
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పదవి కాలం మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఇక చివరి రోజున ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా 73 మందికి క్షమాభిక్ష పెట్టారు. అయితే గతంలో ప్రకటించినట్లు ట్రంప్ తనకు స్వీయ క్షమాభిక్ష పెట్టుకోలేదు. అలానే తన కుటుంబ సభ్యులు, లాయర్ రూడీ గియులియాని క్షమాభిక్ష పొందిన వారి జాబితాలో లేరు. మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ట్రంప్ తన మాజీ సలహాదారుడు స్టీవ్ బ్యానన్‌కు క్షమాభిక్ష పెట్టారు. ప్రజలను మోసం చేయడమే కాక దాతల నుంచి ఒక మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ నిధులను బ్యానన్ సేకరించారని, వీటిలో చాలా మొత్తాన్ని వ్యక్తిగత ఖర్చుల కోసం ఆయన ఉపయోగించుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. కానీ బ్యానన్ వీటిని ఖండించారు.
(చదవండి: చెత్త రికార్డు సృష్టించనున్న ట్రంప్)
బ్యానన్ చాలా ముఖ్యమైన నాయకుడని, ఆయనకు రాజకీయాలపై మంచి అవగాహన ఉందన్న ట్రంప్ అతడికి క్షమాభిక్ష పెట్టారు. మరోవైపు లిల్ వెయిన్, కోడక్ బ్లాక్ అక్రమ ఆయుధాలు కలిగివున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. క్విల్‌పాట్రిక్‌పై అవినీతి ఆరోపణలు వచ్చాయి. వీరందరికి ట్రంప్ క్షమాభిక్ష పెట్టారు. పదవి నుంచి దిగిపోయే ముందు అమెరికాలో అధ్యక్షులు చాలా మందికి క్షమాభిక్ష పెడుతుంటారు. కొన్ని నెలలుగా ట్రంప్ కూడా చాలా మందికి వరుసగా క్షమాభిక్ష పెడుతూ వచ్చారు. సన్నిహితులతోపాటు తనతో కలిసి పనిచేసిన పాల్ మెనాఫోర్ట్ లాంటి వారు కూడా క్షమాభిక్ష పొందినవారిలో ఉన్నారు. ర్యాపర్ లిల్ వెయిన్ పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థనకు ట్రంప్ ఆమోదం తెలిపారు. మరో ర్యాపర్ కోడక్ బ్లాక్, డెట్రాయిట్ మాజీ మేయర్ క్వేమ్ కిల్‌పాట్రిక్‌ల శిక్షలను కూడా తగ్గించారు.
(చదవండి: బైడెన్ కర్తవ్యాలు)
మొత్తంగా 73 మందికి ట్రంప్ క్షమాభిక్ష పెట్టారని, మరో 70 మందికి శిక్షలు తగ్గించారని వైట్‌హౌస్ ఒక ప్రకటన విడుదల చేసింది. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్‌కు సలహాదారుడిగా, ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ప్రముఖుల్లో బ్యానన్ కూడా ఒకరు. అమెరికా మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మాణం కోసం సేకరించిన నిధుల్లో అవకతవకలకు పాల్పడ్డారంటూ గత ఏడాది ఆగస్టులో బ్యానన్‌పై ఆరోపణలు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment