కీవ్: ఉక్రెయిన్‌కు అమెరికా విధ్వంసకర క్లస్టర్ బాంబులను సరఫరా చేయడంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పందించారు. తమ వద్ద కూడా క్లస్టర్ బాంబుల నిల్వలు దండిగా ఉన్నాయని ప్రకటించారు. ఈ వివాదాస్పద ఆయుధాలను ఉక్రెయిన్ వాడిన పక్షంలో తగు రీతిలో స్పందించే హక్కు తమకుందని హెచ్చరించారు. ‘మా వద్ద క్లస్టర్ బాంబులు ఉన్నప్పటికీ ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో ఇప్పటి వరకు వాటిని వాడలేదు. అటువంటి అవసరం కూడా మాకు రాలేదు’ అని చెప్పారు. రష్యా, ఉక్రెయిన్ ఇప్పటికే క్లస్టర్ బాంబులను వాడినట్లుగా పలు ఆధారాలను అసోసియేటెడ్ ప్రెస్, అంతర్జాతీయ మానవతావాద సంస్థలు చూపుతున్నాయి.
రష్యాపై ఉక్రెయిన్ ఎదురుదాడి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో, యుద్ధక్షేత్రంలో రష్యా ఆర్మీపై ఉక్రెయిన్ పైచేయి సాధించాలంటే విధ్వంసకర క్లస్టర్ బాంబులే మార్గమని అమెరికా అంచనా వేస్తోంది. క్లస్టర్ బాంబుల సరఫరాపై నెలలపాటు అమెరికా మల్లగుల్లాలు పడింది. ఉక్రెయిన్‌కు వీటిని అందజేయాలన్న నిర్ణయానికే అధ్యక్షుడు బైడెన్ చివరికి మొగ్గు చూపారు. ప్రమాదకరమైనవిగా భావించే క్లస్టర్ బాంబులను చివరిసారిగా అమెరికా 2003లో ఇరాక్ యుద్ధంలో వాడినట్లు చెబుతోంది. ప్రస్తుతం ఆ దేశం వద్ద 30 లక్షల క్టస్టర్ ఆయుధ నిల్వలున్నాయి. డొనెట్‌స్క్, ఖెర్సన్ ప్రాంతాలే లక్ష్యంగా గత 24 గంటల్లో రష్యా రెండు షహీద్ డ్రోన్లను, రెండు క్రూయిజ్ మిస్సైళ్లను, రెండు యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ మిస్సైళ్లతోపాటు 40 వైమానిక దాడులు, 46 రాకెట్ దాడులు జరిపిందని ఉక్రెయిన్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment