యాంగోన్: ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని చెలాయిస్తున్న మయన్మార్ సైనిక ప్రభుత్వం వారి నిర్బంధంలో ఉన్న కీలక నేతలను జైలుకు పంపే చర్యలను తీవ్రం చేసింది. ఇప్పటికే ఎన్నికల్లో కుట్ర, అవినీతి ఆరోపణలపై బహిష్కృత నేత ఆంగ్ సాన్ సూకీపై కేసులు పెట్టి విచారిస్తుండగా.. తాజాగా రెండు అభియోగాలపై అక్కడి ప్రత్యేక కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. కోవిడ్ కాలంలో ప్రజల్ని రెచ్చగొట్టడం, కరోనావైరస్ నియంత్రణలను ఉల్లంఘించారనే ఆరోపణలపై ఆమెకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది.
ఈ ఏడాది ఫిబ్రవరి 1న ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసిన సైన్యం 76 ఏళ్ల సూకీతోపాటు మరికొంత మంది నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ పార్టీ నేతలను నిర్బంధంలో ఉంచిన సంగతి తెలిసిందే. తమ పార్టీ ఫేస్‌బుక్ పేజీలో ప్రజల్ని రెచ్చగొట్టే పోస్టులు పెట్టారని, అలాగే గత నవంబర్ ఎన్నికల సమయంలో కోవిడ్ నిబంధనలు పాటించకుండా వేలాది మందితో ర్యాలీ నిర్వహించారని సైన్యం ఆరోపించింది.
(చదవండి: Time Traveller Prediction On 2021: డిసెంబర్ 25న ప్రపంచానికి భారీ షాక్.. మారనున్న జీవితాలు’)
కాగా, గత నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఆంగ్‌సాన్ సూకీ నేతృత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ పార్టీ రెండో దఫా కూడా ఘన విజయం సాధించగా.. సైన్యం, దాని మిత్ర పక్షాలు పార్టీలు ఘోర ఓటమిపాలయ్యాయి. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించిన సైన్యం ఫిబ్రవరిలో ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసింది. ఇక సైన్యం అరాచకాలకు వ్యతిరేకంగా ఇప్పటికే ప్రజలు నిరసనలతో హోరెత్తుతుండగా ఆంగ్ సాన్‌కి జైలు శిక్ష విధించడం మరింత ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉంది.
(చదవండి: అప్పుడే పుట్టిన నవజాత శిశువు పేరు ‘బోర్డర్’..ఎందుకో తెలుసా?)
Comments
Please login to add a commentAdd a comment