Rudy Giuliani
-
అధ్యక్షుడిగా చివరి రోజు ట్రంప్ కీలక నిర్ణయం..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పదవి కాలం మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఇక చివరి రోజున ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా 73 మందికి క్షమాభిక్ష పెట్టారు. అయితే గతంలో ప్రకటించినట్లు ట్రంప్ తనకు స్వీయ క్షమాభిక్ష పెట్టుకోలేదు. అలానే తన కుటుంబ సభ్యులు, లాయర్ రూడీ గియులియాని క్షమాభిక్ష పొందిన వారి జాబితాలో లేరు. మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ట్రంప్ తన మాజీ సలహాదారుడు స్టీవ్ బ్యానన్‌కు క్షమాభిక్ష పెట్టారు. ప్రజలను మోసం చేయడమే కాక దాతల నుంచి ఒక మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ నిధులను బ్యానన్ సేకరించారని, వీటిలో చాలా మొత్తాన్ని వ్యక్తిగత ఖర్చుల కోసం ఆయన ఉపయోగించుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. కానీ బ్యానన్ వీటిని ఖండించారు. (చదవండి: చెత్త రికార్డు సృష్టించనున్న ట్రంప్) బ్యానన్ చాలా ముఖ్యమైన నాయకుడని, ఆయనకు రాజకీయాలపై మంచి అవగాహన ఉందన్న ట్రంప్ అతడికి క్షమాభిక్ష పెట్టారు. మరోవైపు లిల్ వెయిన్, కోడక్ బ్లాక్ అక్రమ ఆయుధాలు కలిగివున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. క్విల్‌పాట్రిక్‌పై అవినీతి ఆరోపణలు వచ్చాయి. వీరందరికి ట్రంప్ క్షమాభిక్ష పెట్టారు. పదవి నుంచి దిగిపోయే ముందు అమెరికాలో అధ్యక్షులు చాలా మందికి క్షమాభిక్ష పెడుతుంటారు. కొన్ని నెలలుగా ట్రంప్ కూడా చాలా మందికి వరుసగా క్షమాభిక్ష పెడుతూ వచ్చారు. సన్నిహితులతోపాటు తనతో కలిసి పనిచేసిన పాల్ మెనాఫోర్ట్ లాంటి వారు కూడా క్షమాభిక్ష పొందినవారిలో ఉన్నారు. ర్యాపర్ లిల్ వెయిన్ పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థనకు ట్రంప్ ఆమోదం తెలిపారు. మరో ర్యాపర్ కోడక్ బ్లాక్, డెట్రాయిట్ మాజీ మేయర్ క్వేమ్ కిల్పాట్రిక్ల శిక్షలను కూడా తగ్గించారు. (చదవండి: బైడెన్ కర్తవ్యాలు) మొత్తంగా 73 మందికి ట్రంప్ క్షమాభిక్ష పెట్టారని, మరో 70 మందికి శిక్షలు తగ్గించారని వైట్‌హౌస్ ఒక ప్రకటన విడుదల చేసింది. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్‌కు సలహాదారుడిగా, ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ప్రముఖుల్లో బ్యానన్ కూడా ఒకరు. అమెరికా మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మాణం కోసం సేకరించిన నిధుల్లో అవకతవకలకు పాల్పడ్డారంటూ గత ఏడాది ఆగస్టులో బ్యానన్‌పై ఆరోపణలు వచ్చాయి. -
‘ఇలాంటి ఘోరాన్ని ఇంతవరకు చూడలేదు’
వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తారుమారు చేయాలని భావిస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలకు నాయకత్వం వహిస్తున్న అతడి పర్సనల్ డిఫెన్స్ న్యాయవాది రూడీ గియులియానికి చేదు అనుభవం ఎదురయ్యింది. ఎన్నికల్లో జో బైడెన్ అక్రమాలకు పాల్పడ్డారంటూ నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతుండగా ఆయన హెయిర్ డై కరిగి ముఖం మీదకు కారింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతుండగా.. దాన్ని తలదన్నే మరో వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యింది. ఇది కూడా రూడీ గియులియానికి చెందినదే కావడం విశేషం. ఇక ఈ వీడియోలో రూడీ గియులియాని చర్యలు చూస్తే.. నవ్వు, ఆసహ్యం రెండు ఒకేసారి వస్తాయి. ఇక ఈ వీడియోలో రూడీ ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నాడు. ఇంతలో ఓ నాప్కిన్ తీసి ముక్కు చీదుకుంటాడు. అనంతరం దాన్ని పడేయకుండా మరో వైపు మడతపెట్టి.. దానితో నోరు, నుదురు తుడుచుకుంటాడు. ఆ తర్వాత దాన్ని తీసి జేబులో పెట్టుకుంటాడు. ట్విట్టర్లో షేర్ చేసిన ఈ వీడియోని ఇప్పటికే 1.5మిలియన్ల మంది వీక్షించారు. (చదవండి: బైడెన్ గెలిచాడని ఒప్పుకున్న ట్రంప్!) ఇక నెటిజనులు ఆయన్ని ఓ ఆట ఆడేసుకున్నారు. ‘ఓరే నాయన అసలే ఇది కోవిడ్ కాలం. నువ్వేమో ఏ మాత్రం జాగ్రత్త లేకుండా ముక్కు తుడుచుకున్న నాప్కిన్తోనే ముఖం తుడుచుకున్నావ్.. ఏంటి నీ ధైర్యం’.. ‘అరే అక్కడ నాప్కిన్ బండిల్ పెట్టండి’.. ‘ఇదంతా లైవ్‌లో టెలికాస్ట్ అవుతుంది.. మర్చిపోయావా’.. ‘కోవిడ్, ఇతర జబ్బులు ఎలా వ్యాప్తి చెందుతాయో వివరించడానికి నువ్వు సరైన ఉదాహరణ’ అంటూ నెటిజనులు కామెంట్ చేశారు. ఇక అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికి ట్రంప్, అతడి మద్దతుదారులు దాన్ని అంగీకరించడం లేదు. జో బైడెన్ ఎన్నికల్లో మోసాలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు చేస్తున్నారు. -
అదిరిపోయే ట్విస్ట్: రాసలీలలపై మరో సాక్ష్యం!
ప్లేబాయ్ మాజీ మోడల్ కరెన్ మెక్‌డౌగల్(46).. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనతో రాసలీలలు నడిపారని సంచలన ఆరోపణలు చేసిన విషయం విదితమే. ట్రంప్ తనతో లైంగిక సంబంధం కొనసాగించినట్లు ఆమె ఆరోపించటమే కాదు.. అందుకు ఆధారాలు ఉన్నాయంటూ పేర్కొని కలకలమే రేపారు. అయితే ఈ వ్యవహారానికి సంబంధించిన ఆడియో టేప్ ఒకటి ఇప్పుడు బయటకు రావటం చర్చనీయాంశంగా మారింది. వాషింగ్టన్: ట్రంప్.. తన మాజీ అటార్నీ మైకేల్ కోహెన్‌తో జరిపిన సంభాషణ ఆడియో క్లిప్ దర్యాప్తు అధికారుల చేతికి చిక్కినట్లు సమాచారం. ఈ మేరకు ఓ ప్రముఖ పత్రిక కథనం ప్రచురించింది. కరెన్ నోరు మూయించేందుకు ఆమెతో తప్పనిసరిగా డీల్ కుదుర్చుకోవాలని కోహెన్‌కు ట్రంప్ సూచించినట్లు ఆ కథనం పేర్కొంది. ‘ఈ వ్యవహారం ఓ కొలిక్కి రావాలన్నా.. కరెన్‌ను కట్టడి చేయాలన్నా ఎంతో కొంత చెల్లించి ఆమె నోరు మూయించండి’.. అని ట్రంప్ సూచించగా.. ‘వ్యవహారం ఇక్కడే తేల్చేద్దాం’ అని కోహెన్ బదులిచ్చినట్లు క్లిప్‌లో ఉన్నట్లు సదరు కథనం సారాంశం. ట్రంప్ టవర్లోనే ఈ సంభాషణ జరగ్గా.. 90 సెకన్ల ఆ సంభాషణను కోహెన్ ముందు జాగ్రత్తగా రికార్డు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కోహెన్‌పై ఎన్నికల అవినీతి, అక్రమాస్థుల కేసులు నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫెడరల్ ఏజెంట్లు కోహెన్ కార్యాలయాల నుంచి ఆ టేపులను స్వాధీనం చేసుకున్నట్లు ఆ కథనం వివరించింది. నిజమే కానీ... ఇక ఈ వ్యవహారంపై అధ్యక్షుడు ట్రంప్ వ్యక్తిగత అటార్నీ రూడీ గిలియానీ స్పందించారు. ఆ సంభాషణ నిజమే అయినప్పటికీ.. ఆమెతో ఎలాంటి ఒప్పందం జరగలేదని రూడీ వెల్లడించారు. ఈ వ్యవహారంలో ప్రెసిడెంట్ ట్రంప్‌కు ఎలాంటి న్యాయపరమైన చిక్కులు ఎదురుకాబోవని రూడీ చెబుతున్నారు. ఇదిలా ఉంటే 2006లో ట్రంప్ తనతో అఫైర్ కొనసాగించారని.. ఆదే సమయంలో ట్రంప్ భార్య మెలానియా కొడుక్కి జన్మనిచ్చిందని మెక్‌డౌగల్ ఆరోపణలు చేశారు.. తొమ్మిది నెలలపాటు వారి సంబంధం కొనసాగిందన్న ఆమె.. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆ విషయాలను బయటకు పొక్కనీయకుండా ట్రంప్ డబ్బుతో ఒప్పందం చేసుకున్నాడంటూ ఆమె పేర్కొన్నారు. -
ఆమె పోర్న్‌స్టార్.. ఆమె మాటలు నమ్మొద్దు!
వాషింగ్టన్ : తన మాజీ లాయర్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఓ కీలుబొమ్మగా మారిపోయాడని పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్ అన్నారు. డేనియల్స్ పోర్న్‌స్టార్ అని, ఆమె మాటల్ని ఎవరు నమ్మవద్దని ట్రంప్ లాయర్ చేసిన వ్యాఖ్యలపై ఆమె తీవ్ర స్థాయిలో స్పందించారు. ట్రంప్‌తో తనకు గతంలో శారీరక సంబంధాలున్నాయని ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ విషయాలు బహిర్గతం చేయకుండా ఉండేందుకు అధ్యక్షుడు ట్రంప్ లాయర్ మైఖెల్ కోహెన్ మధ్యవర్తిత్వంతో 1,30,000 అమెరికన్ డాలర్లు తనకు ఆఫర్ చేశారని ఆమె అన్నారు. కాగా, ట్రంప్‌తో సంబంధాలు బయట పెట్టినందుకు న్యూయార్క్ మాజీ మేయర్, ట్రంప్ లాయర్ రుడీ గిలియానీ, డేవిడ్సన్ తనను ఉద్దేశపూర్వకంగానే వేధింపులకు గురిచేస్తున్నారని వెల్లడించారు. తనపై నిఘా ఉంచిన ట్రంప్ మద్దతుదారులు తన ఫోన్‌కాల్స్‌ను రహస్యంగా రికార్డ్ చేశారని తాజాగా ఆరోపించారు. ప్రణాళికా ప్రకరమే తనపై, తన లాయర్ మైఖెల్ అవెనట్టిపై లేని వదంతులు ప్రచారం చేస్తున్నారని పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్ మండిపడ్డారు. స్టార్మీ డేనియల్స్ లాయర్ అవెనట్టి మాట్లాడుతూ.. ట్రంప్ లాయర్ గిలియానీ ఓ పంది అని వ్యాఖ్యానించారు. ట్రంప్‌తో శారీరక సంబంధాలు స్టార్మీ డేనియల్స్ కొనసాగించడం వాస్తవమేనన్న అవెనట్టి, డేవిడ్సన్ ఈ నిజాన్ని అవాస్తవంగా చిత్రీకరిండానికి యత్నిస్తున్నారని ఆరోపించారు. -
చేతులు జోడించి నియంత వేడుకున్నారు!
వాషింగ్టన్ : ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ఈ నెల 12న సింగపూర్‌లో భారత కాలమాన ప్రకారం ఉదయం 6.30 గంటలకు సమావేశం కానున్నారు. అయితే కచ్చితంగా తమ భేటీ జరగాలని నియంత కిమ్.. అగ్రరాజ్యాధినేత ట్రంప్‌ను బతిమాలారట. ఈ విషయాన్ని న్యూయార్క్ మాజీ మేయర్, ట్రంప్ లాయర్ రుడీ గిలియానీ వెల్లడించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలు ప్రస్తావించారు. ఫాక్స్ న్యూస్ కథనం ప్రకారం.. ‘తమ భేటీ రద్దు చేసుకుంటున్నట్లు ట్రంప్ తొలుత కిమ్‌కు లేఖ ద్వారా సందేశం పంపారు. కానీ కిమ్ తన మనసు మార్చుకుని ట్రంప్‌ను ప్రాధేయపడ్డారు. జూన్ 12న సింగపూర్‌లో ఎలాగైనా సరే సమావేశం జరిగేలా ఏర్పాటు చేయాలని కిమ్ అమెరికా అధ్యక్షుడికి రాసిన లేఖలో చేతులు జోడించి మరీ మోకరిల్లారు. కిమ్ తీరు నచ్చక ట్రంప్ తమ సమావేశం రద్దు చేసుకోగా.. నిర్ణయంపై పునరాలోచించాలని కిమ్ అడుక్కున్నారు (బెగ్గింగ్). దీంతో ట్రంప్ తన మనసు మార్చుకున్నారంటూ’ ట్రంప్ లాయర్ రుడీ గిలియానీ వివరించారు. -
ట్రంప్ వార్నింగ్.. నువ్వు ఒంటరిగా ఉండొద్దు!
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో గతంలో తనకు శారీరక సంబంధాలున్నాయని పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్ (అసలు పేరు స్టెఫానీ క్లిఫార్డ్) ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే వారి బంధాన్ని బయటకు వెల్లడిస్తే హత్య చేస్తానంటూ ట్రంప్ నుంచి స్టార్మీ డేనియల్స్‌కు బెదిరింపు కాల్స్ వచ్చాయట. ఈ విషయాన్ని మరో అడల్ట్ స్టార్ జెస్సికా డ్రాకే తాజాగా వెల్లడించారు. ట్రంప్ వ్యక్తులు కొందరు తనకు తరచుగా కాల్స్ చేసి లైంగిక సంబంధాలను వెల్లడించవద్దని బెదిరించారని 2011లోనే స్టార్మీ డేనియల్స్ తనకు చెప్పినట్లుగా జెస్సికా గుర్తు చేసుకున్నారు. ట్రంప్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని బహిర్గతం చేసిన కారణంగా తనకు ఏదైనా జరుగుతుందోనని స్టార్మీ డేనియల్స్ ఆందోళన వ్యక్తం చేసినట్లు నటి తెలిపారు. ఒంటరిగా ఉంటే నీ ప్రాణాలకు కచ్చితంగా ముప్పు ఉంటుందని డేనియల్స్ తనను హెచ్చరించినట్లు నటి జెస్సికా వివరించారు. ట్రంప్‌తో తన సంబంధాల వివరాలు వెల్లడించి, కొంతమేర నగదు తీసుకోవడానికి ఓ మ్యాగజైన్‌తో స్టార్మీ డేనియల్స్ డీల్ కుదుర్చుకున్నారు. అనంతరం జరిగిన పరిణామాల్లో డేనియల్స్‌తో శారీరక సంబంధం కొనసాగించిన కారణంగా ట్రంప్ ఆమెకు నగదు చెల్లించారని న్యూయార్క్ మాజీ మేయర్ రుడీ గిలియాని స్వయంగా వెల్లడించారు. అయితే తొలుత ట్రంప్ తన లాయర్ మైఖేల్ కోహెన్ వద్ద నుంచి పోర్న్ స్టార్‌కు 1,30,000 డాలర్లు చెల్లించినట్లు బుధవారం గిలియాని ఇటీవల స్పష్టం చేశారు. అయితే తాజాగా పోర్న్‌స్టార్ జెస్సికా ట్రంప్ వ్యవహారాన్ని బయటపెట్టారు. ట్రంప్‌తో సంబంధాలు బహిర్గతం చేస్తానంటేనే బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, అలాంటిది ఆయన అసభ్యంగా ప్రవర్తించారని చెబితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందోనంటూ నటి ఆందోళన వ్యక్తం చేశారు. (ట్రంప్ 10 వేల డాలర్లు ఆఫర్ చేశారు: నటి) -
ట్రంప్ బండారం మళ్లీ బట్టబయలు!
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్ (అసలు పేరు స్టెఫానీ క్లిఫార్డ్) చేస్తున్న ఆరోపణలు నిజమని తేలింది. డేనియల్స్‌తో శారీరక సంబంధం కొనసాగించిన కారణంగా ట్రంప్ ఆమెకు నగదు చెల్లించారని న్యూయార్క్ మాజీ మేయర్ రుడీ గిలియాని వెల్లడించారు. అయితే తొలుత ట్రంప్ తన లాయర్ మైఖేల్ కోహెన్ వద్ద నుంచి పోర్న్ స్టార్‌కు 1,30,000 డాలర్లు చెల్లించినట్లు బుధవారం గిలియాని తెలిపారు. ఇటీవల ట్రంప్ న్యాయనిపుణుల బృందంలో రుడీ గిలియాని చేరిన విషయం తెలిసిందే. ఆయన తాజాగా ఫాక్స్ న్యూస్ మీడియాతో మాట్లాడుతూ.. నవంబర్ 2016 అధ్యక్ష ఎన్నికలకు కొన్ని రోజుల ముందు డీల్ కుదిరింది. అయితే ట్రంప్ తన వద్ద చాలాకాలం నుంచి పనిచేస్తున్న లాయర్ మైఖేల్ కోహెన్ వద్ద నుంచి పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు ఒప్పందం చేసుకున్న నగదును ఇప్పించారు. ఆపై కొన్ని నెలల తర్వాత ట్రంప్ ఆ నగదును కోహెన్‌కు ఇచ్చి వేశారు. అయితే అది ఆయన వ్యక్తిగత నగదో.. లేక ప్రభుత్వ ఖజానా నుంచి ఇచ్చారో తనకు తెలియదన్నారు. పోర్న్‌స్టార్ ఎన్నికలకు పనిచేసి ఉంటే అది ప్రచారం చేసినందుకు ఇచ్చిన మొత్తంగా భావించవచ్చునని, అలాంటిది జరగలేదంటూ రుడీ గిలియాని స్పష్టం చేశారు. కాగా, 2006లో తనతో ఉన్న లైంగిక సంబంధాన్ని గోప్యంగా ఉంచాలంటూ ట్రంప్ తన లాయర్ కోహెన్ ద్వారా 2016లో 1,30,000 డాలర్లకు తనతో ఒప్పందం చేసుకున్నారంటూ ప్రకటించి డేనియల్స్ ప్రకంపనలు రేపారు. అయితే ట్రంప్ ఇటీవల దీనిపై స్పందిస్తూ.. లైంగిక సంబంధం అవాస్తమని, డీల్ అనే ప్రసక్తే లేదని తనపై వచ్చిన ఆరోపణల్ని కొట్టిపారేశారు. మరోవైపు వైట్‌హౌజ్ గత కొద్దిరోజులు నుంచి ట్రంప్-డేనియల్స్ మధ్య ఎలాంటి సంబంధం లేదంటూ వరుస ప్రకటన విడుదల చేస్తోంది. -
రోమ్నీయా? గిలియానీనా?
విదేశాంగ మంత్రి (సెక్రటరీ ఆఫ్ స్టేట్): కేబినెట్ పదవుల్లో అత్యంత కీలకమైనది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో? అగ్రరాజ్యంతో తమ సంబంధాలు ఎలా కొనసాగుతాయోనని చాలాదేశాలు ఆందోళన చెందాయి. చివరికి ట్రంప్ అధ్యక్షుడయ్యారు. అమెరికా మిత్ర దేశాలతో మునుపటిలా సంబంధాలు నెరపడటం, దేశ ప్రయోజనాలను కాపాడటం, ప్రపంచవ్యాప్తంగా అమెరికా వ్యాపారాలకు ఇబ్బంది లేకుండా చూడటం, వివిధ దేశాలతో బంధాలను బలోపేతం చేయడం కొత్త సెక్రటరీ ఆఫ్ స్టేట్ ముందుండే సవాళ్లు. తన విమర్శకుడైన మిట్ రోమ్నీని విదేశాంగ మంత్రికి ట్రంప్ సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు వార్తలు రావడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ స్వయంగా రోమ్నీ పేరు పరిశీలనలో ఉందని చెప్పారు. 2012లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా అమెరికా అథ్యక్ష పదవికి పోటీపడి బరాక్ ఒబామా చేతిలో ఓడిపోయిన మిట్ రోమ్నీ... అధ్యక్ష లక్షణాలేవీ ట్రంప్‌కు లేవని బహిరంగంగానే విమర్శించారు. ఈనెల 19న రోమ్నీ- ట్రంప్‌తో భేటీ అయ్యారు. మొదట్లో నిక్కీ హేలీ పేరు కూడా ఈ పదవికి వినిపించినా బుధవారం ఆమెను ఐరాసకు అమెరికా రాయబారిగా నియమించారు. మిగిలిన వాళ్లలో ఐరాసకు అమెరికా రాయబారిగా గతంలో పనిచేసిన జాన్ బోల్టన్, సెనేట్ విదేశీ సంబంధాల కమిటీ చైర్మన్ బాబ్ కార్కర్, మాజీ న్యూయార్క్ మేయర్ రుడాల్ఫ్ గిలియానీ తదితరులు ఉన్నారు. వీరిలో గిలియానీకి అవకాశాలు మెండుగా ఉన్నాయని ట్రంప్ ప్రచార బృందసభ్యులు చెబుతున్నారు. -సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
'అమెరికాను ఒబామా ప్రేమించడం లేదు'
వాషింగ్టన్:అగ్రరాజ్యం అమెరికాలో అప్పుడే రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. త్వరలో అమెరికాలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను రిపబ్లికన్ పార్టీ టార్గెట్ చేసింది. అసలు బరాక్ ఒబామా అమెరికాను ప్రేమించడం లేదని న్యూయార్క్ మాజీ మేయర్ రూడీ గిలియానీ విమర్శలు గుప్పించారు. బరాక్ ఒబామా అమెరికాను ప్రేమించడం లేదని చెప్పడం కఠినంగా అనిపించినా.. ఇది వాస్తమని గిలియానీ అన్నారు. మన్ హట్టన్ లో ఓ కార్యక్రమానికి నిధుల సమీకరణకు హాజరైన గిలియానీ.. ఒబామాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బరాక్ ఒబామా అమెరికాను ప్రేమిస్తున్నారా? అనేది మనకు ఎవరికీ తెలియకపోవచ్చు.. కానీ ఆయన ముఖంలో దేశంపై ప్రేమ లేదనేది స్పష్టంగా కనబడుతోందన్నారు. 'నేను ఒబామా ముఖ కవలికల్ని బట్టి ఆయనకు దేశంపై ప్రేమ లేదనేది చెబుతున్నాను. ఆయన మనసులో ఏముందో నాకు తెలియదు. ఆయన మిమ్మల్నీ ప్రేమించడం లేదు. నన్ను కూడా ప్రేమించడం లేదు' అని మాజీ మేయర్ విమర్శనాస్త్రాలు సంధించారు.