దేశంలో దశాబ్దాలపాటు సాగిన సైనిక పాలనకు మయన్మార్ లో తెరపడి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది.
నేపిదా: దేశంలో దశాబ్దాలపాటు సాగిన సైనిక పాలనకు మయన్మార్ లో తెరపడి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది. అయితే సైనిక రాజ్యాంగం నిబంధనల వల్ల ఆంగ్ సాన్ సూచీ అధ్యక్ష పదవికి అనర్హురాలయ్యారన్న విషయం తెలిసిందే. 1962 తర్వాత మయన్మార్ కొత్త అధ్యక్షుడిగా ఆంగ్ సాన్ సూచీ ప్రధాన అనుచరుడు, గతంలో ఆమెకు డ్రైవర్‌గా పని చేసిన టిన్ క్వా(69) ఎన్నికయ్యారు. నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ (ఎన్‌ఎల్‌డీ) అధినేత్రి, ఉద్యమ నాయకురాలు ఆంగ్ సాన్ నూతన ప్రభుత్వంలో ఏ పదవి స్వీకరిస్తారన్న దానిపై అక్కడ చర్చ జరగుతుంది. ఆమె విదేశాంగశాఖ మంత్రిగా బాధ్యతలు చేపడతారని ఎన్ఎల్డీ పార్టీ అధికార ప్రతినిధి జా మింట్ మాంగ్ పేర్కొన్నారు.
ఆరుగురు క్యాబినెట్ సభ్యుల పేర్లను స్పీకర్ ఎదుట ప్రకటించారు. అయితే ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఎవరికి ఏ శాఖ దక్కుతుందో చెప్పలేము, కానీ ఆమెకు విదేశాంగశాఖ అప్పగిస్తే ఇతర మంత్రులతో కలిసి బాధ్యతలు నిర్వహించేందుకు వీలుగా ఉంటుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. సైనిక మద్దతుగల ప్రస్తుత అధ్యక్షుడు థీన్ సేన్ స్థానంలో(పదవీకాలం ముగియడంతో) క్వా ఈ నెల 30న అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్నారు. అనంతరం ఆంగ్ సాన్ సూచీ ఏ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారో తెలుస్తుంది.