curative plea
-
14న నిర్భయ దోషుల పిటిషన్ల విచారణ
న్యూఢిల్లీ: నిర్భయ కేసులో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న ఇద్దరు దోషులు దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్‌పై జనవరి 14న విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. 2012 డిసెంబర్లో నిర్భయపై అత్యాచారానికి పాల్పడి ఆమె మరణానికి కారణమైన నలుగురికి సుప్రీంకోర్టు ఉరిశిక్ష ఖరారుచేస్తూ తీర్పు చెప్పడం తెల్సిందే. ఈ నెల 22న ఉరిశిక్ష అమలు చేయనున్న నేపథ్యంలో నలుగురు దోషుల్లో వినయ్ శర్మ(26), ముఖేష్ కుమార్(32)లు మాత్రం గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. క్యూరేటివ్ పిటిషన్లను దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం మంగళవారం మధ్యాహ్నం విచారించనుంది. ఢిల్లీ కోర్టు ఒకటి నలుగురు దోషులకు జనవరి 8న డెత్ వారంట్లు జారీ చేస్తూ తగినంత సమయం అవకాశాలు కల్పించినా.. దోషులు తమ ముందు ఉన్న న్యాయపరమైన మార్గాలను ఉపయోగించుకోలేదని వ్యాఖ్యానించిన కొన్ని రోజులకే ఇద్దరు దోషులు క్యూరేటివ్ పిటిషన్లు దాఖలు చేయడం గమనార్హం. క్రిమినల్ ప్రొసీడింగ్స్ కారణంగా తన కుటుంబం మొత్తం ఇబ్బంది పడిందని, వారి తప్పు లేకపోయినా సామాజికంగా హేళనకు గురైందని వినయ్ శర్మ తన క్యూరేటివ్ పిటిషన్లో పేర్కొన్నారు. తన తల్లిదండ్రులు పేదవారు, వయో వృద్ధులని, కేసు కారణంగా ఆర్థికంగా మరింత చితికిపోయారని తెలిపాడు. సీనియర్ న్యాయవాది అధీస్ సి.అగర్వాలా, ఏపీ సింగ్‌ల ఈ క్యూరేటివ్ పిటిషన్ దాఖలు కాగా.. పిటిషనర్‌ను ఉరితీస్తే కుటుంబం మొత్తం ధ్వంసమైపోతుందని, ఇన్నేళ్ల జైలు జీవితం, అతడి మానసిక పరిస్థితులను పరిగణలోకి తీసుకోవాలని అభ్యర్థించారు. -
స్వలింగ సంపర్కుల్లో చిగురించిన కొత్త ఆశలు
న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కం నేరమంటూ సుప్రీంకోర్టు గత ఏడాది ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ గే హక్కుల కార్యకర్తలు దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్లను బహిరంగ కోర్టులో విచారించేందుకు సుప్రీం కోర్టు ఈ రోజు అంగీకరించింది. దీనిని వచ్చేవారం చేపట్టే విచారణల జాబితాలో చేర్చాలని పేర్కొంటూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పి.సదాశివం నేతృత్వంలోని నలుగురు సభ్యుల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గే సెక్స్ నేరమంటూ ఇచ్చిన తీర్పును కోర్టు సవరించుకోవచ్చని భావిస్తున్న ఎల్జీబీటీ(లెస్బియన్, గే, బెసైక్సువల్, ట్రాన్స్‌జెండర్) వర్గాల్లో కొత్త ఆశలు చిగురించాయి. గే సెక్స్ నేరమని, అందుకు జీవిత ఖైదు వరకూ శిక్ష విధించవచ్చని పేర్కొనే ఐపీసీ సెక్షన్ 377(అసహజ శృంగార నేరాలు) చట్టబద్ధతను సమర్థిస్తూ గత ఏడాది డిసెంబరు 11న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ నాజ్ ఫౌండేషన్, ప్రముఖ సినీ దర్శకుడు శ్యాం బెనెగల్, గే హక్కుల కార్యకర్తలు సుప్రీంలో క్యూరేటివ్ పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్లను ఓపెన్ కోర్టులో విచారించాలంటూ పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదులు కోరగా వారి విజ్ఞప్తిని పరిశీలిస్తామని సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. బహిరంగ కోర్టులో విచారించేందుకు సుప్రీం కోర్టు ఈ రోజు ఆమోదించింది. కోర్టు తీర్పులపై అప్పీళ్లలో క్యూరేటివ్ పిటిషన్ వేయడం అనేది న్యాయపరంగా ఆఖరి ప్రక్రియ. సాధారణంగా క్యూరేటివ్ పిటిషన్లపై ఎలాంటి వాదనలకూ అవకాశం ఇవ్వకుండా న్యాయమూర్తులు ఇన్-చాంబర్ కోర్టులోనే పిటిషన్లను విచారిస్తారు. అరుదైన సందర్భాల్లో మాత్రమే ఇలా బహిరంగ కోర్టులో విచారించేందుకు అంగీకరిస్తారు.