క్షమాభిక్ష నేను కోరలేదు..
ముంబైః తన క్షమాభిక్ష పిటిషన్ను మహారాష్ట్ర గవర్నరు తోసిపుచ్చారన్న వార్తలపై బాలీవుడ్ హీరో సంజయ్ దత్ స్పందించాడు. అసలు తాను క్షమాభిక్ష పిటిషనే పెట్టుకోలేదని స్పష్టం చేశాడు. తానుగానీ, తన కుటుంబసభ్యులు కానీ మహారాష్ట్ర గవర్నరు, ప్రభుత్వానికి అలాంటి అర్జీ పెట్టుకోలేదని సంజుభాయ్ స్పష్టం చేశాడు.
దీనికి సంబంధించి సంజయ్ దత్ తరఫు న్యాయవాదులు హితేష్ జైన్, సుభాష్ జాదవ్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సంజయ దత్ గానీ, ఆయన కుటుంబ సభ్యులుగానీ ఎవరూ క్షమాభక్ష పిటిషన్ దాఖలు చేయలేదని తెలిపారు. అయితే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ ఖట్జూ ఈ పిటిషను దాఖలు చేసినట్లు పేర్కొన్నారు. సంజయ్తోపాటు, ఈ కేసులో మిగిలిన దోషులకు కూడా క్షమాభిక్ష ప్రసాదించాలంటూ ఖట్జూ ఈ పిటిషన్ వేశారని తెలిపారు. మరికొద్ది రోజుల్లో ఆయన శిక్షాకాలం పూర్తి కావస్తుండగా, ఇక క్షమాభిక్ష పిటిషన్ ప్రశ్నే ఉత్పన్నం కాదని వారు స్పష్టం చేశారు. ఇటీవల ఫిబ్రవరిలో సంజయ్ పెరోల్ పై బయటకు వచ్చాడు.
కాగా 1993 నాటి వరుస బాంబు పేలుళ్ల కేసులో సంజయ్ దత్ శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. అతడికి 2013లో సుప్రీంకోర్టు అయిదేళ్ల కారాగార శిక్ష విధించిన సంగతి విదితమే. అయితే అప్పటికే దత్ 18 నెలలపాటు కారాగారంలో గడపడంతో ఆ కాలాన్ని మినహాయించింది. 2013 మే లో కారాగారానికి వెళ్లిన సంజయ్ దత్ 30 నెలల పాటు శిక్ష అనుభవించాడు. 2016, ఫిబ్రవరిలో అతడు విడుదల కావాల్సి ఉంది. కాగా 1993లో ముంబైలో 13 వరుస బాంబు పేళ్లులు సంభవించాయి. ఈ ఘటనల్లో 257మంది చనిపోగా, మరో 713మంది గాయపడ్డారు.