భారత ప్రధాని మోదీతో సంభాషణ చాలా ఇష్టం
ఆయన నాకు మంచి మిత్రుడు: రష్యా అధ్యక్షుడు పుతిన్
మాస్కో: భారత్, రష్యా మధ్య దశాబ్దాలుగా స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయి. భారత ప్రధానమంత్రులు ఎవరైనా సరే రష్యాతో అనుబంధానికి అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు. రష్యా అధినేతలు సైతం అదే రీతిలో స్పందిస్తుంటారు. ప్రస్తుత అధ్యక్షుడు పుతిన్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో తన స్నేహం, అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. మోదీతో చక్కటి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ప్రపంచదేశాల అధినేతల్లో తనకున్న కొద్ది మంది మిత్రుల్లో మోదీ కూడా ఒకరని అన్నారు.
పుతిన్ తాజాగా మీడియా ప్రతినిధుల వార్షిక సమావేశంలో మాట్లాడారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన విషయం బయటపెట్టారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో తేనీరు సేవిస్తూ ఏ దేశ అధినేతతో సంభాషించాలని మీరు కోరుకుంటారు? అని ప్రశ్నించగా, భారత ప్రధాని మోదీతోపాటు జర్మనీ మాజీ చాన్స్‌లర్ హెల్ముత్ కోల్, ఫ్రాన్స్ అధ్యక్షుడు జాక్విస్ చిరక్, ఇటలీ మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోనీ, చైనా అధినేత షీ జిన్‌పింగ్‌తో మాట్లాడడం ఇష్టమని, వారంతా తనకు మంచి స్నేహితులని స్పష్టంచేశారు. కుదిరితే వారితో టీ సేవిస్తూ సంభాషించడానికి ఇష్టపడతానని వెల్లడించారు.
బ్రెజిల్, చైనా, దక్షిణాఫ్రికా, రష్యా, ఇండియాతో కూడిన ‘బ్రిక్స్’ కూటమి పశ్చిమ దేశాలకు వ్యతిరేకం కాదని పుతిన్ తేల్చిచెప్పారు. తమ కూటమి దేశాల ప్రయోజనాల కోసం తప్ప ఇతర దేశాలకు వ్యతిరేకంగా తాము పనిచేయడం లేదని వివరించారు. ఇదిలా ఉండగా, పుతిన్ వచ్చే ఏడాది మొదట్లో భారత్‌లో పర్యటించబోతున్నారు. ప్రతిఏటా కనీసం ఒక్కసారైనా భేటీ కావాలని పుతిన్, మోదీ ఇప్పటికే నిర్ణయించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment