ఏదైనా బాంబును ప్రయోగిస్తే.. అది పడిన ప్రదేశంతోపాటు కొంతదూరం వరకు విధ్వంసం సృష్టిస్తుంది. అక్కడితో దాని పని అయిపోతుంది. అదే క్లస్టర్ బాంబును ప్రయోగిస్తే.. టార్గెట్ చేసిన ప్రదేశంతోపాటు చుట్టుపక్కల కొంత దూరం దాకా విధ్వంసం సృష్టిస్తుంది. అందులోని భాగాలు ఆ తర్వాత కూడా పేలుతూనే.. అక్కడికి వచ్చినవారి ప్రాణాలు తీస్తూనే ఉంటాయి.
తాజాగా ఉక్రెయిన్‌కు అమెరికా క్లస్టర్ బాంబులను ఇవ్వడం, ప్రతిగా తమ వద్ద కూడా క్లస్టర్ బాంబులు ఉన్నాయని రష్యా హెచ్చరించడం నేపథ్యంలో.. క్లస్టర్ బాంబులు ఏమిటి? వాటితో ప్రమాదమేంటి? ఇప్పటివరకు ఎక్కడైనా ప్రయోగించారా? అన్న వివరాలు తెలుసుకుందామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్
ఒకటి కాదు వందల బాంబులు కలిపి..
సాధారణంగా క్షిపణులు అయినా, ఇతర బాంబులు అయినా వాటిలో పేలిపోయే భాగం (వార్ హెడ్) ఒకటే ఉంటుంది. ఒకే ప్రదేశంలో పెద్ద పేలుడు సంభవిస్తుంది. అదే క్లస్టర్ బాంబులో వందలకొద్దీ చిన్న బాంబులు (బాంబ్లెట్లు) ఉంటాయి. దీనిని ప్రయోగించాక నిర్దేశించిన ప్రాంతానికి చేరుకోగానే విచ్చుకుని.. అందులోని చిన్న బాంబులన్నింటినీ కొంతదూరం వరకు వెదజల్లుతుంది. ఇలా ఎక్కువ విస్తీర్ణంలో పేలుళ్లు జరుగుతాయి. అంత విస్తీర్ణంలో విధ్వంసం జరుగుతుంది. మిలటరీ స్థావరాలు, వాహనాలు, ఆయుధాలు నాశనమవుతాయి. ఆ ప్రాంతంలో ఉండే సైన్యం, సాధారణ ప్రజలకూ ప్రమాదం కలుగుతుంది.
అప్పుడే పేలక.. తర్వాత ప్రాణాలు తీస్తూ..
క్లస్టర్ బాంబులు వెదజల్లే బాంబ్లెట్లలో అన్నీ అప్పటికప్పుడే పేలిపోవు. వాటిలో కొన్ని నేలపై చెల్లాచెదురుగా పడిపోతాయి. కొన్నిసార్లు ఏళ్లకేళ్లు కూడా అలాగే ఉంటాయి. ఎప్పుడైనా సైనికులుగానీ, సాధారణ పౌరులుగానీ వాటిని తాకితే పేలిపోయి ప్రాణాలు తీస్తాయి. అంటే యుద్ధం ముగిసిపోయినా బాంబుల బాధ తప్పని పరిస్థితి.
♦ గతంలో వియత్నాం, లావోస్, ఇరాక్, అష్గానిస్తాన్ తదితర యుద్ధాల్లో అమెరికా ఈ కస్టర్ బాంబులను వినియోగించింది కూడా. వాటిలో పేలిపోకుండా ఉన్న బాంబులు ఇప్పటికీ తరచూ విస్ఫోటం చెందుతూ ప్రజలు ప్రాణాలను బలి తీసుకుంటూనే ఉన్నాయి.
♦ క్లస్టర్ బాంబులు భారీగా జన హననానికి దారి తీస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు వీటి వాడకాన్ని నిషేధిస్తూ ఒప్పందం చేసుకున్నాయి. అయితే ఆ ఒప్పందంపై అమెరికా, ఉక్రెయిన్, రష్యా సంతకం చేయకపోవడం గమనార్హం.
‘డడ్ రేటు’తో ఎఫెక్ట్
క్లస్టర్ బాంబు ప్రయోగించినప్పుడు పేలకుండా ఉండిపోయే బాంబ్లెట్ల శాతాన్ని ‘డడ్ రేటు’గా పిలుస్తారు. ఈ డడ్ రేటు ఎంత ఎక్కువగా ఉంటే.. భవిష్యత్తులో ప్రజలు వాటి బారినపడే ప్రమాదం అంత ఎక్కువగా ఉంటుంది. రష్యాకు చెందిన క్లస్టర్ బాంబుల డడ్ రేటు 4శాతం నుంచి 40 శాతం వరకు ఉంటుందని అంచనా. తాజాగా ఉక్రెయిన్‌కు ఇచ్చిన క్లస్టర్ బాంబుల డడ్ రేటు చాలా తక్కువగా 2.35 శాతమేనని అమెరికా అధికారులు ప్రకటించడం గమనార్హం.
క్లస్టర్ బాంబుల ప్రత్యేకతలివీ..
♦ క్లస్టర్ బాంబు బరువు సాధారణంగా 450 కిలోల నుంచి 500 కిలోల వరకు ఉంటుంది. అందులో ఒక్కోటీ ఏడెనిమిది అంగుళాల పొడవున్న 200 వరకు బాంబ్లెట్లు ఉంటాయి.
♦ క్లస్టర్ బాంబు నిర్దేశిత లక్ష్యానికి చేరువకాగానే.. అతి వేగంగా తిరగడం మొదలవుతుంది. తర్వాత దశలవారీగా బాంబ్లెట్లను విడుదల చేస్తుంది. దీనివల్ల బాంబ్లెట్లు దూరదూరంగా, వేగంగా పడిపోతాయి.
♦ క్లస్టర్ బాంబుల్లోని బాంబ్లెట్లకు కిందివైపు ఫ్యాన్ తరహా ప్రత్యేకమైన రెక్కలు, లేకుంటే చిన్నపాటి ప్యారాచూట్లను అమర్చుతారు. దీనితో అవి ఓ క్రమంలో నేలను తాకి పేలిపోతాయి.
♦ పేలిపోకుండా ఉండిపోయిన బాంబ్లెట్లను గుర్తించి నిర్విర్యం చేయడం కూడా ప్రమాదకరమైన పనే. ఎవరైనా తాకగానే పేలిపోయే అవకాశాలు ఎక్కువ. అందువల్ల బాంబ్ డిస్పోజల్ యూనిట్లు, రోబోలతో వాటిని గుర్తించి, నిర్విర్యం చేయాల్సి ఉంటుంది.
1 మిలటరీ వాహనం నుంచి క్లస్టర్ బాంబు ప్రయోగం
2 నిర్దేశిత లక్ష్యానికి సమీపంలో ఉండగా క్లస్టర్ బాంబు నుంచి బాంబ్లెట్లు విడుదల అవుతాయి.
3 చాలా వరకు బాంబ్లెట్లు నేలను తాకగానే పేలిపోతాయి.
4 కొంత మేర బాంబ్లెట్లు పేలిపోకుండా నేలపై పడి ఉంటాయి. వాటిని ఎవరైనా తాకితే వెంటనే పేలిపోయి విధ్వంసం సృష్టిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment