ఇటు ఉక్కు సంకల్పం.. అటు సైనిక బలం!
నేపీడా: దాదాపు 50 ఏళ్లపాటు సైనిక పాలనలో మగ్గిన మయన్మార్‌లో స్వేచ్ఛాయుత ఎన్నికలకు రంగం సిద్ధమైంది. నవంబర్ 8న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఉక్కుమనిషి ఆంగ్ సాన్ సూకీ నేతృత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్ఎల్‌డీ) పార్టీ, అధికార యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్‌మెంట్ పార్టీ (యూఎస్‌డీపీ) హోరాహోరీగా తలపడుతున్నాయి. దాదాపు 25 ఏళ్ల తర్వాత దేశంలో తొలిసారి స్వేచ్ఛాయుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరుగనున్న సార్వత్రిక ఎన్నికలు కావడంతో.. ఈ పోలింగ్‌పై కేవలం ఆ ఒక్క దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కూడా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న యూఎస్‌డీపీకి సైనిక మద్దతు పుష్కలంగా ఉండగా, సూకీ నేతృత్వంలోని ఎన్ఎల్‌డీ మళ్లీ దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నది. ఇరు పార్టీలూ గెలుపు మీద ధీమాతో ఉన్నాయి.
అధికార యూఎస్‌డీపీకి గతంలో నియంతృత్వం చెలాయించిన సైనిక పెద్దల నుంచి మద్దతు ఉన్నది. స్థానికంగా మీడియా వెన్నుదన్ను ఉంది. అక్రమాలతో కూడిన 2010 ఎన్నికల్లో గెలిచిన ఈ పార్టీకి పెద్దసంఖ్యలో అనుచరులు ఉన్నారు. ఈ ఐదేళ్ల హయాంలో యూఎస్‌డీపీ సర్కారు కొన్ని చర్యలతో ప్రజలను మెప్పించగలిగింది. దేశంలోని పలు వేర్పాటువాద గ్రూపులతో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకుంది. విదేశీ పెట్టుబడులు పెద్ద ఎత్తున ఆకర్షించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించింది. ఇవే తమ ప్రధాన ప్రచారాంశాలుగా చేసుకున్న యూఎస్‌డీపీ తాము 75 శాతం ఓట్లతో గెలుస్తామని ధీమాగా చెప్తున్నది. మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ప్రస్తుత అధ్యక్షుడు, యూఎస్‌డీపీ అధినేత థీన్ సీన్ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు చాలామంది సైనిక అధికారులు తమ పదవులు విడిచిపెట్టి యూఎస్‌డీపీ తరఫున ఎన్నికల గోదాలో దిగారు.
మరోవైపు తిరుగులేని ప్రజాదరణ కలిగిన నాయకురాలైన ఆంగ్‌సాన్ సూకీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రభుత్వ కనుసన్నలో ఉన్న మయన్మార్ మీడియా పెద్దగా మద్దతు తెలుపకపోయినా.. ఆమె నేరుగా ప్రజల్లోకి వెళుతున్నారు. ప్రస్తుత ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా జరిగితే మరోసారి ఆంగ్‌సాంగ్ సూకీ విజయం సాధించే అవకాశముందని అంతర్జాతీయ పరిశీలకులు చెప్తున్నారు.
స్వేచ్ఛాయుతంగా పోలింగ్ జరిగేనా?
అనేక ఏళ్లు సైనిక పాలనలో మగ్గిన మయన్మార్‌లో ఇటీవలికాలంలో పరిస్థితులు కొంత మెరుగుపడ్డాయి. 2011 ఎన్నికల్లో అనేక అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. అయినప్పటీకి సైనిక మద్దతు ఉన్న యూఎస్‌డీపీ అప్పట్లో అధికారం చేపట్టింది. ప్రస్తుతం అంతర్జాతీయ పరిశీలకుల పర్యవేక్షణలో నవంబర్ 8న ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లోనూ అధికార పార్టీ అనేక అక్రమాలు, దౌర్జ్యనాలకు పాల్పడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. చాలాచోట్ల ప్రతిపక్ష ఎన్ఎల్‌డీ అభ్యర్థులపై, శ్రేణులపై దాడులు జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఓటర్ల జాబితాలోనూ అవకతవకలున్నట్టు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మరోవైపు అతివాద బౌద్ధులు దేశమంతటా పర్యటించి.. ముస్లింలు ఓటువేయకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారు. అంతేకాకుండా ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులు ముస్లిం వ్యతిరేక వైఖరి తీసుకునేలా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ పరిస్థితుల నడుమ ఎన్నికలు ఎంతమేరకు అక్రమాలకు తావులేకుండా శాంతియుతంగా జరుగుతాయనే దానిపై కొంత ఆందోళన నెలకొంది.
అయితే 1990లో జరిగిన ఎన్నికల్లో ఇంతకంటే తీవ్రస్థాయిలో అక్రమాలు జరిగాయి. అయినా ఆంగ్‌సాన్ సూకీ నేతృత్వంలోని ప్రతిపక్ష ఎన్ఎల్‌డీ అప్పట్లో ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత అనేక సంవత్సరాలు సైనిక పాలకులు ఆమెను గృహనిర్బంధంలో ఉంచారు. అయినా చెక్కుచెదరని ఉక్కుసంకల్పంతో మరోసారి ఎన్నికల బరిలోకి దిగారు సూకీ. ఎన్నికల్లో అక్రమాల మాట ఎలాఉన్నా.. పోలింగ్ నాడు ప్రజలతో ముందుకొచ్చి ఓటు వేస్తే.. ఆమె విజయం తథ్యమని, 67శాతం ఓట్లతో ఆమె నేతృత్వంలోని ప్రతిపక్ష ఎన్ఎల్‌డీ విజయం సాధించే అవకాశముందని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు.