చీకట్లో వెలుగురేఖ.. సూచీ | Aung San Suu Kyi Education in delhi ? | Sakshi
Sakshi News home page

చీకట్లో వెలుగురేఖ.. సూచీ

Published Wed, Nov 11 2015 12:39 AM | Last Updated on Sun, Sep 3 2017 12:20 PM

చీకట్లో వెలుగురేఖ.. సూచీ

చీకట్లో వెలుగురేఖ.. సూచీ

♦ ఢిల్లీలోనే సూచీ ప్రాథమిక, ఉన్నత విద్యాభ్యాసం
♦ గాంధీ అహింస, బుద్ధుని బోధనలే స్ఫూర్తి
♦ 15ఏళ్ల పాటు గృహ నిర్బంధం.. అయినా ప్రజాస్వామ్యమే లక్ష్యం
 
సాక్షి, సెంట్రల్ డెస్క్: అంగ్‌సాన్ సూచీ.. మయన్మార్(నాటి బర్మా) ప్రజలకు దశాబ్దాల చీకటి పాలనకు అంతం పలికే వెలుగురేఖ. దాదాపు అర్ధ శతాబ్దం దేశంలో నియంతృత్వ పాలన సాగించిన మిలటరీ పాలకులకు సింహస్వప్నం. దేశాన్ని ప్రజాస్వామ్య పాలన దిశగా తీసుకువెళ్లే మార్గదర్శి. మయన్మార్‌లో సంపూర్ణ ప్రజాస్వామ్యం కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న అంగ్‌సాన్ సూ చీ నేతృత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్‌ఎల్‌డీ) పార్టీ ఈ ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తున్న నేపథ్యంలో.. మయన్మార్ ప్రజల అమ్మ ‘మా చీ’పై కథనం.

 అంగ్‌సాన్ సూ చీ 1949 జూన్ 19న జన్మించారు. ఆమె తండ్రి అంగ్‌సాన్ స్వాతంత్య్ర సమర యోధుడు. బ్రిటిష్ వలస పాలన నుంచి బర్మా స్వాతంత్య్రం పొందేందుకు ప్రధాన కారకుడైన అంగ్‌సాన్‌ను బర్మా ప్రజలు జాతిపితగా భావిస్తారు. అయితే, దేశ స్వాతంత్య్రానికి కొద్ది నెలల ముందే ఆయన ప్రత్యర్థుల కాల్పుల్లో మరణించారు.

 అంగ్‌సాన్ సూచీ తల్లి ఖిన్ చీ భారత్, నేపాల్‌లలో బర్మా రాయబారిగా పనిచేశారు. దాంతో సూచీ ప్రాథమిక విద్యాభ్యాసం ఢిల్లీలోని కాన్వెంట్ ఆఫ్ జీసస్ అండ్ మేరీ పాఠశాలలో, కళాశాల చదువు ప్రఖ్యాత లేడీ శ్రీరామ్ కాలేజ్‌లో సాగింది. అనంతరం యూకేలోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఫిలాసఫీ, పాలిటిక్స్, ఎకనమిక్స్ చదివారు. ఆ తరువాత న్యూయార్క్‌లోని ఐరాస కార్యాలయంలో మూడేళ్లు పనిచేశారు. 1972లో భూటాన్‌లో నివసించే బ్రిటిషర్ అయిన మైఖేల్ ఏరిస్‌ను వివాహం చేసుకున్నారు. వారికి అలెగ్జాండర్, కిమ్ అనే ఇద్దరు పిల్లలు. 1999లో మైఖేల్ కేన్సర్‌తో చనిపోయారు.

1988లో సూచీ అనారోగ్యంతో ఉన్న తల్లిని చూసుకునేందుకు మయన్మార్ వెళ్లారు. అప్పుడే మయన్మార్‌లోని ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమంలో పాలుపంచుకోవడం ప్రారంభించారు. సూచీ మయన్మార్ వచ్చిన 1988వ సంవత్సరంలోనే అప్పటి సైనిక పాలకుడు నె విన్ పదవి నుంచి వైదొలగారు. ఆ రోజైన 8-8-88న దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య అనుకూల ప్రదర్శనలు జరిగాయి. అది 8888 తిరుగుబాటుగా ప్రసిద్ధి గాంచింది. ఆగస్ట్ 26న దాదాపు 5 లక్షలమంది ప్రజాస్వామ్య ఉద్యమకారులనుద్దేశించి ఆగస్ట్ 26న అంగ్‌సాన్ సూచీ ఉద్వేగ భరిత ప్రసంగం చేశారు. అయితే, ఆ తిరుగుబాటును మిలటరీ పాలకులు అణచేశారు. అనంతరం కొత్త సైనిక ప్రభుత్వం కొలువుదీరింది.

 ప్రజాస్వామ్య మయన్మార్ లక్ష్యంగా..
 గాంధీ అహింస, బుద్ధుని బోధనలతో స్ఫూర్తి పొందిన సూచీ అదే మార్గంలో దేశానికి సైనిక పాలన నుంచి విముక్తి కలిగించాలని ప్రతిన బూనారు. ప్రజాస్వామ్య మయన్మార్ లక్ష్యంగా 1988 సెప్టెంబర్ 27న ‘నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ’ అనే రాజకీయ పార్టీని స్థాపించారు. దాంతో సూచీని 1989 జూలైలో సైనిక పాలకులు గృహ నిర్బంధంలో ఉంచారు. ఆమెపై నిర్బంధాన్ని సైనిక పాలకులు తీవ్రం చేశారు. కేన్సర్‌తో బాధ పడ్తున్న ఆమె భర్త మైఖేల్ మయన్మార్ రావడానికి అనుమతి సైతం ఇవ్వలేదు. 2010 వరకు 15 ఏళ్ల పాటు ఆమె గృహ నిర్బంధంలోనే ఉన్నారు. అప్పుడప్పుడు ఐరాస, అంతర్జాతీయంగా వచ్చిన ఒత్తిళ్లతో ఆమెను విడుదల చేసి.. మళ్లీ ఏదో ఒక కారణంతో మళ్లీ నిర్బంధంలోకి తీసుకునేవారు. ఆమె 1989 నుంచి 1995 వరకు, 2000 నుంచి 2002 వరకు, 2003 నుంచి 2010 వరకు నిర్బంధంలో ఉన్నారు.

 1990లో మిలటరీ ప్రభుత్వం సాధారణ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఆ ఎన్నికల్లో సూచీ పార్టీ ఎన్‌ఎల్‌డీ 59% ఓట్లు, 80%పైగా సీట్లను గెలుచుకుంది. కానీ అధికారాన్ని అప్పగించేందుకు సైనిక పాలకులు అంగీకరించలేదు. ఆ తర్వాత నిర్బంధం మధ్యే ఆమె పార్టీ వ్యవహారాలను నిర్వహించారు. 1996లోనూ, ఆ తర్వాత 2003లోనూ ఆమెపై దాడులు జరిగాయి. వాటి నుంచి ఆమె సాహసోపేతంగా తప్పించుకున్నారు. అనంతరం అగ్ర రాజ్యాలు సహా అంతర్జాతీయ ఒత్తిడి మేరకు మిలటరీ పాలకులు రాజకీయ వ్యవస్థలో సంస్కరణలను ప్రారంభించారు. ముఖ్యంగా 2011లో కొత్త ప్రభుత్వం ఏర్పడి తర్వాత ఆ దిశగా ముందడుగేశారు. 2012లో 46 పార్లమెంటు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో సూ చీ పార్టీ 43 సీట్లు గెలుచుకుంది. సూ చీ ఎంపీ అయ్యారు. తాజాగా ఈ ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఎన్‌ఎల్‌డీ క్లీన్‌స్వీప్ దిశగా దూసుకెళ్తోంది.
 
 సూచీ పార్టీదే ‘మయన్మార్’
 యాంగూన్: మయన్మార్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజాస్వామ్య అనుకూల పార్టీ ‘నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ(ఎన్‌ఎల్‌డీ)’ ఘన విజయం దిశగా దూసుకెళ్తోంది. ఆదివారం జరిగిన ఎన్నికల్లో భారీ ఎత్తున ఓటింగ్‌లో పాల్గొన్న మయన్మార్ ప్రజలు.. ఎన్‌ఎల్‌డీకి తిరగులేని మెజారిటీ అందించారు. మంగళవారం మధ్యాహ్నం వరకు దిగువ సభకు సంబంధించి 88 స్థానాల ఫలితాలను ప్రకటించగా, వాటిలో 78 సీట్లను ఎన్‌ఎల్‌డీ కొల్లగొట్టింది. కేంద్ర పార్లమెంట్లో 75% సీట్లను సాధిస్తామని బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సూచీ విశ్వాసం వ్యక్తం చేశారు. ‘మా పార్టీ పూర్తిగా ఓడిపోయింది. ఎన్‌ఎల్‌డీ గెలిచింది. ఇది ఈ దేశ దౌర్భాగ్యం. ఏదేమైనా, వారికి మా శుభాకాంక్షలు’ అని అధికార యూఎస్‌డీపీ సీనియర్ నేత, మాజీ సైన్యాధికారి క్యు విన్ మంగళవారం వ్యాఖ్యానించారు.
 
 ఇదీ మయన్మార్ పార్లమెంట్
 భారత్‌లో మాదిరిగానే మయన్మార్ పార్లమెంటులోనూ ఉభయ సభలు ఉంటాయి. పార్లమెంటును కేంద్ర సభ (అసెంబ్లీ ఆఫ్ యూనియన్) లేదా ప్యిడాంగ్షు హ్లుట్టాగా వ్యవహరిస్తారు. జాతీయ రాజ్యాంగం ప్రకారం 2008లో కొత్త పార్లమెంటును ఏర్పాటు చేశారు. ప్రతి 14 పెద్ద పాలనా ప్రాంతాలు లేదా రాష్ట్రాలకు ఒకటి చొప్పున స్థానిక హ్లుట్టా (ప్రాంతీయ అసెంబ్లీ) లేదా రాష్ట్ర హ్లుట్టా ఉంటుంది. మయన్మార్ పార్లమెంటు ప్యిడాంగ్షు హ్లుట్టాలోని ఉభయ సభల్లో మొత్తం 664 మంది సభ్యులు ఉంటారు. మిగిలిన 25 శాతం (166) మందిని సైన్యాధ్యక్షుడు ఎంపిక చేస్తారు.

 అమ్యోతా హ్లుట్టా (ఎగువ సభ)
 వీటిలో మొత్తం 224 సీట్లు ఉండగా, 168 మంది ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నికవుతారు. 56 సీట్లను సైన్యం భర్తీ చేస్తుంది.

 ప్యీథూ హ్లుట్టా (దిగువసభ)
 ఇందులో మొత్తం 440 సీట్లు ఉంటాయి. 330 మందిని ప్రత్యక్ష ఎన్నికల ద్వారా, 110 మందిని సైన్యం భర్తీ చేస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement