Tin Q
-
అధినేత్రి ఏ మంత్రిత్వశాఖ తీసుకుంటారు..?
నేపిదా: దేశంలో దశాబ్దాలపాటు సాగిన సైనిక పాలనకు మయన్మార్ లో తెరపడి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది. అయితే సైనిక రాజ్యాంగం నిబంధనల వల్ల ఆంగ్ సాన్ సూచీ అధ్యక్ష పదవికి అనర్హురాలయ్యారన్న విషయం తెలిసిందే. 1962 తర్వాత మయన్మార్ కొత్త అధ్యక్షుడిగా ఆంగ్ సాన్ సూచీ ప్రధాన అనుచరుడు, గతంలో ఆమెకు డ్రైవర్గా పని చేసిన టిన్ క్వా(69) ఎన్నికయ్యారు. నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ (ఎన్ఎల్డీ) అధినేత్రి, ఉద్యమ నాయకురాలు ఆంగ్ సాన్ నూతన ప్రభుత్వంలో ఏ పదవి స్వీకరిస్తారన్న దానిపై అక్కడ చర్చ జరగుతుంది. ఆమె విదేశాంగశాఖ మంత్రిగా బాధ్యతలు చేపడతారని ఎన్ఎల్డీ పార్టీ అధికార ప్రతినిధి జా మింట్ మాంగ్ పేర్కొన్నారు. ఆరుగురు క్యాబినెట్ సభ్యుల పేర్లను స్పీకర్ ఎదుట ప్రకటించారు. అయితే ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఎవరికి ఏ శాఖ దక్కుతుందో చెప్పలేము, కానీ ఆమెకు విదేశాంగశాఖ అప్పగిస్తే ఇతర మంత్రులతో కలిసి బాధ్యతలు నిర్వహించేందుకు వీలుగా ఉంటుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. సైనిక మద్దతుగల ప్రస్తుత అధ్యక్షుడు థీన్ సేన్ స్థానంలో(పదవీకాలం ముగియడంతో) క్వా ఈ నెల 30న అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్నారు. అనంతరం ఆంగ్ సాన్ సూచీ ఏ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారో తెలుస్తుంది. -
సూచీ విధేయుడికే అందలం
మయన్మార్ కొత్త అధ్యక్షుడిగా టిన్ క్వా ఎన్నిక ♦ 1962 తర్వాత అధ్యక్ష పీఠంపై తొలిసారి సాధారణ పౌరుడు నేపిదా: మయన్మార్లో చరిత్రాత్మక అధ్యాయం ఆవిష్కృతమైంది. దేశంలో దశాబ్దాలపాటు సాగిన సైనిక పాలనకు తెరపడింది. 1962 తర్వాత దేశ తొలి పౌర అధ్యక్షుడిని పార్లమెంటు (దిగువసభ) ఎన్నుకుంది. మయన్మార్ కొత్త అధ్యక్షుడిగా ఆంగ్ సాన్ సూచీ ప్రధాన అనుచరుడు, గతంలో ఆమెకు డ్రైవర్గా పని చేసిన టిన్ క్వా(69) ఎన్నికయ్యారు. పోలైన 652 ఓట్లలో క్వా 360 ఓట్లు సాధించారు. ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సైనిక మద్దతుగల రిటైర్డ్ జనరల్ మింత్ స్వే(213 ఓట్లు), చిన్ ప్రాంత ఎంపీ హెన్రీ వాన్ థియో (79 ఓట్లు) సంయుక్తంగా దేశ ఉపాధ్యక్షులుగా వ్యవహరించనున్నారు. ఫలితంపై ఎంపీలంతా పెద్దపెట్టున హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. అనంతరం క్వా మీడియాతో మాట్లాడుతూ ‘ఇది సోదరి ఆంగ్ సాన్ సూచీ విజయం’’అని అన్నారు. సైనిక మద్దతుగల ప్రస్తుత అధ్యక్షుడు థీన్ సేన్ స్థానంలో(పదవీకాలం ముగియడంతో) క్వా ఈ నెల 30న అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్నారు. ఆర్మీ కొత్త రాజ్యాగం వల్ల అధ్యక్షురాలయ్యే అవకాశం కోల్పోయిన సూచీ.. క్వా ఎన్నికతో పరోక్షంగా ఆ బాధ్యతల్ని చేపట్టేందుకు మార్గం సుగమమైంది. నవంబర్నాటి పార్లమెంటు ఎన్నికల్లో సూచీ పార్టీ నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ (ఎన్ఎల్డీ) ఘన విజయం సాధించిది. అయితే సైన్యం గతంలో మార్చిన రాజ్యాంగ నిబంధనల వల్ల అధ్యక్ష పదవికి అనర్హురాలయ్యారు. అధ్యక్ష పగ్గాలు చేపట్టే వ్యక్తి విదేశీయుల్ని పెళ్లి చేసుకొని ఉండరాదు. అలాగే ఆ వ్యక్తికి విదేశీ పౌరసత్వం ఉన్న పిల్లలు ఉండకూడదు. సూచీ భర్త మైఖేల్ బ్రిటిషర్ కావడం, ఆమె ఇద్దరు పిల్లలకు బ్రిటన్ పౌరసత్వం ఉండటంతో అధ్యక్షురాలయ్యేందుకు అనర్హురాలయ్యారు. తనకు నమ్మకస్తుడైన వ్యక్తిని దేశాధ్యక్ష పీఠంపై కోర్చోబెట్టి అతని ద్వారా పరోక్షంగా పాలన సాగిస్తానని సూచీ గతంలోనే ప్రకటించారు. క్వాకు భారత ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. -
మయన్మార్ అధ్యక్షుడిగా మాజీ కారు డ్రైవర్
నేపిదా: మయన్మార్ అధ్యక్షుడిగా నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీ నాయకురాలు ఆంగ్ సాన్ సూచీ మాజీ డ్రైవర్, ప్రధాన అనుచరుడు టిన్ క్వా(69) ఎన్నికయ్యారు. మంగళవారం మయన్మార్ పార్లమెంట్ అధ్యక్షుడిగా టిన్ క్వాను ఎన్నుకుంది. ఆర్మీ కొత్త రాజ్యాంగం వల్ల సూచీ అధ్యక్షురాలయ్యే అవకాశం కోల్పోవడంతో టిన్ క్వాను అధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. టిన్, సూచీతో కలిసి చదువుకున్నారు. చారిటబుల్ సంస్థ నిర్వహణలో ఆమెకు సహకారం అందిస్తున్నాడు. గతేడాది నవంబర్లో జరిగిన ఎన్నికల్లో సూచీ నేతృత్వంలోని ఎన్ఎల్డీ భారీ విజయం సాధించింది. -
మయన్మార్ అధ్యక్ష రేసులో సూచీ డ్రైవర్
నేపిదా(మయన్మార్): అధికార నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీ నాయకురాలు ఆంగ్ సాన్ సూచీ తన మాజీ డ్రైవర్, ప్రధాన అనుచరుడు టిన్ క్వా(69)ను మయన్మార్ అధ్యక్ష అభ్యర్థిగా ప్రతిపాదించారు. ఆర్మీ కొత్త రాజ్యాంగం వల్ల అధ్యక్షురాలయ్యే అవకాశం కోల్పోయిన సూచీ పరోక్షంగా ఆ బాధ్యతలు చూసుకోనున్నారు. టిన్, సూచీ కలిసి చదువుకోవడమేకాక, చారిటబుల్ సంస్థ నిర్వహణలో ఆమెకు సహకారం అందిస్తున్నాడు. గతేడాది నవంబర్లో జరిగిన ఎన్నికల్లో ఆమె నేతృత్వంలోని ఎన్ఎల్డీ భారీ విజయం సాధించింది. తాత్కాలిక అధ్యక్షుడు యుతియిన్ పదవీకాలం మార్చి 30తో ముగుస్తుంది. ఆర్మీ రాజ్యాంగంతో అధ్యక్ష పదవికి దూరం సూచీ అధ్యక్షురాలు అవకుండా అడ్డుకునే లక్ష్యంతో ఆర్మీ కొత్త రాజ్యాంగాన్ని రూపొందించింది. దీని ప్రకారం... అత్యున్నత పదవి చేపట్టే వ్యక్తి విదేశీయుల్ని పెళ్లి చేసుకోకూడదు. విదేశీ పౌరసత్వం ఉన్న పిల్లలు ఉండకూడదు. సూచీ భర్త మైఖేల్ అరిస్ బ్రిటిషర్. వీరి పిల్లలకు బ్రిటన్ పౌరసత్వం ఉంది. దాంతో సూచీ అధ్యక్షురాలయ్యేందుకు అడ్డంకులు ఏర్పడ్డాయి. అయితే సూచీ ఎలాగైనా అధ్యక్ష పదవి చేపడుతుందనే ఆలోచనతో ఉన్న చాలామందికి నిరాశ తప్పలేదు. న్యాయపరమైన అడ్డంకుల్ని తొలగించేందుకు సైన్యంతో కొన్ని నెలలుగా సాగుతున్న చర్చలు విఫలమయ్యాయి.