సూచీతో టిన్ క్వా
నేపిదా(మయన్మార్): అధికార నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీ నాయకురాలు ఆంగ్ సాన్ సూచీ తన మాజీ డ్రైవర్, ప్రధాన అనుచరుడు టిన్ క్వా(69)ను మయన్మార్ అధ్యక్ష అభ్యర్థిగా ప్రతిపాదించారు. ఆర్మీ కొత్త రాజ్యాంగం వల్ల అధ్యక్షురాలయ్యే అవకాశం కోల్పోయిన సూచీ పరోక్షంగా ఆ బాధ్యతలు చూసుకోనున్నారు. టిన్, సూచీ కలిసి చదువుకోవడమేకాక, చారిటబుల్ సంస్థ నిర్వహణలో ఆమెకు సహకారం అందిస్తున్నాడు. గతేడాది నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఆమె నేతృత్వంలోని ఎన్‌ఎల్‌డీ భారీ విజయం సాధించింది. తాత్కాలిక అధ్యక్షుడు యుతియిన్ పదవీకాలం మార్చి 30తో ముగుస్తుంది.
ఆర్మీ రాజ్యాంగంతో అధ్యక్ష పదవికి దూరం
సూచీ అధ్యక్షురాలు అవకుండా అడ్డుకునే లక్ష్యంతో ఆర్మీ కొత్త రాజ్యాంగాన్ని రూపొందించింది. దీని ప్రకారం... అత్యున్నత పదవి చేపట్టే వ్యక్తి విదేశీయుల్ని పెళ్లి చేసుకోకూడదు. విదేశీ పౌరసత్వం ఉన్న పిల్లలు ఉండకూడదు. సూచీ భర్త మైఖేల్ అరిస్ బ్రిటిషర్. వీరి పిల్లలకు బ్రిటన్ పౌరసత్వం ఉంది. దాంతో సూచీ అధ్యక్షురాలయ్యేందుకు అడ్డంకులు ఏర్పడ్డాయి. అయితే సూచీ ఎలాగైనా అధ్యక్ష పదవి చేపడుతుందనే ఆలోచనతో ఉన్న చాలామందికి నిరాశ తప్పలేదు. న్యాయపరమైన అడ్డంకుల్ని తొలగించేందుకు సైన్యంతో కొన్ని నెలలుగా సాగుతున్న చర్చలు విఫలమయ్యాయి.