‘హాల్ ఆఫ్ షేమ్’ బ్యాంకుల్లో ఎస్‌బీఐ
క్లస్టర్ బాంబుల తయారీ కంపెనీలకు రుణం
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ‘హాల్ ఆఫ్ షేమ్’ బ్యాంకుల జాబితాలోకి భారత్ బ్యాంకింగ్ దిగ్గజం- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఎక్కింది. ఈ జాబితాలోకి ఎక్కిన ఏకైక భారత్ బ్యాంకు కేవలం ఎస్‌బీఐ కావడం గమనార్హం. క్లస్టర్ బాంబుల తయారీ కంపెనీలకు రుణాలను ఇచ్చినందుకుగానే ఈ ‘షేమ్’ జాబితాలో ఎస్‌బీఐ చేరింది. అంతర్జాతీయంగా క్లస్టర్ బాంబు తయారీ కంపెనీలకు బిలియన్ డాలర్ల రుణాలు ఇచ్చిన 158 బ్యాంకులు, ఆర్థిక సంస్థల పేర్లతో పీఏఎక్స్ అనే డచ్ గ్రూప్ ఒక నివేదిక రూపొందించింది.
ఈ జాబితాలో జేపీ మోర్గాన్, బార్క్‌లేస్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, క్రెడిట్ సూసీ వంటి సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా ఏడు క్లస్టర్ బాంబుల తయారీ కంపెనీలకు 2012 జూన్-2016 ఏప్రిల్ మధ్య 28 బిలియన్ల అమెరికా డాలర్లను రుణంగా అందించాయి.
స్థానిక చట్టాలు, నిబంధనలకు అనుగుణంగానే తమ రుణ విధానం ఉంటుందని ఎస్‌బీఐ పేర్కొనగా, అంతర్జాతీయంగా నిషేధం ఉన్నప్పటికీ ఈ కంపెనీలకు రుణ మంజూరీలు జరిగినట్లు పీఏఎక్స్ 275 పేజీల నివేదికలో తెలిపింది. కాగా ఈ కంపెనీలకు రుణాలిచ్చిన దేశాల జాబితా(బ్యాంకులు)లో తొలుత అమెరికా(74) నిలిచింది. వరుసలో చైనా (29), దక్షిణ కొరియా (26) ఉన్నాయి. అమెరికాకు చెందిన ఆర్బిటర్ ఏటీకేకు ఎస్‌బీఐ రుణం ఇచ్చింది.