జనస్వామ్యం దిశగా...
అర్ధ శతాబ్దికి పైగా సైనిక దుశ్శాసనమే పాలనగా చలామణి అవుతున్న మయన్మార్‌లో ఆదివారం సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఉక్కు తెరల వెనక తాము రాసిందే రాజ్యాంగంగా...చెప్పిందే ప్రజాస్వామ్యంగా ఇష్టానుసారం అమలు చేస్తున్న పాలకులు తప్పనిసరై ఈ ఎన్నికలకు సిద్ధపడ్డారు. ఎన్నో ఆంక్షల్లో, మరెన్నో పరిమితులతో జరగబోతున్న ఈ ఎన్నికల్లో ఉద్యమ పుత్రిక ఆంగ్‌సాన్ సూచీ నేతృత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ(ఎన్‌ఎల్‌డీ)... యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్‌మెంట్ పార్టీ(యూఎస్‌డీపీ)ప్రధానంగా తలపడబోతున్నాయి. తమలో కొంతమందిచేత రాజీనామా చేయించి సైనిక పెద్దలే నెలకొల్పిన పార్టీ యూఎన్‌డీపీ. ఇంకా రంగంలో 91 పార్టీలున్నాయి. ఎన్‌ఎల్‌డీని ఓడించడానికి సైన్యం పరోక్షంగా పుట్టించిన పార్టీలే వీటిల్లో ఎక్కువ.
ఈ ఎన్నికల తర్వాత ఏమవుతుంది? మయన్మార్‌లో ప్రజాస్వామ్యం వికసిస్తుందా? అన్ని పార్టీలూ, ప్రజా సంఘాలూ స్వేచ్ఛగా తమ అభిప్రాయాలనూ, సిద్ధాంతాలనూ ప్రచారం చేసుకోవడానికి వీలవుతుందా? ఇందులో ఏం జరిగినా, జరగకున్నా ఆంగ్‌సాన్ సూచీ దేశాధ్యక్షురాలు కావడం మాత్రం అసాధ్యం. ఆమె అధ్యక్ష పీఠం అధిరోహించకుండా చేసే నిబంధనలన్నిటినీ రాజ్యాంగంలో పొందుపరిచాకే ఈ ప్రజాస్వామ్య నాటకానికి సైనిక పాలకులు తెరలేపారు. ఎందుకంటే 1962లో సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకున్నాక తొలిసారి 1990లో పార్లమెంటు ఎన్నికలు జరిపినప్పుడు సూచీ తిరుగులేని మెజారిటీ సాధించారు. అయితే, ఆ ఫలితాలను తాము గుర్తించబోమని సైనిక పాలకులు ప్రకటించి ఆమెను 20 ఏళ్లపాటు ఖైదు చేశారు. మళ్లీ ఆ పరిస్థితి రావచ్చునన్న భయంతోనే సూచీకి తలుపులు మూసేవిధంగా రాజ్యాంగాన్ని రూపొందించారు.
2008లో రిఫరెండం పేరిట అమల్లోకి తీసుకొచ్చిన రాజ్యాంగం ప్రకారం... దంపతుల్లో ఎవరైనా విదేశీయులైన పక్షంలో అధ్యక్ష పదవికి పోటీచేసేందుకు వారు అనర్హులవుతారు. ఆఖరికి పిల్లలు విదేశాల్లో పుట్టి ఉన్నా తల్లిదండ్రులిద్దరూ అనర్హులే. ఈ నిబంధనలు సూచీని దృష్టిలో పెట్టుకుని రూపొందించినవే. మరణించిన ఆమె భర్త బ్రిటన్ జాతీయుడు. పిల్లలిద్దరూ అక్కడ పుట్టినవారే. కనుకనే ఆమె అధ్యక్ష పీఠం అధిరోహించడం వీలుపడదు. అందుకే సమర్ధతగల వ్యక్తిని అధ్యక్ష పదవికి ఎంపిక చేస్తామని సూచీ ఎన్నికల సభల్లో చెబుతున్నారు. అధ్యక్ష పదవికంటే తాను ఉన్నతురాలిగా ఉంటానని అంటున్నారు. ఎన్నికల తర్వాత నిశ్చయంగా జరగబోయేది ఒకే ఒక్కటి-యూఎన్‌డీపీ నెగ్గినా, ఓడినా సైన్యం ఎప్పటిలానే శక్తిమంతంగా ఉంటుంది. దేశాన్ని శాసిస్తుంది.
ఈ ఎన్నికలు ఎన్ని పరిమితుల్లో జరుగుతున్నాయో గమనిస్తే మయన్మార్‌లో ఉన్నది ప్రజాస్వామ్యమేనా అన్న అనుమానం ఎవరికైనా కలుగుతుంది. హ్లుతా గా పిలిచే మయన్మార్ పార్లమెంటులో 440మంది సభ్యులుండే ప్రతినిధుల సభ, 224మంది సభ్యులుండే వివిధ జాతుల సభ ఉంటాయి. ఈ 664 స్థానాల్లో 75 శాతం స్థానాలకు మాత్రమే ప్రస్తుతం ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అంటే ప్రతినిధుల సభలోని 330 స్థానాలకూ...జాతుల సభలోని 168 స్థానాలకూ ప్రజలు ఓట్లేయవలసి ఉంటుంది. మిగిలిన 25 శాతం స్థానాలూ(166) సైన్యానివే. పైగా పార్లమెంటు ఏ రాజ్యాంగ సవరణను ఆమోదించినా దాన్ని వీటో చేసే అధికారం సైనిక ప్రతినిధులకుంటుంది. ఈ రెండు సభలూ చెరొక అభ్యర్థినీ అధ్యక్ష పదవికి ఎంపిక చేస్తాయి.
సైనిక ప్రతినిధులు విడిగా తమ అభ్యర్థిని ప్రకటిస్తారు. పార్లమెంటు సంయుక్త సమావేశంలో ఈ ముగ్గురిపైనా ఓటింగ్ నిర్వహిస్తారు. ఇందులో విజేత దేశాధ్యక్షుడవుతారు. ఓడిన ఇద్దరూ ఉపాధ్యక్షులవుతారు. అధ్యక్ష ఎన్నికే ఇంత కంగాళీగా ఉన్నదనుకుంటే ...ఓటర్ల జాబితాలు మరింత అయోమయంగా ఉన్నాయి. హింసాత్మక ప్రాంతాలుగా ప్రకటించినచోట జాబితాలూ లేవు...ఎన్నిక లూ లేవు. అలాగే పది లక్షలమంది రోహింగ్యా ముస్లింలను రాజ్యరహిత పౌరులుగా ప్రకటించి వారినసలు జాబితాల్లోనే చేర్చలేదు.
ఈ ఎన్నికల్లో నెగ్గి అధికారాన్ని చేపట్టబోయే ప్రభుత్వానికి తలకు మించిన సమస్యలు సిద్ధంగా ఉన్నాయి. తమ ఆశల్ని, ఆకాంక్షల్ని వ్యక్తం చేయడానికి అనువైన ప్రజాస్వామిక వేదిక లేకపోవడంతో దాదాపు అన్ని జాతులూ తమ ప్రయోజనాల సాధనకు ఘర్షణ మార్గాన్నే ఎంచుకున్నాయి. ఆ ఘర్షణ ప్రభుత్వంతో మాత్రమే కాదు...తమ ప్రయోజనాలను కొల్లగొట్టే అవకాశమున్నదని భావించే వేరొక తెగపై కూడా! సాయుధ పోరాట బాటపట్టిన 15 ముఖ్యమైన జాతుల్లో ఏడెనిమిదింటితో ప్రస్తుత ప్రభుత్వం కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందానికి వెలుపల ఉండిపోయినవాటిలో రెండు సంస్థలు కీలకమైనవి... భవిష్యత్తు ప్రభుత్వానికి తలనొప్పులు తెచ్చేవి.
నోబెల్ శాంతి బహుమతి కూడా పొందిన ఆంగ్‌సాన్ సూచీ ఈ జాతుల సమస్యల గురించిగానీ...బౌద్ధ మిలిటెంట్ గ్రూపుల చేతుల్లో దారుణమైన హింసను చవిచూసి, ప్రభుత్వ తిరస్కారానికి గురై దుర్భరమైన స్థితిలో శిబిరాల్లో గడుపుతున్న రోహింగ్యా ముస్లింల గురించిగానీ నోరెత్తలేదు. తమ ప్రభుత్వం వస్తే అన్నీ పరిష్కరిస్తామనడమే తప్ప రోహింగ్యాలను పౌరులుగా గుర్తించి, వారికి గౌరవప్రదమైన స్థానం ఇవ్వాలని కూడా ఆమె అడగలేదు. అయినప్పటికీ ఆమెను రోహింగ్యాల ఏజెంటుగా బౌద్ధ మిలిటెంట్లు ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి స్థితిలో ఆ ప్రజల గురించి ప్రస్తావించకపోవడమే మంచిదని ఆమె నిర్ణయించుకున్నట్టు కనబడుతోంది. ఇన్ని అవరోధాలమధ్యా, ఇన్ని అవాంతరాలమధ్యా ఆమె పార్టీకి 1990లో వచ్చినట్టుగా ఈసారి అఖండ మెజారిటీ రావడం అంత సులభం కాకపోవచ్చునని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటికీ సూచీయే దేశంలో జనాకర్షణ గల ఏకైక నేత.
మౌలిక సదుపాయాల లేమితో, ఆర్ధికంగా అంతంతమాత్రంగా ఉన్న మయన్మార్ నిలదొక్కుకోవాలన్నా, ఎంతో కొంత అభివృద్ధిని సాధించాలన్నా ఏదో రూపంలో ప్రజాస్వామ్యం ఉండటం తప్పనిసరని సైనిక పాలకులు గుర్తించారు. కనుకనే ఇప్పుడీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మన పొరుగు దేశం గనుకా... మనతో ఈశాన్య ప్రాంతంలో 1,600 కిలోమీటర్ల సరిహద్దు ఉన్నది కనుకా మయన్మార్‌లో సుస్థిరమైన, ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వం ఏర్పడటం మన భద్రతకూ, క్షేమానికీ ముఖ్యం. అందుకే మయన్మార్ ప్రజల వినూత్న ప్రయాణం విజయవంతం కావాలని ఆకాంక్షించాలి.