రెక్కవిప్పిన స్వేచ్ఛా పతాక
కొత్త కోణం
ఏర్పడబోయే పౌర ప్రజాస్వామిక ప్రభుత్వం సైనిక పాలకులు విధించే పలు పరిమితులకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది. ఒక సంపూర్ణ, స్వతంత్ర ప్రజాస్వామ్య దేశంగా మయన్మార్ ఆవిర్భవించడానికి ప్రస్తుత విజయం తొలిమెట్టు మాత్రమే. ఏర్పడబోయే పౌర ప్రభుత్వం సైన్యంతో రాజీలకు సిద్ధపడుతూనే అన్ని వర్గాల ప్రజలను సంతృప్తి పరచాల్సి ఉంటుంది. జీవితాన్నే పోరాటంగా నిర్వచించుకున్న సూచీ ఈ కత్తి మీద సామును నిబ్బరంగా నిర్వహిస్తూ నూతన ప్రభుత్వాన్ని నడిపించగలరని ఆశించవచ్చు.
ఉవ్వెత్తున ఎగిసిపడే ప్రజాపోరాటాలకు తోడు నిరంతరం కొనసాగే నిలకడ గలిగిన ఉద్యమం, ఆ ఉద్యమాన్ని తుదకంటా కొనసాగించగల నిఖార్సైన నాయకత్వం ఉంటే ఏ ఉద్యమం అయినా విజయం సాధిస్తుందనడానికి మయన్మార్ ప్రజాస్వామిక ఉద్యమమే రుజువు. మయన్మార్ ప్రజాస్వామిక ఆకాంక్షలకు నిలువెత్తు ప్రతిబింబం ఓ బక్కపలుచని స్త్రీ. దశాబ్దాల నిరంకుశ సైనిక పాలనను, నిర్బంధాన్ని ఎదురొడ్డి నిలిచిన ఆమె పేరే ఆంగ్‌సాన్ సూచీ. అత్యంత శాంతియుతంగా, అంతులేని విశ్వాసంతో ఆమె నడిపిన అలుపెరు గని పోరాటం ఈ రోజు మయన్మార్ ప్రజల ప్రజాస్వామిక కాంక్షకు తుది రూపం ఇచ్చింది.
ఒకప్పుడు బర్మాగా పిలిచిన మయన్మార్ 1948లో బ్రిటిష్ వలస పాలన నుంచి స్వాతంత్య్రాన్ని పొందింది. అయితే 1962 సైనిక తిరుగుబాటుతో నియంతృత్వ పాలన మొదలైంది. సైనిక ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలన్నింటినీ నిషేధించి, ప్రజలను, ప్రజాస్వామ్య పౌరహక్కులను అత్యంత పాశవికంగా అణచివేసింది. సైనిక నియంతృత్వానికి వ్యతిరేకంగా కార్మికులు, విద్యార్థులు, బౌద్ధమత సంఘాలు ఉద్యమించాయి. నియంతృత్వ ప్రభుత్వం నిర్బంధంతో ఆ ఉద్యమాలను అణచడానికి ప్రయత్నించింది. దీంతో అది సుప్రసిద్ధమైన ‘నాలుగు ఎనిమిదుల’ ఉద్యమంగా మారింది. అది మయన్మార్ ప్రజల ప్రజా స్వామిక పోరాటానికి నిర్మాణ రూపమిచ్చిన 1988 ఆగస్టు 8. యాంగాన్, మండాలే నగరాలలో విద్యార్థులు వేలాదిగా వీధుల్లోకి వచ్చి సైనిక ప్రభుత్వా నికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ప్రతిఘటనా పోరాటానికి పిలుపునిచ్చారు. ఈ దశలోనే మయన్మార్ జాతిపితగా పరిగణించే ఆంగ్‌సాన్ కూతురు ఆంగ్‌సాన్ సూచీ ఈ ప్రజాస్వామ్య పోరాటంలోకి అడుగుపెట్టారు.
అచంచల విశ్వాసంతోనే విజయం
సెప్టెంబర్ 27, 1988న నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్‌ఎల్‌డీ) అనే పార్టీని స్థాపించారు. బుద్ధుడి బోధనలు, గాంధీ అహింసా సిద్ధాంతం తనకు ఆదర్శ మని ఆమె ప్రకటించుకున్నారు. సూచీ నాయకత్వంలోని ప్రజాస్వామ్య పోరా టాలకు భయపడిన ప్రభుత్వం 1989న ఆమెకు గృహ నిర్బంధం విధించింది. అది మొదలు ఆమె జీవితం జైళ్లు, గృహనిర్బంధాల్లోనే చాలాకాలం సాగింది. మరోవంక సైనిక నియంతృత్వ పాలన పట్ల ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. ప్రజాస్వామ్యం పట్ల ఉన్న అచంచలమైన విశ్వాసమే సూచీని ఉద్యమం వైపు నడిపించింది. ఆమెను గృహనిర్బంధంలోనే ఉంచి 1990లో సైనిక ప్రభుత్వం సాధారణ ఎన్నికలు నిర్వహించింది.
అయినా ఆమె నాయకత్వంలోని ఎన్‌ఎల్‌డీకి 59 శాతం ఓట్లు పోలయ్యాయి. అంటే 80 శాతం సీట్లు వచ్చే అవకాశం ఉండింది. సూచీ ప్రధాన మంత్రి కావలసింది. కానీ సైనిక ప్రభుత్వం ఆ ఎన్నికలను గుర్తించలేదు. ఫలితాలను ప్రకటించకుండా ఆపివేసింది. రెండోసారి సూచీని గృహ నిర్బంధానికి పంపారు. ఆ సమ యంలోనే ఆమెకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. దాన్ని ఆమె తరఫున ఆమె కొడుకులు అందుకోవాల్సి వచ్చింది. 1995 జూలైలో సూచీని గృహ నిర్బంధం నుంచి విడుదల చే శారు. కానీ 1996లో 200 మంది సాయుధులు ఆమె కాన్వాయ్‌పై దాడిచేసి ఆమెను హతమార్చే యత్నం చేశారు. దీన్ని సాకుగా చూపి సైనిక ప్రభుత్వం మళ్ళీ సూచీని గృహ నిర్బంధానికి పంపింది. అయినా ఆమె మాత్రం చెక్కు చెదరలేదు. ఆమె విశ్వాసం ఇసుమంతైనా తగ్గుముఖం పట్టలేదు.
ప్రజా ఉద్యమాల వెల్లువకు తోడు, అంతర్జాతీయ ఒత్తిడులకు తలొగ్గి సైనిక ప్రభుత్వం ప్రజాస్వామ్య సంస్కరణలను ప్రారంభించింది. 2010 నవంబర్ 13న బర్మా ప్రభుత్వం మరొకసారి ఆంగ్‌సాన్ సూచీని గృహ నిర్బంధం నుంచి విడుదల చేసింది. అయితే పౌర ప్రభుత్వం సైనిక ఆధి పత్యం కొనసాగేలా 2008లో తయారు చేసిన రాజ్యాంగాన్ని మార్చడానికి మాత్రం అంగీకరించలేదు. 2012 ఉప ఎన్నికల్లో పాల్గొన్న ఎన్‌ఎల్‌డీ 45 స్థానాలకు 43 స్థానాలను గెలుచుకుంది. సూచీ మొదటిసారిగా పార్లమెంటు లోకి అడుగుపెట్టింది. ఐరాస సహా ప్రపంచ దేశాలు స్వేచ్ఛగా ఎన్నికలు జరపాలని, ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడాలని సైనిక ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి. ఫలితంగానే తాజా ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఎన్‌ఎల్‌డీ ఘన విజయాన్ని సాధించడంతో సైన్యం కనుసన్నల్లోని ప్రభుత్వం నూతన ప్రజాస్వామ్య ప్రభుత్వానికి అధికారం బదలాయించాల్సివస్తోంది.
పరిమితులు, సవాళ్లు
సూచీకి, ఎన్‌ఎల్‌డీకి అనుకూలంగా ప్రజలు తిరుగులేని విధంగా తీర్పు చెప్పినా, ఏర్పడబోయే ప్రజాస్వామిక ప్రభుత్వం అనేక పరిమితులకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్య సంస్కరణలకు ముందే సైనిక నేతలు తమకు అనుకూలమైన రాజ్యాంగాన్ని రచించి 2010 నుంచి అమల్లోకి తెచ్చారు. ప్రత్యేకించి ఆర్టికల్ 20 (బి), (ఇ), (ఎఫ్) రక్షణ వ్యవహారాలపై, సైన్యంపై పౌర ప్రభుత్వానికి ఎలాంటి అజమాయిషీ లేని స్వతంత్ర ప్రతి పత్తిని ఇచ్చాయి. సైన్యం కోరుకుంటే ఏ అంశాన్నయినా ‘రక్షణ వ్యవహారాల’ పరిధిలోకి తేగలుగుతుంది. అంతేకాదు, రాజ్యాంగాన్ని, ప్రత్యేకించి ఆర్టికల్ 20కి చెప్పే భాష్యాన్ని పరిరక్షించే కర్తవ్యాన్ని ఆ రాజ్యాంగం సైన్యం చేతుల్లోనే ఉంచింది. పౌర ప్రజాస్వామిక ప్రభుత్వం సైనిక పాలకులు విధించే పలు షరతులకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది. అంతేకాదు, పార్లమెంటులో ఏ ఎన్నికా లేకుండా సైన్యం నియమించే 25 శాతం మంది సభ్యుల ‘ప్రతిపక్షం’ విసిరే సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరోవంక అంతర్జాతీయ స్థాయి మానవతావాద సంక్షోభంగా మారిన రోహింగియా ముస్లింల పట్ల వివక్ష, అణచివేత సమస్య కొత్త ప్రభుత్వానికి సవాలుగా మారనుంది.
బౌద్ధ మత నేతలు తమకు వ్యతిరేకం కాకుండా ఉండటం కోసం సూచీ ఒక ఎన్నికల ఎత్తుగడగా ఒక్క ముస్లింను కూడా అభ్యర్థిగా నిలపలేదు. ఎన్నికల తర్వాత కూడా ఆమె, కొత్త ప్రభుత్వం తమ ఆకాంక్షలకు అనుగు ణంగా నడుచుకుంటారని వారు ఆశిస్తున్నారు. కాబట్టి రొహింగియాలు సహా దేశంలో రగులుతున్న అనేక జాతుల సమస్యల పరిష్కారం దిశగా ప్రజా స్వామ్య ప్రభుత్వం చేపట్టే ప్రతి చర్యకూ వారి నుంచి సవాళ్లు తప్పవు. విదేశస్తుడ్ని పెళ్లి చేసుకున్న కారణంగా సూచీ రాజ్యంగ రీత్యా అధ్యక్ష పదవికి అనర్హురాలు. అయినా ఆమె ప్రభుత్వంలో నిర్ణాయక శక్తిగా ఉంటారు. ఒక సంపూర్ణ, స్వతంత్ర ప్రజాస్వామ్య దేశంగా మయన్మార్ ఆవిర్భవించడానికి ప్రస్తుత విజయం తొలిమెట్టు మాత్రమే. ఏర్పడబోయే పౌర ప్రభుత్వం పలు పరిమితులు, రాజీలతోనే అన్నివర్గాల ప్రజల అభీష్టాలను సంతృప్తిపరచాల్సి వస్తుంది. జీవితాన్నే పోరాటంగా నిర్వచించుకున్న సూచీ ఈ కత్తి మీద సామును నిబ్బరంగా నిర్వహించగలరని ఆశించవచ్చు.
రాజకీయ ప్రజాస్వామ్యం చాలదు
గత రెండువందల ఏళ్ళకుపైగా ప్రపంచ ప్రజలు జరుపుతున్న ప్రజాస్వామ్య పోరాటాలలో మయన్మార్ కూడా ఒక భాగం. అమెరికన్ ప్రొఫెసర్ హంటింగ్ టన్ నేటి పోరాటాలను మూడవ దశ ప్రజాస్వామ్య ఉప్పెనగా పేర్కొన్నారు. మొదటిదశ ప్రజాస్వామ్య వ్యవస్థల నిర్మాణం 1820లో అమెరికాలో ప్రారంభమై 1926 వరకు కొనసాగింది. రెండవ దశ, రెండవ ప్రపంచ యుద్ధానంతరం మొదలై 1962 వరకు సాగింది. కాగా 1990 నుంచి ఇంకా సాగుతున్న మూడవ దశ ప్రజాస్వామ్య ఉద్యమాన్ని మనం చూస్తు న్నాం.
లాటిన్ అమెరికా, మధ్య ఆసియా తూర్పు ఆఫ్రికా దేశాలలో సాగిన, సాగుతున్న ఉద్యమాలు దీనిలో భాగమే. బ్రెజిల్, వెనిజులా, బొలీవియా, పెరుగ్వే, అర్జెంటీనా, చిలీ, ఈక్వెడార్, నికరాగ్వా, ఉరుగ్వే లాంటి లాటిన్ అమెరికన్ దేశాలు నియంతృత్వాల నుంచి బయటపడి ప్రజాస్వామ్యం బాట పట్టాయి. మధ్య ఆసియా, తూర్పు ఆఫ్రికా దేశాలైన ఈజిప్ట్, ట్యునీషియా, అల్జీరియా, లిబియా లాంటి దేశాలు ప్రజాస్వామ్య పోరాటాల్లోకి అడుగు పెట్టాయి. 167 దేశాల ప్రజాస్వామ్య వ్యవస్థల తీరుతెన్నులపై 2014లో ‘ది ఎకనామిస్ట్’ పత్రిక నిర్వహించిన అధ్యయనం వీటిని నాలుగు రకాలుగా విభజించింది. వాటిలో పూర్తిస్థాయి ప్రజాస్వామ్య వ్యవస్థలు 24 మాత్రమే నని, 27వదిగా ఉన్న భారత్‌లో పూర్తిస్థాయి ప్రజాస్వామ్యవ్యవస్థ లేదని ఆ అధ్యయనం తెలిపింది. లోపాలతో కూడిన ప్రజాస్వామ్యాలు 52 కాగా, అస్థిరంగా ఉన్నవి 39 అని పేర్కొంది. కాగా ఇప్పటికీ రాచరిక, సైనిక, కార్మిక వర్గ నియంతృత్వాల కిందనే ఉన్నాయి.
ఎన్నికల ద్వారా ఏర్పడే ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రాథమికమైనదే. కానీ అది పూర్తి స్థాయి ప్రజాస్వామ్యం కాదు. రాజకీయ రంగంతో పాటు ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాలలో కూడా పూర్తి స్థాయి ప్రజాస్వామ్యం అమలైతేనే అది సమగ్రమవుతుంది. ప్రజాస్వామ్యం వైపు తొలి అడుగులు వేస్తూనే మయన్మార్ ప్రజలు సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రజాస్వామ్యం కోసం మరో పోరాటానికి సిద్ధం కావాల్సి ఉంటుందనేది చారిత్రక సత్యం.
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు : మల్లెపల్లి లక్ష్మయ్య, మొబైల్: 97055 66213