల్త్‌సిన్‌’ అనే మాజీ కామ్రేడు తిరిగి దానిని ప్రవేశపెట్టాడు. ఈ కామ్రేడే 1991లో ‘సోవియట్‌ కమ్యూనిస్టు పార్టీ’ని రద్దు చేసినవాడు! అదే సంవత్సరం సోవియట్‌ యూనియన్‌ని కూడా రద్దు చేశాడు!

భారతదేశపు సనాతన మతాభిమానుల్లో అగ్రగణ్యుడైన వ్యక్తికి, ఆ దేశ సనాతన మత బోధకుడి పేరన వున్న బిరుదు దొరికింది! ఎంత సముచిత సత్కారం! మోదీ రష్యా పర్యటనలో, కొసమెరుపు అనదగ్గ సంగతి ఒకటి వుంది. ఉక్రెయిన్‌ దేశ అధ్యక్షుడు జెలెనిస్కీ, మోదీ రష్యాలో పర్యటించడాన్ని ఇలా తప్పుపట్టాడు: ‘‘ప్రపంచంలో పెద్ద ప్రజాస్వామ్యపు దేశాధినేత, మాస్కోలో, రక్త పిపాసిని (పుతిన్‌ని) కావలించుకోవడం నిరాశాజనకం’’ అని! ఈ జెలెనిస్కీని కూడా, ఈ మోదీయే, నిన్న పుతిన్‌ని కావిలించుకున్నట్టే, మొన్న, అంటే, ఆ మధ్య, ఇటలీలో గట్టిగా కావిలించుకున్నాడు! ఈ కావిలింతలు మోదీకి రాజకీయ వెన్నతో పెట్టిన విద్య!

ఉక్రెయిన్‌లో పిల్లల ఆసుపత్రి మీద రష్యా బాంబులు పడి, అనేక మంది చచ్చిపోయిన కొన్ని గంటల తర్వాత, మోదీ రష్యానేల మీద అడుగు పెట్టాడు. ఆ వార్త విమానం దిగుతూ విన్నాడేమో! తర్వాత, మొక్కుబడిగా పుతిన్‌తో అన్నమాటలు: ‘‘యుద్ధం పరిష్కారం కాదు. మానవుల ప్రాణాలు అమూల్యం, అమాయక పిల్లల మరణాలు చూస్తే, హృదయం ద్రవిస్తుంది!’’ అబ్బా! ఎంత సున్నిత హృదయం! ఈ మాటలు మోదీ అంటున్నప్పుడు, పుతిన్‌ బెల్లం కొట్టిన రాయిలాగా ముభావంగా వుండిపోయాడు! ‘ఈ రకం మొక్కుబడి మాటలు అన్ని దేశాల అధినేతలకీ మామూలేలే’ అన్నట్టు!

మరి, ఏ సమస్యకీ యుద్ధం పరిష్కారం కాదని, మోదీ భావించినప్పుడు, రష్యా నించీ, అమెరికా నించీ, ఫ్రాన్స్ నించీ, ఇజ్రాయిల్‌ నించీ కుప్పలు కుప్పలుగా, లక్షల కోట్ల ఖర్చుతో మారణాయుధాలు ఎందుకు కొన్నట్టు? పైగా, ఉక్రెయిన్‌ మీద రష్యా దాడిని ఖండిస్తూ, ఐక్య రాజ్య సమితిలో కొన్ని దేశాలు తీర్మానాలు చేసినప్పుడు, మోదీ ప్రభుత్వం ఓటింగులో పాల్గొననే లేదు! దీన్ని ఏమనాలి? ‘యుద్ధం వద్దు! అది పరిష్కారం కాదు!’ అనే నీతి వచనాలా! దురాక్రమణ యుద్ధం చేస్తున్న దేశపు ప్రభుత్వం ఇచ్చే ఆ దేశపు ‘అత్యున్నత’ బిరుదుని మోదీ, ఏ శాంతి నీతితో తీసుకున్నట్టు? ఈ రెండు దేశాధినేతల స్నేహ రహస్యం తెలిసిందా? 

- వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి
- రంగనాయకమ్మ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement