Cluster bombs
-
మా దగ్గరా బోలెడు క్లస్టర్ బాంబులు
కీవ్: ఉక్రెయిన్‌కు అమెరికా విధ్వంసకర క్లస్టర్ బాంబులను సరఫరా చేయడంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పందించారు. తమ వద్ద కూడా క్లస్టర్ బాంబుల నిల్వలు దండిగా ఉన్నాయని ప్రకటించారు. ఈ వివాదాస్పద ఆయుధాలను ఉక్రెయిన్ వాడిన పక్షంలో తగు రీతిలో స్పందించే హక్కు తమకుందని హెచ్చరించారు. ‘మా వద్ద క్లస్టర్ బాంబులు ఉన్నప్పటికీ ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో ఇప్పటి వరకు వాటిని వాడలేదు. అటువంటి అవసరం కూడా మాకు రాలేదు’ అని చెప్పారు. రష్యా, ఉక్రెయిన్ ఇప్పటికే క్లస్టర్ బాంబులను వాడినట్లుగా పలు ఆధారాలను అసోసియేటెడ్ ప్రెస్, అంతర్జాతీయ మానవతావాద సంస్థలు చూపుతున్నాయి. రష్యాపై ఉక్రెయిన్ ఎదురుదాడి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో, యుద్ధక్షేత్రంలో రష్యా ఆర్మీపై ఉక్రెయిన్ పైచేయి సాధించాలంటే విధ్వంసకర క్లస్టర్ బాంబులే మార్గమని అమెరికా అంచనా వేస్తోంది. క్లస్టర్ బాంబుల సరఫరాపై నెలలపాటు అమెరికా మల్లగుల్లాలు పడింది. ఉక్రెయిన్‌కు వీటిని అందజేయాలన్న నిర్ణయానికే అధ్యక్షుడు బైడెన్ చివరికి మొగ్గు చూపారు. ప్రమాదకరమైనవిగా భావించే క్లస్టర్ బాంబులను చివరిసారిగా అమెరికా 2003లో ఇరాక్ యుద్ధంలో వాడినట్లు చెబుతోంది. ప్రస్తుతం ఆ దేశం వద్ద 30 లక్షల క్టస్టర్ ఆయుధ నిల్వలున్నాయి. డొనెట్స్క్, ఖెర్సన్ ప్రాంతాలే లక్ష్యంగా గత 24 గంటల్లో రష్యా రెండు షహీద్ డ్రోన్లను, రెండు క్రూయిజ్ మిస్సైళ్లను, రెండు యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ మిస్సైళ్లతోపాటు 40 వైమానిక దాడులు, 46 రాకెట్ దాడులు జరిపిందని ఉక్రెయిన్ తెలిపింది. -
ఈ బాంబు ఒక్కటి వేస్తే.. 100 బాంబులు వేసినట్టే..
ఏదైనా బాంబును ప్రయోగిస్తే.. అది పడిన ప్రదేశంతోపాటు కొంతదూరం వరకు విధ్వంసం సృష్టిస్తుంది. అక్కడితో దాని పని అయిపోతుంది. అదే క్లస్టర్ బాంబును ప్రయోగిస్తే.. టార్గెట్ చేసిన ప్రదేశంతోపాటు చుట్టుపక్కల కొంత దూరం దాకా విధ్వంసం సృష్టిస్తుంది. అందులోని భాగాలు ఆ తర్వాత కూడా పేలుతూనే.. అక్కడికి వచ్చినవారి ప్రాణాలు తీస్తూనే ఉంటాయి. తాజాగా ఉక్రెయిన్‌కు అమెరికా క్లస్టర్ బాంబులను ఇవ్వడం, ప్రతిగా తమ వద్ద కూడా క్లస్టర్ బాంబులు ఉన్నాయని రష్యా హెచ్చరించడం నేపథ్యంలో.. క్లస్టర్ బాంబులు ఏమిటి? వాటితో ప్రమాదమేంటి? ఇప్పటివరకు ఎక్కడైనా ప్రయోగించారా? అన్న వివరాలు తెలుసుకుందామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ ఒకటి కాదు వందల బాంబులు కలిపి.. సాధారణంగా క్షిపణులు అయినా, ఇతర బాంబులు అయినా వాటిలో పేలిపోయే భాగం (వార్ హెడ్) ఒకటే ఉంటుంది. ఒకే ప్రదేశంలో పెద్ద పేలుడు సంభవిస్తుంది. అదే క్లస్టర్ బాంబులో వందలకొద్దీ చిన్న బాంబులు (బాంబ్లెట్లు) ఉంటాయి. దీనిని ప్రయోగించాక నిర్దేశించిన ప్రాంతానికి చేరుకోగానే విచ్చుకుని.. అందులోని చిన్న బాంబులన్నింటినీ కొంతదూరం వరకు వెదజల్లుతుంది. ఇలా ఎక్కువ విస్తీర్ణంలో పేలుళ్లు జరుగుతాయి. అంత విస్తీర్ణంలో విధ్వంసం జరుగుతుంది. మిలటరీ స్థావరాలు, వాహనాలు, ఆయుధాలు నాశనమవుతాయి. ఆ ప్రాంతంలో ఉండే సైన్యం, సాధారణ ప్రజలకూ ప్రమాదం కలుగుతుంది. అప్పుడే పేలక.. తర్వాత ప్రాణాలు తీస్తూ.. క్లస్టర్ బాంబులు వెదజల్లే బాంబ్లెట్లలో అన్నీ అప్పటికప్పుడే పేలిపోవు. వాటిలో కొన్ని నేలపై చెల్లాచెదురుగా పడిపోతాయి. కొన్నిసార్లు ఏళ్లకేళ్లు కూడా అలాగే ఉంటాయి. ఎప్పుడైనా సైనికులుగానీ, సాధారణ పౌరులుగానీ వాటిని తాకితే పేలిపోయి ప్రాణాలు తీస్తాయి. అంటే యుద్ధం ముగిసిపోయినా బాంబుల బాధ తప్పని పరిస్థితి. ♦ గతంలో వియత్నాం, లావోస్, ఇరాక్, అష్గానిస్తాన్ తదితర యుద్ధాల్లో అమెరికా ఈ కస్టర్ బాంబులను వినియోగించింది కూడా. వాటిలో పేలిపోకుండా ఉన్న బాంబులు ఇప్పటికీ తరచూ విస్ఫోటం చెందుతూ ప్రజలు ప్రాణాలను బలి తీసుకుంటూనే ఉన్నాయి. ♦ క్లస్టర్ బాంబులు భారీగా జన హననానికి దారి తీస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు వీటి వాడకాన్ని నిషేధిస్తూ ఒప్పందం చేసుకున్నాయి. అయితే ఆ ఒప్పందంపై అమెరికా, ఉక్రెయిన్, రష్యా సంతకం చేయకపోవడం గమనార్హం. ‘డడ్ రేటు’తో ఎఫెక్ట్ క్లస్టర్ బాంబు ప్రయోగించినప్పుడు పేలకుండా ఉండిపోయే బాంబ్లెట్ల శాతాన్ని ‘డడ్ రేటు’గా పిలుస్తారు. ఈ డడ్ రేటు ఎంత ఎక్కువగా ఉంటే.. భవిష్యత్తులో ప్రజలు వాటి బారినపడే ప్రమాదం అంత ఎక్కువగా ఉంటుంది. రష్యాకు చెందిన క్లస్టర్ బాంబుల డడ్ రేటు 4శాతం నుంచి 40 శాతం వరకు ఉంటుందని అంచనా. తాజాగా ఉక్రెయిన్‌కు ఇచ్చిన క్లస్టర్ బాంబుల డడ్ రేటు చాలా తక్కువగా 2.35 శాతమేనని అమెరికా అధికారులు ప్రకటించడం గమనార్హం. క్లస్టర్ బాంబుల ప్రత్యేకతలివీ.. ♦ క్లస్టర్ బాంబు బరువు సాధారణంగా 450 కిలోల నుంచి 500 కిలోల వరకు ఉంటుంది. అందులో ఒక్కోటీ ఏడెనిమిది అంగుళాల పొడవున్న 200 వరకు బాంబ్లెట్లు ఉంటాయి. ♦ క్లస్టర్ బాంబు నిర్దేశిత లక్ష్యానికి చేరువకాగానే.. అతి వేగంగా తిరగడం మొదలవుతుంది. తర్వాత దశలవారీగా బాంబ్లెట్లను విడుదల చేస్తుంది. దీనివల్ల బాంబ్లెట్లు దూరదూరంగా, వేగంగా పడిపోతాయి. ♦ క్లస్టర్ బాంబుల్లోని బాంబ్లెట్లకు కిందివైపు ఫ్యాన్ తరహా ప్రత్యేకమైన రెక్కలు, లేకుంటే చిన్నపాటి ప్యారాచూట్లను అమర్చుతారు. దీనితో అవి ఓ క్రమంలో నేలను తాకి పేలిపోతాయి. ♦ పేలిపోకుండా ఉండిపోయిన బాంబ్లెట్లను గుర్తించి నిర్విర్యం చేయడం కూడా ప్రమాదకరమైన పనే. ఎవరైనా తాకగానే పేలిపోయే అవకాశాలు ఎక్కువ. అందువల్ల బాంబ్ డిస్పోజల్ యూనిట్లు, రోబోలతో వాటిని గుర్తించి, నిర్విర్యం చేయాల్సి ఉంటుంది. 1 మిలటరీ వాహనం నుంచి క్లస్టర్ బాంబు ప్రయోగం 2 నిర్దేశిత లక్ష్యానికి సమీపంలో ఉండగా క్లస్టర్ బాంబు నుంచి బాంబ్లెట్లు విడుదల అవుతాయి. 3 చాలా వరకు బాంబ్లెట్లు నేలను తాకగానే పేలిపోతాయి. 4 కొంత మేర బాంబ్లెట్లు పేలిపోకుండా నేలపై పడి ఉంటాయి. వాటిని ఎవరైనా తాకితే వెంటనే పేలిపోయి విధ్వంసం సృష్టిస్తాయి. -
ఉక్రెయిన్ కు అమెరికా క్లస్టర్ బాంబులు
-
మా నిర్ణయంలో తప్పులేదు.. ఉక్రెయిన్‌కు సాయంపై బైడెన్
వాషింగ్టన్: రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఆయుధ నిల్వలుతరిగిపోయిన కారణంగా ఉక్రెయిన్ అమెరికాపై ఒత్తిడి తీసుకురావడంతో వారు ఉక్రెయిన్ దేశానికి క్లస్టర్ బాంబులను పంపించనున్నట్లు ప్రకటించింది. క్లస్టర్ బాంబులు తీవ్రస్థాయిలో ప్రాణనష్టం చేకూరుస్తాయని తెలిసి కూడా అమెరికా ఈ నిర్ణయం తీసుకోవడాన్ని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ సమర్ధించుకున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలై ఒకటిన్నర సంవత్సరం పూర్తి కావస్తోంది. ఇప్పటికే పెద్ద ఎత్తున ఆస్తి నష్టం, భారీ సంఖ్యలో ప్రాణనష్టం జరిగింది. ఇంకా జరుగుతూ ఉంది. సుదీర్ఘ కాలంగా యుద్ధం చేస్తోన్న నేపథ్యంలో ఉక్రెయిన్ వద్ద ఆయుధ నిల్వలు తగ్గిపోతూ ఉన్నాయి. అందుకే అగ్రరాజ్యాన్ని సాయం కోరుతూ ఉక్రెయిన్ అధ్యక్షులు వ్లాదిమిర్ జెలెన్స్కీ జో బైడెన్ పై ఒత్తిడి చేశారు. దీంతో చాలాకాలంగా వారి ఆయుధ కర్మాగారంలో నిల్వ ఉండిపోయిన క్లస్టర్ బాంబులను ఉక్రెయిన్‌కు పంపించాలన్న నిర్ణయానికి వచ్చింది అగ్ర రాజ్యం. ఈ నిర్ణయాన్ని పలు మానవ హక్కుల సంఘాలు, డెమొక్రాట్లు తప్పుబట్టిన కూడా జో బైడెన్ తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు. క్లస్టర్ బాంబుల తీవ్రత గురించి తెలుసు.. అందుకే ఇన్నాళ్లు వాటిని ఉక్రెయిన్‌కు పంపలేదు. కానీ ఇప్పుడు వారి వద్ద ఆయుధ నిల్వలు బాగా తగ్గిపోయాయి. ఈ సమయంలో వారిని అలా వదిలేయలేము. నాటో మిత్రదేశాలతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు. అమెరికా జాతీయ భద్రతా సలహాదారుడు జేక్ సుల్లివాన్ ఈ విషయంపై స్పందిస్తూ.. సాధారాణ ఆయుధాలతో పోలిస్తే ఈ క్లస్టర్ బాంబులు పెను విధ్వాంసాన్ని సృష్టిస్తాయి. వీటి కారణంగా భారీగా ప్రాణనష్టం జరిగినట్లు చరిత్ర చెబుతోంది. అందుకే వీటిని ఉక్రెయిన్‌కు పంపే విషయమై తీవ్ర జాప్యం చేశామని అన్నారు. ఆయుధాలు కొరవడిన సమయంలో మిత్రదేశాన్ని అలా వదిలేయకూడదని బాగా ఆలోచించే ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని తెలిపారు. క్లస్టర్ బాంబుల ప్రత్యేకత ఏంటి? ఒక క్లస్టర్ బాంబు అంటే అది అనేక బాంబుల సముదాయం. దాన్ని ఒక రాకెట్ ద్వారా గానీ ఫిరంగుల ద్వారా గానీ ఈ క్లస్టర్ బాంబును సంధిస్తే సుమారు 24-32 కిలోమీటర్ల దూరాన ఉన్న లక్ష్యాన్ని కూడా తునాతునకలు చేయవచ్చు. ఒక్కటే బాంబుగా రిలీజైన ఈ క్లస్టర్ గాల్లో చిన్న చిన్న బాంబులుగా విడిపోయి అక్కడక్కడా చెదురుముదురుగా పడి పేలతాయి. కాబట్టే వీటివలన భారీగా ప్రాణనష్టం కూడా వాటిల్లుతుంది. పైగా ఇవి నేల మీద పడిన వెంటనే విస్ఫోటం చెందవు. కొన్ని అప్పుడే పేలగా కొన్ని మాత్రం ఎప్పుడో పేలుతుంటాయి. అందుకే ఐక్యరాజ్యసమితి 2008లో ఈ క్లస్టర్ బాంబుల వాడకాన్ని నిషేధిస్తూ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. బ్రిటన్, ఫ్రాన్స్ సహా 120 దేశాలు వీటి వినియోగాన్ని నిషేధిస్తూ సంతకాలు కూడా చేశాయి. 2003లో ఇరాక్ పై చేసిన యుద్ధంలో అమెరికా ఈ క్లస్టర్ బాంబులనే అధికంగా ప్రయోగించింది. అటు తర్వాత అమెరికా వాటిని మళ్ళీ ఎక్కడా ఉపయోగించలేదు. అందుకే వారి వద్ద లక్షల సంఖ్యలో క్లస్టర్ బాంబుల నిల్వ ఉండిపోయింది. ప్రస్తుతం ఉక్రెయిన్‌కు సాయం చేస్తూ నిల్వలను తగ్గించుకుంటోందని అమెరికా చెబుతుంటే.. అందులో రష్యాపై గెలవాలన్న వారి కాంక్షే కనిపిస్తోందని అత్యధికులు అభిప్రాయపడుతున్నారు. ఇది కూడా చదవండి: బ్రెజిల్లో పేకమేడలా కూలిన భవనం, 8 మంది మృతి -
‘హాల్ ఆఫ్ షేమ్’ బ్యాంకుల్లో ఎస్బీఐ
క్లస్టర్ బాంబుల తయారీ కంపెనీలకు రుణం న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ‘హాల్ ఆఫ్ షేమ్’ బ్యాంకుల జాబితాలోకి భారత్ బ్యాంకింగ్ దిగ్గజం- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఎక్కింది. ఈ జాబితాలోకి ఎక్కిన ఏకైక భారత్ బ్యాంకు కేవలం ఎస్బీఐ కావడం గమనార్హం. క్లస్టర్ బాంబుల తయారీ కంపెనీలకు రుణాలను ఇచ్చినందుకుగానే ఈ ‘షేమ్’ జాబితాలో ఎస్బీఐ చేరింది. అంతర్జాతీయంగా క్లస్టర్ బాంబు తయారీ కంపెనీలకు బిలియన్ డాలర్ల రుణాలు ఇచ్చిన 158 బ్యాంకులు, ఆర్థిక సంస్థల పేర్లతో పీఏఎక్స్ అనే డచ్ గ్రూప్ ఒక నివేదిక రూపొందించింది. ఈ జాబితాలో జేపీ మోర్గాన్, బార్క్లేస్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, క్రెడిట్ సూసీ వంటి సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా ఏడు క్లస్టర్ బాంబుల తయారీ కంపెనీలకు 2012 జూన్-2016 ఏప్రిల్ మధ్య 28 బిలియన్ల అమెరికా డాలర్లను రుణంగా అందించాయి. స్థానిక చట్టాలు, నిబంధనలకు అనుగుణంగానే తమ రుణ విధానం ఉంటుందని ఎస్బీఐ పేర్కొనగా, అంతర్జాతీయంగా నిషేధం ఉన్నప్పటికీ ఈ కంపెనీలకు రుణ మంజూరీలు జరిగినట్లు పీఏఎక్స్ 275 పేజీల నివేదికలో తెలిపింది. కాగా ఈ కంపెనీలకు రుణాలిచ్చిన దేశాల జాబితా(బ్యాంకులు)లో తొలుత అమెరికా(74) నిలిచింది. వరుసలో చైనా (29), దక్షిణ కొరియా (26) ఉన్నాయి. అమెరికాకు చెందిన ఆర్బిటర్ ఏటీకేకు ఎస్బీఐ రుణం ఇచ్చింది.