రష్యన్లనుద్దేశించి ప్రసంగిస్తున్న పుతిన్
ఉక్రెయిన్‌కు అండగా సైన్యాలను పంపించొద్దు
పశ్చిమ దేశాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరిక
మాస్కో: ఉక్రెయిన్‌లోని లక్ష్యాలను సాధించే వరకు తమ యుద్ధం కొనసాగుతుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ కుండబద్దలు కొట్టారు. ఉక్రెయిన్‌కు అండగా సైన్యాలను పంపించడం ద్వారా మరింత లోతుగా జోక్యం చేసుకోవాలని చూస్తే అణు యుద్ధం తప్పదని పశ్చిమ దేశాలను ఆయన హెచ్చరించారు. వచ్చే నెల్లో దేశాధ్యక్ష పదవికి జరగనున్న ఎన్నికల్లో పుతిన్ విజయం ఇప్పటికే ఖరారైంది.
ఎన్నికలను పురస్కరించుకుని గురువారం ఆయన దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. యుద్ధంలో పుతిన్ విజయం యూరప్‌లో తీవ్ర విపరిణామాలకు దారి తీస్తుందని, దీనిని నివారించేందుకు నాటో దేశాలు ఉక్రెయిన్‌లోకి ప్రత్యక్షంగా బలగాలను పంపించే అవకాశాలు సైతం ఉన్నాయంటూ ఫ్రాన్సు అధ్యక్షుడు మాక్రాన్ ఇటీవల చేసిన హెచ్చరికలపై ఆయన పైవిధంగా స్పందించినట్లుగా పరిశీలకులు భావిస్తున్నారు. ‘గతంలో మన దేశంలోకి సైన్యాన్ని పంపించిన వారికి ఎలాంటి గతి పట్టిందో మనకు తెలుసు.
మళ్లీ అటువంటిదే జరిగితే ఈసారి పరిణామాలు మరింత దారుణంగా ఉంటాయి. మన వద్ద కూడా పశ్చిమదేశాల్లోని లక్ష్యాలను చేరగల ఆయుధాలున్న సంగతిని వాళ్లు గుర్తుంచుకోవాలి. ఆ దేశాలు చేస్తున్న ప్రకటనలు ప్రపంచాన్ని భయపెడు తున్నట్లుగా అగుపిస్తోంది. ఇవన్నీ నిజమైన అణు సంఘర్షణ ముప్పును మరింతగా పెంచుతున్నాయి. దానర్థం మానవ నాగరికత విధ్వంసం.
యుద్ధంతో ఎదురయ్యే పెను సవాళ్లు, అణు యుద్ధం తాలూకూ పరిణామాలు వాళ్లకు అర్థం కావా?’అని పుతిన్ ప్రశ్నించారు. ‘దేశం పూర్తిస్థాయి అణు యుద్ధ సన్నద్ధతతో ఉంది. ఎంతో శక్తివంతమైన నూతన ఆయుధాలను సైన్యం మోహరించింది.
వాటిలో కొన్నిటిని ఇప్పటికే ఉక్రెయిన్ యుద్ధక్షేత్రంలో ప్రయోగించి చూసింది’ అని చెబుతూ ఆయన శక్తివంతమైన బురెవెస్ట్‌నిక్ అణు క్రూయిజ్ క్షిపణి వంటి వాటిని ఈ సందర్భంగా ప్రస్తావించారు. నాటో దేశాలపై రష్యా దాడి చేసే ప్రమాదముందంటూ పశ్చిమదేశాలు చేస్తున్న ప్రకటనలను భ్రమలుగా అధ్యక్షుడు పుతిన్ కొట్టిపారేశారు. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పైకి భారీగా సైన్యాన్ని పంపించినప్పటి నుంచి పుతిన్ అణు ముప్పుపై పశ్చిమ దేశాలను పలుమార్లు హెచ్చరించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment