మయన్మార్లో ప్రశాంతంగా పోలింగ్..
యాంగాన్: పాతికేళ్ల సైనిక పాలన నుంచి పరిపూర్ణ ప్రజాస్వామ్యం దిశగా పయనిస్తోన్న మయన్మార్ లో ఎన్నికల ప్రక్రియ నిరాటంకంగా సాగుతోంది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఆదివారం ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద జనసందడి కనిపించింది. ఈ ఎన్నికల్లో మయన్మార్ లో ప్రజాస్వామిక వ్యవస్థ కోసం ఏళ్లుగా పోరాటం చేస్తున్న అంగ్ సాన్ సూచీ నేతృత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీదే గెలుపనే భావన సర్వత్రా నెలకొంది. ప్రస్తుతం ఆ దేశంలో యూనియన్ సాలిడారిటీ డెవలప్ మెంట్ (యూఎస్ డీపీ) అధికారంలో ఉన్నప్పటికీ దానిని నడిపించేది మాత్రం సైనికశక్తే కావటం గమనార్హం.
రాజధాని నగరంలో తమ నివాసానికి దగ్గర్లోని పోలింగ్ కేంద్రానికి చేరుకున్న సూచీకి ఓటర్లు ఘనస్వాగతం పలికారు. ప్రజాస్వామ్యయుతంగా గెలిచిన పార్టీకి అదికార పగ్గాలిచ్చి తప్పుకుంటానని ప్రస్తుత అధ్యక్షుడు థేన్ సియాన్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో దాదాపు మూడు కోట్ల మంది ఓటింగ్ లో పాల్గొంటున్నారు. వీరిలో తొలిసారి ఓటు వేయబోతున్నవారి సంఖ్యే ఎక్కువ. 90 పార్టీలకు చెందిన 6 వేలమంది అభ్యర్థులు బరిలో తలపడుతున్న ఈ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడికానున్నాయి. పోలింగ్ పూర్తయిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని, సోమవారం ఉదయానికి విజేత ఎవరనేది తేలుతుందని ఎన్నికల అధికారులు చెప్పారు.