అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (ఫైల్‌ఫోటో)
వాషింగ్టన్ : 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా ప్రమేయంపై విచారణను ఎదుర్కొంటున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు తాను క్షమాభిక్ష ప్రసాదించుకునే హక్కు తనకుందని స్పష్టం చేశారు. అయితే తాను ఎలాంటి తప్పూ చేయనందున తనకున్న హక్కును ఉపయోగించుకునే అవసరం తలెత్తబోదన్నారు. న్యాయనిపుణులు చెబుతున్న మేరకు తనకు క్షమాబిక్ష ప్రసాదించే హక్కు తనకుందని..తానెలాంటి తప్పూ చేయనప్పుడు తానలా ఎందుకు చేయాలని ట్రంప్ సోమవారం సాయంత్రం ట్వీట్ చేశారు.
ట్రంప్‌కు తనకు క్షమాభిక్ష ప్రసాదించుకునే అధికారం ఉందని ఆయన న్యాయవాది రూడీ గిలియానీ ప్రకటన చేసిన నేపథ్యంలో ట్రంప్ ఇలా ట్వీట్ చేయడం గమనార్హం. అయితే అధ్యక్షుడికి క్షమాభిక్ష ప్రసాదించుకునే ఉద్దేశం లేదని గిలియానీ చెప్పారు. అమెరికా రాజ్యాంగం క్షమాభిక్షలను ప్రసాదించే అధికారం అధ్యక్షుడికి కట్టబెట్టిందని..ఆయనకు క్షమాభిక్ష ఇచ్చుకోరాదని ఎక్కడా పేర్కొనలేదని గిలియానీ పేర్కొనడం గమనార్హం. కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై ప్రత్యేక న్యాయవాది రాబర్ట్ ముల్లర్ విచారణ చేపట్టారు.
ట్రంప్ ప్రచారంలో భాగంగా రష్యాతో కుమ్మక్కయ్యారా అనే కోణంలోనూ విచారణ సాగుతోంది. ట్రంప్ ప్రచార సహాయకులతో పాటు మాజీ ప్రచార కమిటీ ఛైర్మన్ పౌల్ మనఫోర్ట్‌పై ఈ విచారణ నేపథ్యంలో నేరారోపణలు నమోదయ్యాయి. రష్యా విచారణను చట్టవిరుద్ధంగా తొక్కిపెట్టేందుకు ట్రంప్ వ్యవహరిస్తున్నారా అనే అంశంపైనా విచారణ జరుగుతోంది. కాగా ముల్లర్‌కు ట్రంప్ న్యాయవాదులు రాసిన లేఖ అధ్యక్షుడు స్వయంగా క్షమాభిక్ష ప్రసాదించుకుంటారనే అనుమానాలను రేకెత్తిస్తోంది. అధ్యక్షుడు తలచుకుంటే ప్రధాన న్యాయ అధికారిగా విచారణను రద్దు చేయడం లేదా తనకు తాను క్షమాభిక్ష ప్రసాదించుకునే అధికారాన్ని వినియోగించుకునే హక్కు ఆయనకు ఉంటాయని ఈ లేఖలో పేర్కొనడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment