న్యూఢిల్లీ: యావత్ దేశాన్నీ కుదిపేసిన నిర్భయ పై సామూహిక అత్యాచారం, హత్య కేసులో ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు దోషులు శతవిధాలా యత్నిస్తున్నారు. న్యాయం జరుగుతుందని ఆశించిన ప్రతిసారీ నిర్భయ తల్లిదండ్రులకు నిరాశే ఎదురవుతోంది. మృత్యువు తరుముకొస్తున్న ప్రతి సందర్భంలోనూ దోషుల తరఫు న్యాయవాదులు చట్టపరిధిలో శిక్ష అమలును అడ్డుకుంటూనే ఉన్నారు. నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు వాయిదా పడడం ఇది మూడోసారి.
న్యాయపరమైన అన్ని అవకాశాలనూ వినియోగించుకునే హక్కు దోషులకుందన్న న్యాయ నిబంధనల నేపథ్యంలో మరణశిక్ష వాయిదా పడుతూ వస్తోంది. మరణశిక్ష పడిన దోషులు క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయడం ద్వారా, లేదా క్షమాభిక్ష కోసం రాష్ట్రపతికి అర్జీ పెట్టుకోవడం ద్వారా శిక్ష అమలు కొంతకాలం వాయిదా పడేలా చేసుకోవచ్చు. ఒకసారి క్షమాభిక్షను రాష్ట్రపతి తిరస్కరించినట్టయితే, తిరస్కరణను సవాల్ చేస్తూ కూడా కోర్టుకి వెళ్ళొచ్చు. ఇలాంటి అన్ని అవకాశాలనూ వినియోగించుకుంటూ మరణశిక్షని వాయిదా వేస్తూ వచ్చారు దోషులు. చివరకు తలగోడకేసి కొట్టుకొని కూడా అనారోగ్యం, గాయాలు అయ్యాయన్న నెపంతో ఉరిశిక్షని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
► జనవరి 22, 2020: ఈ కేసులో జనవరి 7న ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టు దోషులు నలుగురినీ జనవరి 22న ఉరితీయాలని తీర్పునిచ్చింది.
► ఫిబ్రవరి 1, 2020: అయితే ముకేశ్ సింగ్ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించారు. క్షమాభిక్ష తిరస్కరణ అనంతరం ఉరిశిక్షకు 14 రోజుల గడువివ్వాలన్న నిబంధనల మేరకు జనవరి 17న ఢిల్లీ కోర్టు నిర్భయ దోషుల ఉరిశిక్షను తిరిగి వాయిదా వేసి, ఫిబ్రవరి 1న దోషులకు ఉరిశిక్ష అమలు చేయాలంది.
► పవన్ గుప్తా 2012లో నిర్భయ ఘటన జరిగినప్పుడు తాను మైనర్‌నంటూ జనవరి 17న సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. దీంతో రెండోసారి ఉరి ఆగిపోయింది.
► మార్చి 3, 2020: తిరిగి ఫిబ్రవరి 17న కోర్టు మూడోసారి డెత్ వారెంట్ జారీచేసింది. దీనిప్రకారం మార్చి 3న నలుగురికీ ఉరిశిక్ష అమలు జరగాల్సి ఉంది. సోమవారం తాజాగా మూడోసారి మరణశిక్ష వాయిదా పడింది.
Comments
Please login to add a commentAdd a comment