నిరంతర అప్రమత్తత కొరవడితే ప్రజాస్వామ్యం క్రమేపీ కొడిగట్టడం ఖాయమని గ్రహించనిచోట చివరకు నియంతలదే పైచేయి అవుతుంది. వర్తమాన మయన్మార్ ప్రపంచానికి చాటిచెబుతున్న పాఠం అదే. తన జీవితంలో ఇప్పటికే పదిహేనేళ్లపాటు చెరసాలలో గడిపిన సీనియర్ నేత, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత ఆంగ్ సాన్ సూకీపై రెండు నాసిరకం ఆరోపణల ఆధారంగా నడిచిన కేసులో సైనిక న్యాయస్థానం సోమవారం నాలుగేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చిన వైనం అక్కడి సైనిక పాలకుల పోకడలు తెలిసినవారికి ఆశ్చర్యం కలిగించలేదు. తీర్పు వెలువడిన వెంటనే ఆ శిక్షను రెండేళ్లకు తగ్గిస్తున్నట్టు సైన్యం ఉదారత ప్రకటించడం దాని నయవంచనకు నిదర్శనం. ఆమెపై మరో తొమ్మిది అభియోగాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ కేసుల్లో కూడా ‘విచారణ’ పూర్తయితే ఆమెకు మొత్తం 102 ఏళ్ల వరకూ శిక్ష పడుతుందంటున్నారు! సూకీని గుర్తు తెలియని ప్రాంతంలో నిర్బంధించడం, ప్రత్యేక కోర్టు విచారణకు వేరెవరినీ అనుమతించకపోవడం, కేసు గురించి ఆమె న్యాయవాది బయటెక్కడా మాట్లాడకూడదని ఆంక్ష పెట్టడం సైనిక ముఠా దుర్మార్గానికి నిదర్శనం. ఆరు దశాబ్దాలుగా అక్కడ ప్రజాస్వామ్యాన్ని చెరబట్టిన సైనిక దుశ్శాసనులు అప్పుడప్పుడు తగ్గి నట్టు నటించడం, అదునుచూసి తమ వికృత రూపాన్ని ప్రదర్శించడం రివాజే. నిరుడు నవంబర్‌లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో వరసగా రెండోసారి కూడా ఆంగ్‌సాన్ సూకీ నాయకత్వంలోని నేష నల్ లీగ్ ఫర్ డెమాక్రసీ(ఎన్‌ఎల్‌డీ) విజయం సాధించడాన్ని చూసి కడుపుమండిన సైనిక ముఠా... మొన్న ఫిబ్రవరిలో ఉన్నట్టుండి ఆ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కుప్పకూల్చి అధికారాన్ని హస్త గతం చేసుకుంది. వాస్తవానికి ఇదంతా లాంఛనమే. అధికార పీఠాన్ని సైన్యం ఎప్పుడూ వదిలింది లేదు. పేరుకు ప్రజాస్వామ్య వ్యవస్థకు చోటిచ్చినట్టు కనబడినా తన హవా నడిచేందుకు అనువైన రాజ్యాంగాన్ని సైన్యం ముందే రాసిపెట్టుకుంది. పార్లమెంటులో తనకు 25 శాతం స్థానాలు రిజర్వ్ చేసుకుంది. ఆ స్థానాలకు ప్రతినిధులను తానే నామినేట్ చేస్తుంది. మిగిలిన 75 శాతం స్థానాలకు జరిగే ఎన్నికల్లో సైతం కీలుబొమ్మ పార్టీలను నించోబెట్టి తమ పలుకుపడికి ప్రమాదం రాకుండా చూసుకోవడం మొదటినుంచీ సైనిక పాలకులకు అలవాటైన విద్య. కానీ 2020 ఎన్నికల్లో కీలుబొమ్మ పార్టీ అయిన యూనియన్ సాలిడారిటీ అండ్ డెవెలప్‌మెంట్ పార్టీ(యూఎన్‌డీపీ)కి కేవలం 25 స్థానాలే లభించేసరికి సైన్యానికి దిక్కుతోచలేదు. ఈ మెజారిటీతో సూకీ రాజ్యాంగాన్ని మార్చేస్తారని రూఢీ చేసుకుని మళ్లీ అది పంజా విసిరింది.
సైనిక ముఠా రూపొందించిన రాజ్యాంగమంతటా కంతలే. విదేశీయుల్ని పెళ్లాడినా, విదేశాల్లో పుట్టిన పిల్లలున్నా అధ్యక్ష పీఠం అధిష్టించడానికి అనర్హులవుతారని అందులో ఉన్న ఒక నిబంధన కేవలం సూకీని దృష్టిలో పెట్టుకుని చేసిందే. అయితే 2015లో అధికారంలోకొచ్చిన తర్వాత సూకీ ఈ దొంగల రాజ్యాంగంపై పోరాడవలసింది. సైన్యం దురాలోచనను ఎండగట్టవలసింది. కానీ ఆమె రాజీపడ్డారు. దేశాధ్యక్ష పదవి దక్కకపోయినా సరిపెట్టుకుని వెనకుండి పాలనను పర్యవేక్షించారు. కీలకమైన ఆంతరంగిక భద్రత, రక్షణ శాఖలను సైన్యం తన చేతుల్లో పెట్టుకున్నా అదేమని ప్రశ్నిం చిన పాపాన పోలేదు. సైన్యం ఆగడాలు అంతకంతకు మితిమీరుతున్నా చూసీచూడనట్టు మిన్న కుండిపోయారు. చివరకు దేశ పౌరుల్లో భాగమైన రోహింగ్యాలపై జాత్యహంకార బుద్ధిస్టులతో ఏకమై సైన్యం దమనకాండకు దిగినా ఖండించడానికి సూకీ ముందుకు రాలేదు. సైనిక నియంత లపై నిలకడగా, నిబ్బరంగా శాంతియుత పోరాటాన్ని కొనసాగించి నోబెల్ శాంతి పురస్కారాన్ని అందుకున్న ధీరవనిత ఇలా మూగనోము పట్టడమేకాదు... ఆ తర్వాత అంతర్జాతీయ వేదికలపై వారిని సమర్థిస్తూ మాట్లాడిన తీరుకు ప్రపంచ ప్రజానీకం విస్తుపోయింది. నిజానికి ఆమె ఇంటా బయటా కూడా ఒంటరి కాదు. ఆమెకు దేశ ప్రజానీకంలోనూ మద్దతుంది. విదేశాల్లోనూ ఆదరణ ఉంది. కానీ ఆమె దాన్ని కాపాడుకోలేకపోయారు. ప్రజాస్వామ్యం కోసం జనం సాగించిన పోరాటం కేవలం సూకీని అధికార పీఠంపై ప్రతిష్టించడానికి కాదు... వ్యవస్థలన్నిటినీ చెరబట్టిన సైనిక ముఠాను గద్దెదించి, మానవ, పౌరహక్కులనూ సాధించుకోవడానికి. సకలరంగాల్లోనూ ప్రజా స్వామ్య సంస్కృతిని పునఃప్రతిష్టించడానికి. వాటి సాధనకై ఉద్యమానికి నాయకత్వం వహించ డంలో, ప్రజలను చైతన్యవంతం చేయడంలో అధికారంలోకొచ్చాక సూకీ విఫలమయ్యారు. తాను రాజీపడితే సైన్యం కూడా ఒక మెట్టు దిగుతుందనుకున్నారు. అది అడియాసే అయింది.
చెప్పుకోదగ్గ నాయకత్వం లేకున్నా మయన్మార్ విద్యార్థులు, యువజనులు మొక్కవోని దీక్షతో పోరాడుతున్నారు. వివిధ సందర్భాల్లో గత ఎనిమిది నెలలుగా 1,300మంది ప్రాణాలు తీసినా వారు వెనక్కు తగ్గటంలేదు. ఐక్యరాజ్యసమితివంటి అంతర్జాతీయ సంస్థలు, అమెరికా తదితర దేశాలు మాటల్లో సైనిక పాలకులను ఖండిస్తున్నా చేతల్లో చూపిస్తున్నదేమీ లేదు. చైనా సరేసరి. దానికి లాభార్జన మినహా ఏదీ పట్టదు. అక్కడి పాలకులను వ్యతిరేకిస్తే ఈశాన్య భారత్‌లో తిరుగుబాటు దార్ల ఆటకట్టించడం అసాధ్యమవుతుందని మన ప్రభుత్వం భావిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ ప్రజానీకం మయన్మార్‌కు నైతిక మద్దతునీయాలి. అక్కడి ప్రజాస్వామ్య ఉద్యమానికి చేయూతనందించాలని ఎక్కడికక్కడ ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలి. అప్పుడు మాత్రమే మయన్మార్ పాలకులు దిగివస్తారు.
Comments
Please login to add a commentAdd a comment