
మయన్మార్‌లోని రఖైన్ ప్రావిన్స్‌లో అస్థిర పరిస్థితులు నెలకొన్నాయి. అటువంటి పరిస్థితిలో అక్కడున్న భారతీయ పౌరుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వారు అక్కడి నుండి బయటపడాలని భారత్ కోరింది. రఖైన్ ప్రావిన్స్ సురక్షితంగా లేదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ భారతీయ పౌరులను హెచ్చరించింది.
క్షీణిస్తున్న భద్రతా పరిస్థితి, ల్యాండ్‌లైన్‌లతో సహా టెలికమ్యూనికేషన్‌కు అంతరాయం, నిత్యావసర వస్తువుల కొరత తదితర కారణాల దృష్ట్యా భారతీయ పౌరులెవరూ రఖైన్ రాష్ట్రానికి వెళ్లవద్దని విదేశాంగ మంత్రిత్వ శాఖ భారతీయ పౌరులను హెచ్చరించింది. ఇప్పటికే అక్కడ ఉన్న భారతీయ పౌరులు వెంటనే ఆ రాష్ట్రం విడిచి వెళ్లాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచించింది.
2021, ఫిబ్రవరి ఒకటి నుంచి మయన్మార్‌లో అస్థిరత నెలకొంది. సైనిక తిరుగుబాటులో దేశ అధికారాన్ని స్వాధీనం చేసుకున్నప్పటి నుండి మయన్మార్‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ పలు హింసాత్మక నిరసనలు జరిగాయి. అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. మయన్మార్‌లో నెలకొన్న అస్థిరత మన దేశంపై ప్రభావం చూపబోతోందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. మయన్మార్ మన పొరుగు దేశం కావడంతో అక్కడ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని కోరుకుంటున్నామన్నారు. భారతదేశంలోని పలు ఈశాన్య రాష్ట్రాల సరిహద్దులు మయన్మార్‌తో అనుసంధానమై ఉన్నాయి. భారతదేశం, మయన్మార్‌లు దాదాపు 1,640 కిలోమీటర్ల పొడవైన సరిహద్దును పంచుకుంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment