న్యూఢిల్లీ: నిర్భయ కేసులో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న ఇద్దరు దోషులు దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్‌పై జనవరి 14న విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. 2012 డిసెంబర్‌లో నిర్భయపై అత్యాచారానికి పాల్పడి ఆమె మరణానికి కారణమైన నలుగురికి సుప్రీంకోర్టు ఉరిశిక్ష ఖరారుచేస్తూ తీర్పు చెప్పడం తెల్సిందే. ఈ నెల 22న ఉరిశిక్ష అమలు చేయనున్న నేపథ్యంలో నలుగురు దోషుల్లో వినయ్ శర్మ(26), ముఖేష్ కుమార్(32)లు మాత్రం గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. క్యూరేటివ్ పిటిషన్‌లను దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం మంగళవారం మధ్యాహ్నం విచారించనుంది.
ఢిల్లీ కోర్టు ఒకటి నలుగురు దోషులకు జనవరి 8న డెత్ వారంట్లు జారీ చేస్తూ తగినంత సమయం అవకాశాలు కల్పించినా.. దోషులు తమ ముందు ఉన్న న్యాయపరమైన మార్గాలను ఉపయోగించుకోలేదని వ్యాఖ్యానించిన కొన్ని రోజులకే ఇద్దరు దోషులు క్యూరేటివ్ పిటిషన్లు దాఖలు చేయడం గమనార్హం. క్రిమినల్ ప్రొసీడింగ్స్ కారణంగా తన కుటుంబం మొత్తం ఇబ్బంది పడిందని, వారి తప్పు లేకపోయినా సామాజికంగా హేళనకు గురైందని వినయ్ శర్మ తన క్యూరేటివ్ పిటిషన్‌లో పేర్కొన్నారు. తన తల్లిదండ్రులు పేదవారు, వయో వృద్ధులని, కేసు కారణంగా ఆర్థికంగా మరింత చితికిపోయారని తెలిపాడు. సీనియర్ న్యాయవాది అధీస్ సి.అగర్‌వాలా, ఏపీ సింగ్‌ల ఈ క్యూరేటివ్ పిటిషన్ దాఖలు కాగా.. పిటిషనర్‌ను ఉరితీస్తే కుటుంబం మొత్తం ధ్వంసమైపోతుందని, ఇన్నేళ్ల జైలు జీవితం, అతడి మానసిక పరిస్థితులను పరిగణలోకి తీసుకోవాలని అభ్యర్థించారు.
Comments
Please login to add a commentAdd a comment